VinFast Eyes On Indian EV Market: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై గట్టి ఫోకస్ పెట్టింది. తాజాగా కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్ డిజైన్లకు పేటెంట్ ఫైల్ చేసింది. వీటిలో ఒకటి వైపర్ ఎలక్ట్రిక్ స్కూటర్, మరొకటి సులాద్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్. ప్రస్తుతం ఈ మోడల్స్ పై మార్కెట్ లో ఆసక్తి నెలకొంది.
జూన్ 2026లో స్పోర్టీ లుక్‌తో ఉన్న ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కు పేటెంట్ లభించింది. తాజాగా దాఖలైన డిజైన్ ను పరిశీలిస్తే, అది వియత్నాంలో అమ్ముతున్న వైపర్ స్కూటర్ ను దాదాపు పోలి ఉంటుంది. డిజైన్ లో కొన్ని చిన్న మార్పులు కనిపించినప్పటికీ, మొత్తం స్టైలింగ్ మాత్రం అలాగే ఉంది. స్కూటర్ ముందు భాగంలో షార్ప్ హెడ్ ల్యాంప్ డిజైన్, స్పోర్టీ బాడీ లైన్స్, ఐదు స్పోక్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ తో ఈ స్కూటర్ రూపొందించబడింది.
ప్రస్తుతం వియత్నాంలో అమ్ముతున్న వైపర్ స్కూటర్‌లో 4.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనికి 3 kW హబ్ మౌంటెడ్ మోటార్ యాడ్ చేశారు. సిటీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా ఈ మోడల్ ను రూపొందించారు. భారత మార్కెట్ లో కూడా ఇదే పవర్ ట్రెయిన్ లేదంటే చిన్న మార్పులతో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
విన్‌ఫాస్ట్ దాఖలు చేసిన రెండో పేటెంట్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ పరిచయం చేసిన సులాద్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే, ఇందులో 50 kW సామర్థ్యమున్న ఎలక్ట్రిక్ మోటార్ ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగం అందుకోగలదని తెలుస్తోంది.
విన్‌ఫాస్ట్ ఇప్పటికే 2026లో భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని ప్రకటించింది. మొదట మూడు స్కూటర్ మోడళ్లను మాత్రమే తీసుకురావాలని భావించినా, తాజా పేటెంట్లతో కంపెనీ ప్రణాళికలు మరింత విస్తరించనున్నట్లు తెలుస్తోంది. స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను కూడా భారత మార్కెట్‌కు తీసుకురావాలని భావిస్తోంది. దీంతో భారత ఈవీ మార్కెట్లో విన్‌ఫాస్ట్ మరింత గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ రెండు వాహనాల విడుదలపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: టీవీఎస్ నుంచి సూపర్ సర్ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!