Drug Cartels: డ్రగ్స్.. వ్యసనం మాత్రమే కాదు. అవి ఒక సమాంతర రాజ్యాన్నే నడుపుతాయ్. మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ మెంచో మరణం తర్వాత.. డ్రగ్ మాఫియా సామ్రాజ్యాల గురించి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. ఒక దేశపు సైన్యం కంటే ఎక్కువ ఆయుధ సంపత్తి, ప్రభుత్వాలనే కూల్చేయగల ఆర్థిక బలం ఉన్న మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్ పిన్స్ చాలా మందే ఉన్నారు. ఎల్ చాపో.. మెక్సికోలో ఎక్స్ డ్రగ్ డాన్. ఎల్ మెంచో కంటే ముందు మెక్సికోని, ప్రపంచ డ్రగ్ మార్కెట్‌ని వణికించిన పేరు ఇది. సినాలోవా కార్టెల్ అధిపతిగా డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏలాడు. ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల్లో ఒకరిగా నిలిచాడు. ఇతను రెండుసార్లు హై-సెక్యూరిటీ జైళ్ల నుంచి సొరంగాల ద్వారా తప్పించుకున్నాడు. చికాగో సిటీ.. ఇతన్ని పబ్లిక్ ఎనిమీ నంబర్ వన్‌గా ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలోని అత్యంత కఠినమైన జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
ఎల్ చాపో తర్వాత.. మెక్సికో మళ్లీ ఆ స్థాయికి ఎదిగింది ఎల్ మెంచో. కాలిఫోర్నియాలో హెరాయిన్ సప్లై చేస్తూ యూఎస్ పోలీసులకు దొరికాడు. కొన్నేళ్లు జైలుశిక్ష అనుభవించాక.. అమెరికా యంత్రాంగం అతడిని మెక్సికోకు అప్పగించింది. స్వదేశానికి వచ్చిన తర్వాత.. కొంతకాలం పాటు పోలీసుగా పనిచేశాడు. అదే సమయంలో.. డ్రగ్ మాఫియా కాంటాక్టులు తెలుసుకొని డ్రగ్స్ దందాలోకి దిగాడు. తొలుత మెక్సికోలో శక్తిమంతమైన సినావోలా డ్రగ్ కార్టెల్‌కు చెందిన ముఠాలోనే పనిచేశాడు. 2009లో సొంతంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే డ్రగ్ ముఠాని ఏర్పాటు చేశాడు. డ్రగ్స్ దందాలో తన శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపి.. మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన క్రిమినల్ సిండికేట్‌గా మారాడు. డ్రగ్స్ సరఫరా ఒక్కటే కాదు.. ఈ ముఠా దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యల వంటి అనేక నేరాలకు పాల్పడింది. అమెరికాకు సప్లై అయ్యే సింథటిక్ డ్రగ్స్, ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా వ్యాపారంలో ఎల్ మెంచోదే పైచేయి. మెక్సికో డ్రగ్ కింగ్‌పిన్ ఎల్ చాపో తర్వాత.. ఆ దేశంలో అత్యంత పవర్‌ఫుల్ క్రిమినల్ బాస్‌గా ఎల్ మెంచో మారాడు. అజ్ఞాతంలో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడిని పట్టుకునేందుకు మెక్సికో దశాలు ప్రయత్నించగా రెండుసార్లు తప్పించుకున్నాడు. చివరికి ఎల్ మెంచోని అంతం చేసేందుకు.. ఆ దేశ సైన్యమే రంగంలోకి దిగాల్సి వచ్చింది.
మెక్సికోకు చెందిన వీళ్లిద్దరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ సామ్రాజ్యాలను నిర్మించి, తమ దేశాల ప్రభుత్వాలనే గడగడలాడించిన డ్రగ్ డాన్స్ చరిత్రలో చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ల ప్రస్తావన వస్తే.. మొదట గుర్తొచ్చే పేరు.. పాబ్లో ఎస్కోబార్. మెడెలిన్ డ్రగ్ కార్టెల్ అధినేతగా.. లంచం లేదా చావు అనే సిద్ధాంతంతో కొలంబియాను పదేళ్ల పాటు శాసించాడు. ప్రపంచంలోని 80 శాతం కొకైన్ డ్రగ్ సప్లై ఇతని కంట్రోల్‌లోనే ఉండేది. ఇతను ఎంత శక్తిమంతుడంటే.. ఏకంగా కొలంబియా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకటిగా ఎదిగాడు. తన కూతురికి చలి వేస్తోందని.. ఏకంగా 2 మిలియన్ డాలర్ల నగదును కాల్చి మంట కాచుకున్నాడనే కథలు కూడా ఉన్నాయ్. చివరికి ఇతన్ని పట్టుకునేందుకు.. కొలంబియా ప్రభుత్వం ఏకంగా సైన్యాన్ని దించాల్సి వచ్చింది.
ఇక.. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కూడా ఈ లిస్టులో ఉన్నాడు. డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల సప్లై, ఇంకా చాలా నేరాల్లో ఇతని ముద్ర ఉంది. పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతూ, గల్ఫ్ దేశాల నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో.. డ్రగ్స్ సప్లైని నియంత్రిస్తున్నాడని ఇంటలిజెన్స్ ఏజెన్సీల రిపోర్టులున్నాయ్. దక్షిణాసియాలో డ్రగ్స్ మార్కెట్‌ని శాసించడంలో.. డి-కంపెనీదే కీలకపాత్ర. ఇక.. ఆసియాలో సే చిన్ లాప్ అనే డ్రగ్ కింగ్ పిన్ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా మెథాఫిటమైన్ డ్రగ్ సప్లైలో డామినేషన్ అంతా ఇతనిదే! అందుకే.. ఆసియా ఎల్ చాపో అని పిలుస్తారు. ఆగ్నేయాసియాలోని గోల్డెన్ ట్రయాంగిల్ నుంచి బిలియన్ డాలర్ల డ్రగ్స్ సప్లై చేసేవాడు. ఇతర డ్రగ్ మాఫియాల్లా హడావుడి చేయకుండా, కార్పొరేట్ కంపెనీలా.. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ని నడిపాడు.
అమాడో కార్రిల్లో అని మెక్సికోకు చెందిన మరో డ్రగ్ కింగ్ పిన్ ఉన్నాడు. ఇతన్ని లార్డ్ ఆఫ్ ది స్కైస్‌గా పిలిచేవారు. డ్రగ్స్ రవాణా చేసేందుకు ఇతను ఏకంగా బోయింగ్ 727 విమానాల ఫ్లీట్‌నే వాడేవాడు. అప్పట్లో.. మెక్సికోలో జువారెజ్ డ్రగ్ కార్టెల్ నడిపేవాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ.. ఆపరేషన్ థియేటర్‌లోనే చనిపోయాడు. ఇక.. మయన్మార్ డ్రగ్ సామ్రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు ఖున్ సా డామినేట్ చేశాడు. గోల్డెన్ ట్రయాంగిల్ అయిన మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్ ప్రాంతంలో.. నల్లమందు సామ్రాజ్యాన్ని ఏలాడు. ఇతనికి సొంత సైన్యం కూడా ఉండేది. మయన్మార్ అడవుల్లో.. సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవాడు. ఖున్ సాని.. ఓపియం కింగ్ అని పిలిచేవాడు.
మెక్సికోలో.. ఎల్ చాపో పట్టుబడిన తర్వాత.. సినాలోవా డ్రగ్ కార్టెల్‌ని నడిపించిన మరో సూత్రధారి ఇస్మాయిల్ ఎల్ మాయో. దశాబ్దాల పాటు డ్రగ్ దందాలో ఉన్నా.. 2024లో అరెస్ట్ అయ్యే దాకా ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదు. ఇతని తెలివితేటల ముందు మెక్సికో నిఘా సంస్ధలు తేలిపోయాయ్. కొలంబియాలో డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏలిన వారిలో గ్రిసెల్డా బ్లాంకో కూడా ఉంది. ఈమెని.. కొకైన్ గాడ్ మదర్ అని పిలిచేవారు. పాబ్లో ఎస్కోబార్ కంటే ముందే.. మయామిలో డ్రగ్ నెట్‌వర్క్‌ని సృష్టించింది. అత్యంత క్రూరమైన మహిళగా పేరుంది. డ్రగ్స్ దందా కోసం సొంత భర్తని కూడా చంపేసిందనే ఆరోపణలున్నాయ్. మెక్సికోలో మొన్నటిదాకా ఎల్ మెంచో నాయకత్వంలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అత్యంత భయంకరంగా ఉండేది. ఇప్పుడు మెక్సికో దళాల ఆపరేషన్ ఎల్ మంచో చనిపోయాడు. ఇది.. మెక్సికోలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ మాఫియాలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది.
డ్రగ్ కార్టెల్స్ అనేవి.. డ్రగ్ కింగ్ పిన్స్ నడిపే ముఠాలు మాత్రమే కాదు. చాలా దేశాల్లో సమాంతర ప్రభుత్వాలను నడిపే స్థాయికి ఎదిగిన అదృశ్య సామ్రాజ్యాలు. ఓ దేశపు ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం వెనుక విస్తుపోయే నిజాలెన్నో ఉన్నాయ్. డ్రగ్స్ కార్టెల్స్ బలం కేవలం ఆయుధాల్లోనే లేదు. వారి దగ్గరున్న అంతులేని డబ్బులో ఉంది. వరల్డ్ వైడ్ డ్రగ్ మార్కెట్ విలువ కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో మనీ ఫ్లో అవుతున్నప్పుడు.. రాజకీయన నేతలను, పోలీసులను చాలా ఈజీగా కొనేస్తారనే టాక్ ఉంది. దాంతో.. సమాంతర ఆర్థిక వ్యవస్థని నడుపుతున్నారు. డ్రగ్ కార్టెల్స్.. తమకంటూ సొంత ప్రైవేట్ సైన్యాలను కలిగి ఉంటాయ్. ప్రభుత్వ బలగాల కంటే.. అత్యాధునికమైన డ్రోన్లు, ఆటోమేటిక్ వెపన్స్ కూడా వాడతారు. ప్రభుత్వాలు పట్టించుకోని మారుమూల ప్రాంతాల్లో.. డ్రగ్ మాఫియా మౌలిక వసతులు కల్పిస్తూ.. లోకల్ పబ్లిక్ సానుభూతి పొందుతారు. వాళ్లే.. చాలా విషయాల్లో వీళ్లకు సహకరిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై ప్రధానంగా మూడు ప్రాంతాల నుంచి జరుగుతోంది. మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్ సరిహద్దు ప్రాంతమైన గోల్డెన్ ట్రయాగింల్‌లో సింథటిక్ డ్రగ్ అయిన మెథాఫిటమైన్ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక.. గోల్డెన్ క్రెసెంట్‌గా పిలిచే.. అప్ఘానిస్థాన్, ఇరాన్, పాకిస్థాన్ నుంచి నల్లమందు చాలా ఎక్కువగా వస్తోంది. ప్రపంచంలోని 80 శాతానికి పైగా ఓపియం ఇక్కడి నుంచే వస్తోంది. ఇక.. కొకైన్ ఉత్పత్తికి అడ్డాగా లాటిన్ అమెరికా ఉంది. కొలంబియా, మెక్సికో, పెరూ లాంటి దేశాలు.. అధిక మొత్తంలో కొకైన్ డ్రగ్ సప్లై చేస్తున్నాయ్. వీటికితోడు ఈమధ్యకాలంలో కెమికల్ ల్యాబ్స్ తయారుచేసే ఫెంటానిల్ లాంటి సింథటిక్ డ్రగ్స్ ఆందోళన కలిగిస్తున్నాయ్. నాలుగు గోడల మధ్య చిన్నపాటి గదుల్లో రసాయనాలతో వీటిని తయారుచేయొచ్చు. డ్రగ్స్ సప్లైని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయ్. ఒక దేశంలో డ్రగ్స్ పట్టుబడితే.. దాని మూలాలు మరో దేశంలో ఉండటమే దీనికి కారణం. రెండు దేశాల మధ్య సమన్వయం లేకపోవడం మాఫియాకు వరంగా మారుతోంది. వ్యవస్థలో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు డ్రగ్ కార్టెల్స్ ఇచ్చే లంచాలకు అలవాటు పడటం వల్ల.. సమాచారం ముందే లీక్ అవుతోందనే వాదనలున్నాయ్. ఇక.. మార్కెట్‌లో మాదక ద్రవ్యాల డిమాండ్ ఉన్నంత కాలం, సప్లై ఆపడం సాధ్యం కాదు. ఒక రూట్‌ని పోలీసులు మూసివేస్తే.. స్మగ్లర్లు మరో పది కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. డ్రగ్ కార్టెల్స్ దగ్గర ప్లాన్-బి ఎప్పుడూ రెడీగా ఉంటోంది.
డ్రగ్స్ ద్వారా జనరేట్ అవుతున్న బ్లాక్ మనీ.. చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ ఉంటోంది. ఆ డబ్బుతోనే.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఫండింగ్ చేయడం ద్వారా.. ప్రభుత్వాలను తమ కనుసన్నల్లో ఉంచుకోగలుగుతున్నారు. ఈ దందాలో తమని ఇబ్బందిపెట్టేవారని.. అత్యంత కిరాతకంగా చంపేస్తూ, అడ్డు లేకుండా చూసుకుంటున్నారు. అందువల్ల.. డ్రగ్స్‌ని పూర్తిగా నిర్మూలించడం ఏ దేశానికి సాధ్యం కావడం లేదు. అందువల్లే.. డ్రగ్స్‌కి బానిసలు కావొద్దనే ప్రచారాలు విస్తృతంగా చేస్తున్నారు. కొన్ని దేశాలైతే.. డ్రగ్స్‌ని రెగ్యులేట్ చేసి, ప్రభుత్వం ద్వారానే వైద్య అవసరాలకు సప్లై చేస్తున్నాయ్. డ్రగ్ మాఫియా అనేది.. ఓ క్యాన్సర్ లాంటిది. ఇది, కేవలం పోలీస్ వ్యవస్థతో మాత్రమే పోయేది కాదు. కుటుంబం, విద్యాలయాలు, ప్రభుత్వం, పోలీసులు అంతా కలిసి పనిచేసినప్పుడే.. ఈ ఊబి నుంచి యువతని కాపాడుకోగలం. కాకపోతే.. ఒక్క డ్రగ్ కింగ్ పిన్‌ని అంత చేసినా.. ఆ స్థానంలోకి మరొకరు వస్తూనే ఉంటారు. డ్రగ్స్ అనేది ఓ ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. అవి ఒక దేశ భద్రతను, వ్యవస్థను అస్థిరపరిచే అతిపెద్ద ప్రమాదం. ఈ వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకిలిస్తేనే.. దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయాలున్నాయ్.
Also Read: తుపాకీ వదిలి జనంలోకి.. అగ్రనేతల లొంగుబాటు వెనుక అసలు కథ ఇదే!
Story by: Anup, Big Tv