Andhra Pradesh News: ఎక్కడైనా ఎమ్మెల్యే చెబితే నియోజకవర్గంలో ఏ పని అయినా అయిపోతుంది అంటారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులూ అలాగే పనిచేస్తుంటారు. కానీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే గల్లా మాధవిని అస్సలు లెక్కచేయట్లేదట అధికారులు. నియోజకవర్గంలో సమస్యల మాట అటుంచితే.. ఎన్నిసార్లు చెప్పినా.. కనీసం ఎమ్మెల్యే ఇంటి ముందున్న రోడ్డుపై ఉన్న గుంతలు కూడా పూడ్చట్లేదట. అధికారుల తీరుతో విసుగెత్తిపోయిన ఆ ఎమ్మెల్యే చేసేదేమీ లేక తానే పలుగు, పార చేతపట్టుకొని రోడ్డుపై గుంతలు పూడ్చారట. అసలు గుంటూరు రాజకీయాల్లో ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈసారి చాలా మంది యువ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు. కొంతమంది ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే తొలిసారి గా ఎమ్మెల్యేగా ఎన్నికై జాక్పాట్ కొట్టారు. అలాంటి వారిలో గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గల్లా మాధవి ఒకరు. ఆ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన కీలక నేత, మాజీ మంత్రి విడదల రజనీ పై ఏకంగా 50 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి టీడీపీ కంచుకోటను మరోసారి నిలబెట్టారు గల్లా మాధవి.
వాస్తవానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ టికెట్ కోసం చాలా మంది నాయకులు కర్చీఫ్ వేశారు. కానీ అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం గల్లా మాధవికి దక్కింది. అయితే ఎన్నికల ప్రచారం నుంచీ ఊహించని సవాళ్ళను ఎదుర్కొని మొత్తానికి ఎమ్మెల్యేగా గెలుపొందారామె. ఇక్కడ వరకూ అంతా బానే ఉంది. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాటి నుంచే ఆమెకు అసలు సవాళ్లు స్టార్ట్ అయ్యాయట. ప్రత్యక్షంగానో పరోక్షంగానో గత ఏడాదిన్నర కాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు ఎమ్మెల్యే మాధవి.
జిల్లాలో ఉన్న ఏకైక మహిళా ఎమ్మెల్యే కావడం అలాగే ప్రజా సమస్యల పట్ల ఆమె స్పందించే తీరు, వ్యవహారశైలి చాలా భిన్నంగా కనిపిస్తుంటాయి. సమస్యల పరిష్కారంలో అధికారుల అలసత్వాన్ని కూడా అలాగే నిలదీస్తుంటారామె. మొదటిసారి ఎమ్మెల్యే కావడమో లేదా నిజంగా అధికారుల పని తీరు అలా ఉందో తెలియదుగానీ అదే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవికు పెద్ద సమస్యగా మారిందట. వాస్తవానికి ఎక్కడైనా నియోజకవర్గంలో సమస్యలు ఉంటే ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తారు. అధికారుల సమన్వయంతో ఎమ్మెల్యే ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా పాలకులు, ప్రభుత్వాధికారులు జోడెడ్లు బండి మాదిరిగా సమానంగా పనిచేసినపుడే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది.
కానీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆ వాతావరణం ఎక్కడా కనిపించదు. ఈ నియోజకవర్గంలో మొదట్నుంచీ ఇదే పరిస్థితి. నియోజకవర్గం మొత్తం గుంటూరు నగర పాలకసంస్థ పరిధిలో ఉంటుంది. నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అన్నా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులే పని చేయాల్సి ఉంటుంది. మొదట్నుంచీ కార్పొరేషన్ అధికారుల పనితీరు పై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తుండటంతో ఎమ్మెల్యేకూ అధికారులు మధ్య గ్యాప్ మరింత పెరిగింది.
నియోజకవర్గంలో ప్రజలు అడిగే చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడంలోనూ అధికారులు విఫలం అవుతున్నారని, దీని వల్ల నియోజకవర్గంలో ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితులు వస్తున్నాయని ఎమ్మెల్యే మాధవి పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలకు మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదని.. ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా కమిషనర్, మేయర్ ప్రొగ్రాం డిజైన్ చేయడంపై ఆమె మండిపడ్డారు.
కార్పొరేషన్ అధికారులు తీరుపై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే కడిగిపారేశారు. ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేస్తున్నారని ఇలాగే చేస్తే ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దల వద్దే తేల్చుకుంటానని హెచ్చరించారు కూడా. అయితే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, నియోజకవర్గ ఎమ్మెల్యే ఇద్దరూ టీడీపీ పార్టీ కే చెందిన వారే కావడం విశేషం.
వాస్తవానికి 2019 ఎన్నికల తర్వాత అప్పటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మద్దాలి గిరి సరిగ్గా ఎన్నిలకు ముందు టీడీపీ కు రాజీనామా చేసి వైసీపీ లో చేరారు. అప్పటి నుంచీ నియోజకవర్గంలో టీడీపీ వ్యవహారాలన్నీ పార్టీలో సీనియర్ గా ఉన్న కోవెలమూడి రవీంద్ర చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఆశించారు రవీంద్ర. అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగా గల్లా మాధవి పేరు తెరమీదకు తెచ్చింది టీడీపీ అధిష్టానం. పార్టీలో సీనియర్లను కాదని కొత్తవారికి టికెట్ ఇవ్వడంపై తన అనుచరుల వద్ద కోవెలమూడి పెదవి విరిచినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయం నుంచే గల్లా మాధవి, రవీంద్రకు పొసగడం లేదనే టాక్ నడిచింది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఏప్రిల్ లో గుంటూరు మేయర్ గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ గుంటూరులో ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ గా ఇక్కడి రాజకీయాలు మారిపోయాయి.
ప్రత్యక్షంగా ఎమ్మెల్యే, మేయర్ మధ్య ఓపెన్ వార్ లేకపోయినా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ వెనుక అదే కారణం అయ్యుండొచ్చు అనేది పొలిటికల్ విశ్లేషకుల మాట. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలలో ఒకటి రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉండటంతో మొదట్నుంచీ ఈ రోడ్ల సమస్య పై ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటికీ రోడ్లు అలాగే ఉన్నాయి. తన ఇంటి ముందే రోడ్లు వేసుకోలేని ఎమ్మెల్యే ప్రజలకు ఏం చేస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మాధవి.
ఈ సమస్యపై పదే పదే కార్పొరేషన్ అధికారులకు చెప్పి చెప్ప విసుగొచ్చిన ఎమ్మెల్యే తానే స్వయంగా రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమం నిర్హహించారు. తన ఇంటి ముందు ఉన్న జీటీ రోడ్డు పై ఉన్న గుంతలను పలుగు పార చేతపట్టి కంకరతో గుంతలు పూడ్చారు. స్వయంగా ఎమ్మెల్యేనే తన ఇంటి ముందు రోడ్డుపై గుంతలు పూడ్చిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక్క రోడ్ల విషయమే కాదు నియోజకవర్గంలో ఏ పనిలో అయినా ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేషన్ అధికారులుగా పరిస్థితి మారిపోయింది.
ఇప్పటికే నియోజకవర్గంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరుపై జిల్లా పార్టీ పెద్దల వద్ద పంచాయతీ పెట్టినా పరిస్థితిలో మార్పు రాలేదట. అందుకే ఈ వ్యవహారాన్ని అధిష్టానం దగ్గరే తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారట ఎమ్మెల్యే మాధవి. ఇప్పటికే సోషల్ మీడియాలో గుంటూరు వెస్ట్ రాజకీయాలపై ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తోంది వైసీపీ. నియోజకవర్గంలో కార్పొరేషన్ వర్సెస్ ఎమ్మెల్యే వార్ ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో ఇది పార్టీ పై ప్రభావం పడే అవకాశం వుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట తెలుగుతమ్ముళ్లు. మరి ఎమ్మెల్యే మాధవి ఈ తతంగంపై పార్టీ అధిష్టానంను కలిసి ఫిర్యాదు చేస్తారా? దీనిపై పార్టీ ఎలా స్పందిస్తుంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేషన్ వార్ కు పార్టీ చెక్ పెడుతుందా? ఇకనైనా ఎమ్మెల్యే, అధికారులు ఏకతాటిపైకి వచ్చి నియోజకవర్గంలో అభివృద్ధిని పట్టాలెక్కిస్తారా ? లేక ఈ ఆధిపత్య పోరు కుమ్ములాటలు ఇలాగే కొనసాగుతాయా? వేచి చూడాలి.
Story by Ramireddy, Big Tv