E-Paper
Advertisement

iBomma & Bappam Tv: ఐ బొమ్మకి బొమ్మ పడింది.. ఆ తప్పే కొంప ముంచిందా!

iBomma & Bappam Tv: ఐ బొమ్మకి బొమ్మ పడింది.. ఆ తప్పే కొంప ముంచిందా!

iBomma & Bappam Tv: అందరికీ వెండితెరపై బొమ్మ చూపించే టాలీవుడ్‌కే.. అతను ఆన్‌లైన్‌లో హెచ్‌‍‌డీ బొమ్మ చూపించాడు. ఓటీటీలో వచ్చిన సినిమాని వచ్చినట్లు పైరసీ చేసి.. కొన్నేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతనొక్కడి వల్ల.. టాలీవుడ్‌కి 22 వేల కోట్ల నష్టం వాటిల్లిందంటే.. ఏ రేంజ్‌లో పైరసీ చేశాడో మీ ఊహకే వదిలేస్తున్నాం. అసలు.. ఇమ్మడి రవికి, ఐబొమ్మ వెబ్ సైట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?

ఇమ్మడి రవి.. పైరసీ అతడి ప్రొఫెషన్. ఐబొమ్మ అతని బ్రాండ్. తెలుగు సినీ పరిశ్రమకు.. కొన్నేళ్లుగా కంటి మీద కునుకు లేదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు దీనిని ఎలా డీల్ చేయాలో తెలియలేదు. అందుకే.. పోలీసులకు కంప్లైంట్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఈ ఒక్క ఐబొమ్మ వెబ్‌సైట్‌తో.. టాలీవుడ్‌కు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ల వెనుక ప్రధాన సూత్రధారిగా ఉన్న ఇమ్మడి రవికి.. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ సర్వర్ మేనేజ్‌మెంట్, వీడియో ఎన్‌కోడింగ్, ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ లొసుగులపై అపారమైన పట్టుంది. రవి తనకున్న టెక్నికల్ స్కిల్‌నే.. పైరసీకి ఆయుధంగా మలచుకున్నాడు. దాంతోనే.. ఐబొమ్మ అనే వెబ్‌సైట్ క్రియేట్ చేశాడు. ప్రేక్షకులకు ఫ్రీగా బొమ్మ చూపిస్తూ.. ఇండస్ట్రీకి దిమ్మరిగిపోయే నష్టానని కలిగిస్తూ ఇన్నాళ్లూ భారీగా డబ్బు సంపాదించాడు.

ఐబొమ్మ అనేది ఇమ్మడి రవి మెదడులో అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన కాదు. మార్కెట్‌లో ఉన్న అవసరాన్ని అవకాశంగా మార్చుకునేందుకు వేసిన పక్కా స్కెచ్ ఇది. చట్టవిరుద్ధమని తెలిసినా.. రవి ఇదే రూట్‌ని ఎంచుకున్నాడు. దీనికి.. ఓటీటీ బూమ్ కూడా ఓ కారణంగా కనిపిసతోంది. కరోనా తర్వాత.. ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు బాగా అలవాటు పడ్డారు. పదుల సంఖ్యలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుట్టుకొచ్చాయ్. సాధారణ ప్రేక్షకుడు అన్ని కొత్త సినిమాలు చూడాలంటే.. ఓటీటీలకు వేల రూపాయలు ఖర్చు చేసి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇది చాలా మందికి భారంగా మారింది. ఇంతకుముందు పైరరీ అంటే థియేటర్లలో మొబైల్ ఫోన్లతో రికార్డ్ చేసిన నాసిరకం క్యామ్ ప్రింట్స్ వచ్చేవి. వాటిని చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడేవారు కాదు. కానీ.. ఐబొమ్మ అలా కాదు. అన్నీ హెచ్‌డీ ప్రింట్లే. పైగా.. దాని క్యాప్షన్ కూడా క్వాలిటీ, క్లారిటీ మ్యాటర్స్ అని ఉంటుంది. అందుకే.. ఇంత హిట్ అయింది. ఓటీటీలకు మించిన ట్రాఫిక్ అంతా ఇక్కడికే చేరింది.

అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోని తెలుగు కంటెంట్‌ని ఒకేచోట.. ఉచితంగా, థియేటర్ ప్రింట్ కన్నా అద్భుతమైన హెచ్‌డీ క్వాలిటీతో అందిస్తే.. అన్న ఆలోచనతోనే ఇమ్మడి రవి ఐడియా పుట్టింది. ఈ ఆలోచనే.. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లకు బీజం వేసింది. రవి తన టెక్నికల్ స్కిల్స్‌ని వాడి.. మొత్తానికి ఓ ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్ అయితే క్రియేట్ చేశాడు. దాంతో.. ఆడియెన్స్ నుంచి బాగా అట్రాక్ట్ చేశాడు. ఐబొమ్మలో.. ఇతర పైరసీ సైట్ల మాదిరిగా నాసిరకంగా ఉండేది కాదు. దాని సక్సెస్‌కు కారణం.. ఆపరేటింగ్ స్టైల్ కూడా ఒకటి. ఎలాంటి సినిమా అయినా సరే.. ఓటీటీలో రిలీజైన కొన్ని గంటల్లోనే.. రవి అండ్ టీమ్ ఆ ప్లాట్ ఫామ్స్ సెక్యూరిటీని, ఫైర వాల్‌ని ఛేదించి మరి.. ఒరిజినల్ 4కె, ఫుల్ హెచ్‌డీ ప్రింట్‌ని డౌన్‌లోడ్ చేసి.. పబ్లిక్ చేసేసేవారు. ఆ భారీ ఫైల్‌ని.. క్వాలిటీ పెద్దగా తగ్గకుండా, వేగంగా స్ట్రీమ్ అయ్యేలా తక్కువ సైజ్‌కి కంప్రెస్ చేసేవారు. అందువల్లే.. ఐబొమ్మలో కేవలం మొబైల్ డేటాతోనే.. వీడియోలు వేగంగా ప్లే అయ్యేవి. తక్కువ డేటా ఖర్చుతోనే డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాడు ఇమ్మడి రవి.

ఇక.. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు.. సినిమా ఫైళ్లని ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో ఉన్న అజ్ఞాత సర్వర్లలో హోస్ట్ చేసేవారు. బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల డొమైన్‌ని కూడా తరచూ మారుస్తూ ఉండేవారు. అలా.. టాలీవుడ్‌కి జరగాల్సినంత నష్టం జరిగింది. ఇమ్మడి రవికి.. రావాల్సినంత లాభం వచ్చింది. ఐబొమ్మ వల్ల.. తెలుగు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలకు కనీవినీ ఎరుగని నష్టం వాటిల్లింది. ఎట్టకేలకు.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఐబొమ్మ ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెబ్‌సైట్ నిర్వాహకుడైన ఇమ్మడి రవిని.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్ట్ చేశారు. రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కి రాగానే పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. కరీబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ.. రవి ఈ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించగా, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం రవిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టునిక కోరారు. సోమవారం పోలీసుల కస్టడీ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

ఇమ్మడి రవి.. గతంలో ఓసారి దమ్ముంటే పట్టుకోండని సవాల్ విసిరాడు. చివరికి ఇప్పుడు హైదరాబాద్‌లోనే పట్టుబడ్డాడు. ఇంత పక్కాగా సవాల్ చేసిన వ్యక్తి ఎలా దొరికేశాడు? తను క్రియేట్ చేసిన ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లని.. తనే బ్లాక్ చేసే పరిస్థితి ఎలా వచ్చింది? దిమ్మతిరిగి.. బొమ్మ ఎలా బ్లాకైంది?

ఐబొమ్మ ఎపిసోడ్‌లో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఒకటుంది. నిజానికి.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆన్‌లైన్‌లో ఫ్రీగా సినిమా చూపిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు ఇమ్మడి రవి. సినిమాలకు భారీ బడ్జెట్, హీరోలకు వందల కోట్ల రెమ్యునరేషన్ అవసరమా? అనే క్వశ్చన్‌ని రైజ్ చేశాడు. అవి తగ్గించకుండా.. టికెట్ రేట్లు పెంచడం కరెక్టా? అనే ప్రశ్న లేవనెత్తాడు. టికెట్ రేట్లు పెంచితే సామాన్యులు థియేటర్‌కి ఎలా వస్తారన్నారు. పైకి ఇలాంటి సమాజోద్ధారక స్టేట్‌మెంట్లు ఇచ్చినా.. పైరసీ దందాతో ఇమ్మడి రవి కోట్లు వెనకేసుకున్నాడు. ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల ద్వారా బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ గేమ్స్ ప్రమోట్ చేశాడు. కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించి.. పిచ్చిపిచ్చిగా డబ్బులు సంపాదించాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరి.. కూకట్‌పల్లి సందుల్లోనే దొరికేశాడు. బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ కేసే.. ఐబొమ్మ రవి అరెస్టుకు దారిచూపింది. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో వన్ ఎక్స్ బెట్ లాంటి వివిధ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్‌కి సంబంధించిన యాడ్స్ డిస్ ప్లే చేసేవాడు రవి. సినిమాల కోసం ఐబొమ్మకు సైట్ ఓపెన్ చేసే వారిని.. బెట్టింగ్ వైపు దారి మళ్లించేలా ప్రకటనలు ఉంచేవాడు. దాంతో.. బెట్టింగ్ కంపెనీల నుంచి ఐబొమ్మ రవికి భారీగా డబ్బు వచ్చేది. అలా.. బెట్టింగ్ కేసు దర్యాప్తులో.. నిధుల ప్రవాహాన్ని ట్రేస్ చేస్తూ వెళ్లిన పోలీసులకు లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు, రవికి మధ్య భారీ స్థాయిలో లావాదేవీలు నడిచినట్లు పోలీసులు గుర్తించారు. పాప్ అప్ యాడ్స్, బెట్టింగ్ యాడ్స్ ద్వారా రవికి నెలకు కోట్ల రూపాయలు సంపాదించాడనే ఆరోపణలున్నాయ్.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. ఇమ్మడి రవి నుంచి కీలక సమాచారం రాబట్టారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లను కూడా గుర్తించారు. శుక్రవారం విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‌పల్లిలోని రెయిన్‌ విస్టా ఫ్లాట్‌లో ఉండగా అరెస్ట్ చేశారు. కరీబియన్‌ దీవుల్లో ఉంటూ.. ఐ-బొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి స్వస్థలం విశాఖగా గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. ఐబొమ్మ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు కొన్నేళ్లుగా దాదాపు 22 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పైరసీ ద్వారా వందల కోట్లు సంపాదించిన రవికి చెందిన బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. అంతేకాదు.. కూకట్‍‌పల్లిలోని రవి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న సినిమాల హెచ్‌డీ ప్రింట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌, సర్వర్‌ నుంచి మరికొంత సమాచారం సేకరించారు సైబర్ క్రైమ్‌ పోలీసులు. పనిలో పనిగా.. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లను.. రవితోనే బ్లాక్ చేయించారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఐ బొమ్మపై కేసులు నమోదయ్యాయి. పైరసీ నిర్వాకం మొత్తం ఇతనొక్కడే చేస్తున్నాడా? వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్‌ వర్క్‌ ఎక్కడెక్కడ ఉంది? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.

Also Read: కార్తీక మాసం ఆఖరి సోమవారం.. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు..

పోలీసులు రవిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుండగానే.. అతనే హైదరాబాద్‌లో తేలాడు. ఎక్కడో.. కరీబియన్ దీవుల్లో ఉండే రవి.. ఇప్పుడెందుకు హైదరాబాద్ వచ్చాడనేది చాలా మందిలో ఉన్న డౌట్. అతను ఇక్కడికి రావడానికి.. ఓ రీజన్ ఉంది. కూకట్‌పల్లిలో రవికి సొంత ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసముంటున్నాడు. రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయ్యారు. విదేశాల్లో ఉన్న రవి.. తన భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు.. హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. రవి హైదరాబాద్ వస్తున్న సమాచారాన్ని అతని భార్యే సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్లు తెలుస్తోంది. అలా.. పోలీసులు అతని కదలికలపై నిఘా ఉంచి పక్కా స్కెచ్‌తో అరెస్ట్ చేశారని సమాచారం. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కొన్నాళ్ల క్రితమే ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు. ఏదేమైనా.. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ పట్ల దర్శక, నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో.. చట్టవిరుద్ధమైన మార్గంలో వెళ్లాడు. సినీ పరిశ్రమనే కుదిపేసి.. చివరికి పోలీసులకు చిక్కాడు.

Story By Vamshi Krishna, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×