E-Paper
Advertisement

Maoist Exit: తుపాకీ వదిలి జనంలోకి.. అగ్రనేతల లొంగుబాటు వెనుక అసలు కథ ఇదే!

Maoist Exit: తుపాకీ వదిలి జనంలోకి.. అగ్రనేతల లొంగుబాటు వెనుక అసలు కథ ఇదే!

Maoist Exit: ఒకప్పుడు దండకారణ్యంలో దడ పుట్టించిన దళంలో.. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కంగారు పుట్టించింది. భారత్‌ని మావోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు కేంద్రం కంకణం కట్టుకోవడంతో.. మావోయిస్టులు అడవిని వదిలి జన జీవనంలోకి వచ్చేస్తున్నారు. మావోయిస్ట్ ఉద్యమం ఇప్పుడొక చారిత్రక మలుపులో ఉంది. దశాబ్దాల పాటు దండకారణ్యాన్ని అడ్డాగా చేసుకుని సాగిన సాయుధ పోరాటం.. ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆపరేషన్ కగార్, సెంట్రల్, స్టేట్ కమిటీలోని అగ్రనేతల లొంగుబాటుతో.. ఉద్యమం ఎగ్జిట్ ఫేజ్‌లోకి వచ్చిందనే చర్చ మొదలైంది. భారతదేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాల్‌గా కనిపించిన మావోయిస్ట్ ఉద్యమం, మొన్నటిదాకా ఉనికి కాపాడుకునేందుకు పోరాడింది. కానీ.. మావోయిస్టులంతా ఆయుధాలు వదిలి జనంలోకి వచ్చే పరిస్థితులు వచ్చాయంటే.. కచ్చితంగా మావోయిస్ట్ ఉద్యమం ఆఖరి దశకు చేరుకుందనే విషయం క్లియర్‌గా అర్థమవుతోంది.

మావోయిస్టుల హక్కులు కాపాడేందుకు ప్రయత్నం

మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ.. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. గత రెండేళ్లలో నలుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు, 16 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు, 85 మంది ఏసీఎస్‌లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం.. 591 మంది జన జీవన స్రవంతిలికో వచ్చేశారు. తెలంగాణకు చెందిన మరో 11 మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వాళ్లలోనూ, కొందరు పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు డీజీపీ తెలిపారు. త్వరలోనే వారు కూడా అడవిని వీడనున్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలు అందిస్తామని తెలిపారు. మావోయిస్టుల హక్కులు కాపాడేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలపై పనిచేస్తాం.. మావోయిస్ట్

ప్రజా సమస్యలపై ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేస్తామని మావోయిస్ట్ అగ్రనేతలు చెబుతున్నారు. ప్రజల సమస్యలపై జరిగే పోరాటాలను సంఘటితం చేసేందుకు, చట్ట పరిధిలో పనిచేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా.. ప్రజల పోరాటాల వెనుక నిలబడతామని హామీ ఇచ్చారు. మావోయిజం ఎప్పటికీ ముగిసిపోదని, ప్రపంచవ్యాప్తంగా అధి వృద్ధి చెందుతూనే ఉంటుందని తెలిపారు.

వనం కంటే జనంలోకి వెళ్లడమే సురక్షితం

2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం, మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు కలిసి ఆపరేషన్ కగార్ చేపట్టాయి. అప్పట్నుంచే మావోయిస్టులకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. వరుస ఎన్‌కౌంటర్లతో కోలుకోలేనంతగా ఎదురుదెబ్బలు తగిలాయ్. వందలాది మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. మావోయిస్ట్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు కొత్తేమీ కాదు. కానీ, ఆపరేషన్ కగార్ మొదలయ్యాక అడవిలో మావోయిస్టులకు పట్టు తప్పింది. క్రమంగా దళాలు బలహీనపడ్డాయ్. ఎన్నడూ లేని విధంగా భద్రతా బలగాలు అడవుల్లోకి చొచ్చుకెళ్లడం, అటవీ గ్రామాల్లోనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో.. మావోయిస్టుల సురక్షిత ప్రాంతాలు దెబ్బతిన్నాయ్. డ్రోన్లు, శాటిలైట్ ఇమేజరీ, ఆధునిక నిఘా పరికరాలు.. మావోయిస్టుల గెరిల్లా యుద్ధ తంత్రాన్ని బలహీనపరిచాయ్. ఫలితంగా గడిచిన కొన్ని నెలల్లో.. దండకారణ్యంలో మొత్తం సీనే మారిపోయింది. దశాబ్దాల పాటు అజ్ఞాతంలో ఉన్న దేవ్ జీ లాంటి అగ్రనేతలు సైతం పోలీసుల ముందు లొంగిపోవడంతో.. మావోయిస్ట్ ఉద్యమం ఇక చరిత్రగానే మిగిలిపోనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయ్. అనుభవం ఉన్న నాయకులు వృద్ధాప్యం, అనారోగ్యం, సిద్ధాంతపరమైన విభేదాలతో బయటకు రావడం వల్ల.. ద్వితీయ శ్రేణి నాయకత్వం లోపించింది. దాంతో.. వనం కంటే జనంలోకి వెళ్లడమే సురక్షితమని భావిస్తున్నారు.

దేశంలో మావోయిస్ట్ అనే మాట వినిపించదు

వచ్చే మార్చి 31 నాటికి.. దేశంలో మావోయిస్ట్ అనే మాట వినిపించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. అప్పటి నుంచి అడవుల్లో తుపాకుల మోత వినిపిస్తోంది. ఎన్‌కౌంటర్ ఆపరేషన్లు గ్యాప్ లేకుండా కొనసాగుతున్నాయ్. గడిచిన దశాబ్దకాలంలో.. దాదాపు వెయ్యి మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. వీరిలో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నారు. బీజాపూర్, బస్తర్, కాంకేర్, దంతెవాడ, సుక్మా, ఇలా అన్ని ఏరియాల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయ్. పదేళ్ల కిందటి వరకు కూడా పోలీసులు దండకారణ్యంలో అడుగు పెట్టాలంటే.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. కానీ.. ఆపరేషన్ కగార్‌తో ఉక్కుపాదం మోపడంతో మావోయిస్టుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అడవిలో అన్నల యుద్ధం ముగిసే స్థితికి వచ్చింది.

భూమి కోసం రైతుల నిరసన

మావోయిస్ట్ ఉద్యమంలో.. జగిత్యాల జైత్రయాత్ర ఓ కీలక ఘట్టం. 1978 సెప్టెంబర్‌ 9న.. భూస్వాముల అణిచివేతకు, గడీల పాలనకు వ్యతిరేకంగా.. దున్నేవాడిదే భూమి అనే నినాదంతో రైతు కూలీ సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయ్. ఈ జైత్రయాత్రలో లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు చరిత్ర చెబుతోంది. ఇదే.. తెలంగాణలో పౌర హక్కుల ఉద్యమానికి, విప్లవ పోరాటాలకు గట్టి పునాది వేసింది. జైత్రయాత్ర తర్వాత అప్పటి ప్రభుత్వం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను అల్లకల్లోల ప్రాంతాలుగా ప్రకటించింది, పోలీసుల నిర్బంధం పెరగడంతో చాలా మంది అడవుల్లోకి వెళ్లి ఆయుధాలు పట్టాల్సి వచ్చింది. ఇది క్రమంగా సాయుధ పోరాటంగా మారింది.

తెలంగాణలో పీపుల్స్ వార్ గ్రూప్

అలా.. 1980ల్లో పీపుల్స్ వార్ గ్రూప్ పుట్టుకొచ్చింది. ఈ దశలో ఉద్యమం కేవలం గిరిజన ప్రాంతాలకే పరిమితం కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మైదాన ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. మావోయిస్ట్ ఆర్కే, గణపతి లాంటి కీలక నేతలు ఈ దశలోనే ఎదిగారు. అలా.. విద్యార్థులు, సామాన్య రైతులు, కూలీల మద్దతు ఉద్యమానికి దొరికింది. జగిత్యాల జైత్రయాత్రను మావోయిస్ట్ ఉద్యమానికి రెండో దశగా చెబుతారు. తొలిదశ శ్రీకాకుళం ఉద్యమమైతే, రెండో దశ తెలంగాణలోనే ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్ట్ ఉద్యమం.. 2004లో అత్యంత కీలకమైన మలుపు తీసుకుంది. 2004 సెప్టెంబర్‌లో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీపుల్స్ వార్ గ్రూప్, బీహార్‌కు చెందిన ఎంసీసీఐ కలిసిపోయి.. సీపీఐ మావోయిస్ట్ పార్టీగా అవతరించాయ్. అలా.. నాలుగున్నర దశాబ్దాలకు పైగా మావోయిస్ట్ ఉద్యమం కొనసాగింది.

తెలుగు నేతల వెన్నెముక దెబ్బ

ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీకి వెన్నెముకగా ఉన్న తెలుగు నాయకత్వం ఇప్పుడు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. గతేడాది నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఇప్పుడు.. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ లాంటి అగ్రనేతలు కూడా పోలీసుల ముందు లొంగిపోయారు. ఇది.. పార్టీకి పెద్ద దెబ్బ. ప్రస్తుతం పొలిట్ బ్యూరోలో కొందరు నేతలు మాత్రమే చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు కూడా లొంగిపోతారనే ప్రచారం జరుగుతోంది. గణపతి లాంటి పాత తరం నేతలున్నా.. వాళ్లు అంత యాక్టివ్‌గా లేరు. దాంతో.. మావోయిస్ట్ పార్టీ ఇకపై కొనసాగే అవకాశాలు దాదాపుగా లేవనే వాదన వినిపిస్తోంది. ఆపరేషన్ కగార్ కేవలం ఎన్‌కౌంటర్లకే పరిమితం కాలేదు. వ్యూహాత్మకంగా మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేసింది. మావోయిస్టుల అభయారణ్యాలుగా ఉన్న ప్రాంతాల్లో.. 250కి పైగా కొత్త భద్రతా బలగాల క్యాంప్‌లని ఏర్పాటు చేశారు. దీనివల్ల.. మావోయిస్టుల కదలికలు పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చేశాయ్. అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో అడవిని జల్లెడ పట్టడం వల్ల మావోయిస్టులకు ఆశ్రయం కరువైంది. దాంతో.. అడవిలో ఉండి ఉద్యమం చేయడం కంటే, జనంలో ఉంటూ ప్రజా ఉద్యమాలు చేయడం మంచిదనే ఆలోచనకు మావోయిస్టులు వచ్చారు. అందుకే.. అగ్రనేతలతో సహా అంతా లొంగిపోతున్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు

ఇప్పటికే.. మావోయిస్ట్ పార్టీలో చేరేవారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. మావోయిజం సిద్ధాతం, మావోయిస్ట్ ఉద్యమంలో చేరాలనే ఇంట్రస్ట్ ఈ తరం యువతలో లేదు. దాంతో.. అటవీ సమీప గ్రామాల్లోని గిరిజనులనే మావోయిస్టులుగా మార్చారనే చర్చ ఉంది. కానీ.. పార్టీ సిద్ధాంతాలను గిరిజనులు అర్థం చేసుకోలేకపోయారు. నాయకత్వం ఆదేశాలను పాటించడం, దాడులు చేయడం ఒక్కటే తెలుసు. ఇలాంటి దళాలతో.. భవిష్యత్తులో మావోయిస్ట్ పార్టీ మనుగడ కష్టమనుకున్నారు. ప్రజల్లోనూ మావోయిస్టులకు మద్దతు తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల ప్రభావంతోనూ.. జనంలో మావోయిస్టుల పట్ల సానుభూతి క్రమంగా తగ్గుతూ వచ్చింది. మావోయిస్టుల విషయంలో కేంద్రం కూడా చాలా క్లియర్‌గా ఉంది.

మార్చ్ 31 డెడ్ లైన్

ఇంకెప్పటికీ కోలుకోని విధంగా ఉద్యమాన్ని అణిచివేయాలని డిసైడ్ అయింది. మావోయిస్ట్ పార్టీ అత్యంత బలహీనంగా ఉన్నప్పుడే.. ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. ఆ దిశగానే అడుగులు వేసింది. అలా.. మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాటుతో.. తెలంగాణలో మిగిలింది మరో 11 మంది అగ్రనేతలు మాత్రమే. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్‌తో.. మావోయిస్టులు ప్రభుత్వంపై ఎదురుదాడి చేసే సామర్థ్యాన్ని కోల్పోయారు. మావోయిస్ట్ పార్టీ కూడా నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన మార్చ్ 31 డెడ్‌లైన్ కూడా దగ్గరపడుతోంది. ఈ పరిస్థితుల్లో.. అడవుల్లో ఉండటం కంటే లొంగిపోవడమే బెటరనుకుంటున్నారు మావోయిస్టులు

మావోయిస్ట్ ఉద్యమం మారుతున్న దిశ

ఏ ఉద్యమమైనా ప్రజల మద్దతు ఉన్నంత కాలమే బతుకుతుంది. మావోయిస్టులు ఎదుర్కొంటున్న ఆపరేషన్ కగార్ ఒత్తిడి ఒక్కటే కాదు.. సామాజిక మార్పుల వల్ల వస్తున్న ఒత్తిడి. తుపాకీ చేపట్టిన చేతులు ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో గళమెత్తాలని నిర్ణయించుకోవడం.. ఒకరకంగా సమాజానికి సానుకూల పరిణామమనే చెప్పాలి. లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలంతా.. ఇకపై సామాజిక సమస్యలపై ప్రజల్లో ఉంటూ పోరాడనున్నారు. ఇది.. కొత్త ఉద్యమాలకు దారితీసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

Story by: Anup, Big Tv

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×