E-Paper
Advertisement

Tamil Nadu Elections: టీవీకే పొత్తు ఎవరితో? విజయ్ చుట్టూ తమిళ రాజకీయం..

Tamil Nadu Elections: టీవీకే పొత్తు ఎవరితో? విజయ్ చుట్టూ తమిళ రాజకీయం..
Advertisement

Tamil Nadu Elections: మొత్తం సౌత్ ఇండియాలోనే.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ నడిచే ఒకే ఒక్క రాష్ట్రం తమిళనాడు. అలాంటి తమిళ రాజకీయాల్లో.. ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఓ పక్క బీజేపీ విజయ్‌తో జత కట్టాలని చూస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ కూడా డీఎంకేని కాదని విజయ్ పార్టీ టీవీకేతో వెళ్లాలనే యోచనలో ఉంది. మొత్తంగా.. తమిళనాడు రాజకీయం మొత్తం విజయ్ పార్టీ చుట్టే తిరుగుతోంది. ఎందుకోసం.. కాంగ్రెస్, బీజేపీ విజయ్ వైపు చూస్తున్నాయ్?

విజయ్ పార్టీనే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోందా?
విజయ్ పార్టీనే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతోందా? డీఏంకేని దించాలంటే టీవీకే సపోర్ట్ కావాలా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పరిశీలించినా.. జరగబోయే పరిణామాలను ఊహించినా.. తమిళనాడు పొలిటికల్ పిక్చర్‌లో ఊహించని ట్విస్ట్‌లు ఉండే అవకాశం ఉందనే విషయం అర్థమవుతోంది. అయితే.. పిక్చర్ అబీ బాకీ హై!

Advertisement

టీవీకేతో వెళ్లాలనే ఆలోచనలో కాంగ్రెస్!
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. తమిళనాడు రాజకీయాల్లో పొత్తులు కత్తులు దూస్తున్నాయ్. అందుకే.. అక్కడి రాజకీయాల్లో కొత్త కథ మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా.. తమిళనాడులో ఎప్పటి నుంచో బలపడాలనుకుంటున్న బీజేపీ.. ఈసారి విజయ్ పార్టీ వైపు చూస్తోంది. మరోవైపు.. సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్-డీఎంకే మధ్య సయోధ్య కుదరట్లేదు. దాంతో.. హస్తం పార్టీ కూడా విజయ్ టీవీకే పార్టీతోనే వెళ్లాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే.. పీఎంకే పార్టీ డీఎంకే కూటమిని వీడి.. ఎన్డీయే కూటమిలో చేరింది. పీఎంకే నేతలు ఏఐడీఎంకే ముఖ్య నేతలను కలిసి.. ఎన్డీయేలో చేరుతున్నట్లు ప్రకటించేశారు కూడా. కానీ.. బీజేపీ మాత్రం ఏఐడీఎంకేని ఇప్పుడు సీరియస్‌గా తీసుకోవడం లేదనే చర్చ కూడా జరుగుతోంది. ఇటీవలే.. తమిళనాడు వెళ్లిన అమిత్ షా కూడా.. కేవలం బీజేపీ నేతలతో మాత్రమే కీలక చర్చలు జరిపి వచ్చారు తప్ప.. అన్నాడీఎంకే నేతలను కలవలేదు. పీఎంకే పార్టీ కూటమిలో చేరడంతో.. అన్నాడీఎంకే నేత పళని స్వామి అమిత్ షాని కలిసేందుకు సిద్ధమవుతున్నారు. దాంతో.. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోందనేది ఉత్కంఠ రేపుతోంది.

బీజేపీ, కాంగ్రెస్ విజయ్ వైపు చూడటమే ఇంట్రస్టింగ్
విజయ్ ఎంట్రీతో.. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి దిగ్గజ పార్టీల నడుమ.. మూడో ఆల్టర్నేట్ పార్టీ బలపడటమే కాదు.. జాతీయ పార్టీలైన బీజేపీ,క కాంగ్రెస్ కూడా విజయ్ వైపే చూడటం ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది. అసలు.. ఈ రెండు నేషనల్ పార్టీలు.. కొత్తగా వచ్చిన తమిళగ వెట్రి కజగం లాంటి పార్టీ వైపు ఎందుకు చూస్తున్నాయనేదే ఇప్పుడు తలెత్తుతున్న మేజర్ క్వశ్చన్. కానీ.. దీని వెనుక ఆసక్తికరమైన రాజకీయం దాగుందంటున్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి.. ఇదే సమయంలో.. తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌కు.. విజయ్ ఓ గేమ్ ఛేంజర్‌లా కనిపిస్తున్నారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయ్. విజయ్‌కి తమిళనాడులో ఫ్యాన్ బేస్ ఎక్కువ. ముఖ్యంగా.. ఫస్ట్ టైమ్ ఓటర్లు, డీఎంకే, అన్నాడీఎంకే పట్ల అసంతృప్తిగా ఉన్న ఓటర్లు.. విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయ్. టీవీకే పార్టీకి 20 శాతానికి పైగా ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయ్. దాంతో.. విజయ్‌తో పొత్తు కుదిరితే.. అధికారం సులభమవుతుందని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

స్టాలిన్ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదనే భావనలో కాంగ్రెస్..
ప్రస్తుత.. కాంగ్రెస్.. డీఎంకేకు మిత్రపక్షంగా ఉంది. అయితే.. స్టాలిన్ ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని, కనీసం మంత్రి పదవులు కూడా ఇవ్వలేదని.. తమిళనాడు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో నిరూపించుకునేందుకు కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనుకుంటోంది. అందుకోసమే.. సీట్ షేరింగ్‌లో 40 సీట్లు కావాలని పట్టుబడుతోంది. అంతేకాదు.. డీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలిస్తే.. ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషించాలని చూస్తోంది. అయితే.. డీఎంకే మాత్రం కాంగ్రెస్‌కు 32 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు. దాంతో.. కాంగ్రెస్ నాయకత్వమే కాస్త వెనక్కి తగ్గి తమ డిమాండ్‌ని 38 సీట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఇటీవలే విజయ్ టీవీకే పార్టీ ప్రతినిధులు.. కాంగ్రెస్‌ని సహజ మిత్రుడని పిలవడం, రాహుల్ గాంధీతో విజయ్‌కి ఉన్న సత్సంబంధాలు.. టీవీకే, కాంగ్రెస్ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయ్. ఒకవేళ.. డీఎంకే గనక సీట్ల పంపకం విషయంలో మొండికేస్తే.. కాంగ్రెస్ విజయ్‌తో వెళ్లేందుకైనా సిద్ధమనే సంకేతాలు పంపుతోంది.

అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా బీజేపీ వ్యూహం
మరోవైపు.. అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా బీజేపీ వ్యూహం పన్నుతున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా ఎదగడం కష్టమని.. కమలదళం నాయకత్వానికి తెలుసు. గతంలో.. అన్నాడీఎంకేతో పోత్తు పెట్టుకున్నా.. ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు.. విజయ్ రూపంలో గ్లామరస్, క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ దొరకడంతో.. అతనితోనే జతకట్టి, డీఎంకే ఎత్తులను చిత్తు చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే.. విజయ్ తన సిద్ధాంతాల్లో.. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా ప్రకటించడమే పెద్ద అడ్డంకిగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు దీనిని ఎలా అధిగమిస్తారన్నది కూడా ఆసక్తి రేపుతోంది. విజయ్ టీవీకే పార్టీ కూడా.. తమ ప్రధాన శత్రువు డీఎంకేనే అని ప్రకటించారు. ఒంటరిగానే.. 234 స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. అయితే.. కాంగ్రెస్ డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ.. లోలోపల విజయ్ పార్టీతో చర్చలు సాగిస్తోందనే ప్రచారం కూడా తమిళ రాజకీయాల్లో సాగుతోంది. బీజేపీ కూడా విజయ్‌ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అది కుదరకపోతే.. అన్నాడీఏంకేతో కలిసి.. మూడో కూటమిని బలోపేతం చేయాలని చూస్తోంది. ఇప్పటికే.. డీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే పార్టీ ఎన్డీయే కూటమిలో చేరిపోయింది. అయినా.. బీజేపీ విజయ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తోంది.

స్ట్రాంగ్ పొలిటికల్ పవర్‌గా విజయ్ ఫ్యాక్టర్
తమిళ రాజకీయాల్లో ఇప్పుడు విజయ్ ఫ్యాక్టర్.. స్ట్రాంగ్ పొలిటికల్ పవర్‌గా కనిపిస్తోంది. ఆయన డీఎంకే ఓట్లను చీలుస్తారా? అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేస్తారా? అనేదే.. ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల్లో.. తేలాల్సింది కూడా ఇదే! ఎన్నికల తర్వాత ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. అప్పుడు కాంగ్రెస్ గానీ, బీజేపీ మద్దతుతో గానీ విజయ్ నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయ్.

తమిళనాడులో పొత్తులు.. కత్తులు దూస్తున్నాయ్. మరి.. ఈ కత్తులకు బలయ్యేదెవరు? బలపడేదెవరు? సీట్ల షేరింగ్ దగ్గర విడిపోతే.. పడిపోయేదెవరు? డీఎంకేని దించాలన్నా.. పవర్‌లో పాలు పంచుకోవాలన్నా.. కాంగ్రెస్, బీజేపీ.. విజయ్ పార్టీతో జట్టు కట్టక తప్పదా? పొత్తుల విషయంలో.. విజయ్ టీవీకే పార్టీ ఎలా ఆలోచిస్తోంది? తొలిసారి ఎన్నికలను ఎదుర్కోబోతున్న విజయ్.. ఒంటరిగానే పోటీ చేస్తారా? కూటమిగా బరిలో దిగుతారా?

దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఫైట్
తమిళనాడు రాజకీయం ఇప్పుడు ఒక రసవత్తరమైన మలుపులో ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉన్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ సెగలు ఎప్పుడో మొదలయ్యాయి. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య సాగుతున్న ఫైట్‌లోకి.. ఇప్పుడు దళపతి విజయ్ తన తమిళగ వెట్రి కజగం పార్టీతో ఎంట్రీ ఇచ్చారు. దాంతో.. తమిళనాడులో సమీకరణాలు మారిపోతున్నాయ్. పొత్తుల విషయంలో కొత్త ఎత్తుగడలు రూపుదిద్దుకుంటున్నాయ్. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలు.. విజయ్‌తో జట్టు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఆలోచన ఎలా ఉందనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఒంటరి పోరాటమా? కూటమితో ప్రయాణమా? విజయ్ వ్యూహం ఏంటనేది.. టాక్ ఆఫ్ ది తమిళనాడుగా మారింది.

తమిళనాడులో కూటమి రాజకీయాలదే పైచేయి!
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ కూటమి రాజకీయాలదే పైచేయి. గత ఎన్నికల చరిత్ర చూస్తే, ఒంటరిగా బరిలోకి దిగిన ఏ పార్టీ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే.. విజయ్ ఇప్పటికే తన సిద్ధాంతాలను, రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. దానిని బట్టి చూస్తే.. ద్రవిడ సిద్ధాంత, జాతీయవాదం కలిసిన ఓ కొత్త పంథాను అనుసరించే అవకాశం ఉంది. విజయ్ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఏమిటంటే.. పవర్ షేరింగ్. ఇది.. ఇప్పటివరకు డీఎంకే గానీ, అన్నాడీఎంకే గానీ చేయని సాహసం. చిన్న పార్టీలను ఆకర్షించేందుకు.. విజయ్ వేస్తున్న ప్రధాన గాలం ఇదే. ప్రస్తుతానికి.. విజయ్ ఒంటరి పోరాటమని చెబుతున్నా.. ఎన్నికల సమయానికి లైక్ మైండెడ్ పార్టీలతో కూటమి కట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయ్.

సీఎం స్టాలిన్ నాయకత్వంలోని బలంగా డీఎంకే కూటమి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో విజయ్ సీరియస్‌గానే కనిపిస్తున్నప్పటికీ.. డీఎంకే కోటని బద్దలు కొట్టడం అతని వల్ల అవుతుందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే.. సీఎం స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి చాలా బలంగా కనిపిస్తోంది. లోలోపల అసంతృప్తి సెగలు ఉన్నా.. అవేమీ పెద్దగా ఇంపాక్ట్ చూపే స్థాయిలో లేవు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా డీఎంకే ఇచ్చే తక్కువ సీట్లతో.. ప్రతిసారి రాజీ పడుతోంది. ఒకవేళ విజయ్ టీవీకే పార్టీ గనక కాంగ్రెస్‌కు కాస్త గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇచ్చి, అధికారంలో వాటా ఇస్తామంటే.. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఏదైనా తేడాకొట్టి.. కాంగ్రెస్ డీఎంకే కూటమి నుంచి బయటకు వస్తే.. ఓట్ల చీలిక నేరుగా డీఎంకేని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. ఇది విపక్షాలకు వరంగా మారుతుంది. తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి.. లోకల్‌గా బలమైన ఫేస్ వాల్యూ ఉన్న లీడర్ అవసరం. అందుకోసమే.. విజయ్ పార్టీని తమవైపు తిప్పుకోవాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీతో.. విజయ్‌కి మంచి సంబంధాలున్నాయని చెబుతోంది. డీఎంకేతో గనక సీట్ల సర్దుబాటు కుదరకపోతే.. విజయ్ టీవీకే పార్టీ, కాంగ్రెస్ కూటమి.. తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారే ఛాన్స్ ఉంది.

Also Read: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్.. చంద్రబాబు వైఖరిపై జగన్ ఫైర్

ఏదేమైనా.. తమిళనాడు పాలిటిక్స్‌లో విజయ్ పార్టీ ఓ స్పార్క్ క్రియేట్ చేసింది. దళపతి ఎంట్రీతో.. రాష్ట్రంలోని న్యూట్రల్ ఓటర్లు, యూత్ ఓట్లు కీలకంగా మారనున్నాయ్. విజయ్ ఒంటరిగా పోటీ చేసినా.. కనీసం 20 శాతం ఓట్లు చీల్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయ్. విజయ్ గనక పొత్తులతో ఎన్నికలకు వెళితే మాత్రం.. స్టాలిన్ సర్కార్‌కు స్ట్రాంగ్ సవాల్ ఎదురవడం ఖాయం. సీట్ల షేరింగ్ దగ్గర తేడాలొస్తే పడిపోయేది మాత్రం ప్రస్తుతమున్న కూటములే. ఇది మాత్రం క్లియర్. కానీ.. దళపతి వేయబోయే తొలి అడుగు ఎలా ఉండబోతోందనేది.. తమిళనాడు రాజకీయాలను ఇంత ఆసక్తికరంగా మార్చేసింది. ఈ పొత్తుల.. ఎత్తుల్లో చిత్తయ్యేది ఎవరో.. త్వరలోనే తేలిపోతుంది.

Story By Anup, Bigtv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×