Jagan: ఏపీ-తెలంగాణ నదీ జలాల వ్యవహారంపై మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వైఖరిపై ఆయన మండిపడ్డారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
రాయలసీమ, నెల్లూరు జిల్లాల పాలిట సంజీవని వంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఈ ప్రాజెక్టును తామే అడ్డుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఇది చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి నిదర్శనమని ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తనపై ఉన్న పాత కేసుల భయంతో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి, రాయలసీమ ప్రజల గొంతు కోస్తున్నారని జగన్ విమర్శించారు.
అంతేకాకుండా శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 881 అడుగులకు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయడం సాధ్యపడదు. గత 20 ఏళ్ల నుంచి పరిశీలిస్తే, కేవలం రెండు మూడు సార్లు మాత్రమే అటువంటి పరిస్థితి తలెత్తిందని జగన్ తెలిపారు. ఈ కరువు ప్రాంతాలకు న్యాయం జరగాలంటే, నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు కూడా నీటిని తోడే సామర్థ్యం ఉండాలని, అందుకే 800 అడుగుల వద్దే 3 టీఎంసీల నీటిని తీసుకునేలా తాము ఈ లిఫ్ట్ ప్రాజెక్టును రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితేనే రాయలసీమకు నిరంతరాయంగా సాగు, తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు మౌనం వహించడాన్ని జగన్ తప్పుబట్టారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల ద్వారా 800 అడుగుల లోపే నీటిని తరలిస్తున్నారని, అలాగే SLBC, ఎడమ గట్టు పవర్ హౌస్ ద్వారా 777 అడుగుల నుంచే భారీగా నీటిని ఖాళీ చేస్తున్నారని తెలిపారు. ఒకవైపు తెలంగాణ రోజుకు 8 టీఎంసీల నీటిని ఖాళీ చేస్తుంటే, శ్రీశైలం ఎప్పటికీ నిండుతుందని, కింద ఉన్న రాయలసీమ, నెల్లూరు రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రం తమ ప్రయోజనాల కోసం వేగంగా అడుగులు వేస్తుంటే, చంద్రబాబు మాత్రం మౌనంగా చూస్తున్నారని మండిపడ్డారు.
అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత లాభం కోసం రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టారని జగన్ ఘాటుగా విమర్శించారు. గతంలో ‘ఓటుకు నోటు’ కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు, ఇప్పుడు అదే భయంతో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే తన రాజకీయ ఉనికి ముఖ్యమన్నట్లుగా బాబు వ్యవహరిస్తున్నారని, ఇలాంటి “చరిత్ర హీనులు” దేశంలో మరెక్కడా ఉండరని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు రాయలసీమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: నేటితో ముగియనున్న తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. చివరి రోజు భారీగా పోటెత్తిన భక్తులు..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఉన్న వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని జగన్ పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి, రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన చంద్రబాబు తీరును ప్రజల ముందు ఎండగడతామని, రాయలసీమ గొంతు ఎండిపోకుండా అడ్డుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.