Jeevan Reddy Quits Congress: తాటిపర్తి జీవన్ రెడ్డి..జగిత్యాల రాజకీయాల్లో తనదంటూ ముద్రవేసి సుమారు 42 ఏళ్ల పాటు కరీంనగర్ కాంగ్రెస్ కి కేరాఫ్ లా మారిన ఈ సీనియర్ నాయకుడు తాజాగా పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోవడం ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో సెన్సేషన్ అయింది.ఇన్నాళ్ళుగా రాజీనామా చేస్తాడన్న వార్తల మధ్య ఎట్టకేలకి 2026 మార్చి 25న తన రాజీనామా అఫీషియల్ గా ప్రకటించారు. మొత్తానికి 42 ఏళ్ళుగా కాంగ్రెస్ తో తనకున్న బందానికి ముగింపు పలికిన జీవన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే..
26 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ క్యాబినెట్‌లో
1981లో రాజకీయాల్లోకి ప్రవేశించిన జీవన్ రెడ్డి మొదటగా ఇండిపెండెట్ అభ్యర్థిగా మలియాల పంచాయతీ సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన జీవన్ రెడ్డి ఆ పార్టీ ప్రభంజనంలో తొలిసారి జగిత్యాల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఇక కేవలం 26 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించడం ఇక్కడ విశేషం.అయితే తనని MLA ని చేసిన పార్టీని కాదని 1984లో నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ సమయంలో జీవన్ నాదెండ్లకు సపోర్ట్ చేయడం గమనార్హం.
జగిత్యాల నుండి ఆయన మొత్తం ఆరుసార్లు
ఇక ఆతర్వాత అంటే 1984 చివరలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి అప్పటి నుండి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ వాదిగానే కొనసాగారు.మొత్తంగా జగిత్యాల నియోజకవర్గం నుండి ఆయన మొత్తం ఆరుసార్లు (1983, 1989, 1996 ఉప ఎన్నిక, 1999, 2004, 2014) ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 నుండి 2009 వరకు రోడ్లు మరియు భవనాల శాఖ (R&B) మంత్రిగా బాధ్యతలు నిర్వహించి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు కూడా.
కెసిఆర్ చరిష్మాని తట్టుకొని జగిత్యాల ఎమ్మెల్యేగా..
అన్నింటికన్నా ముఖ్యంగా 2014 లో రాష్ట్రమంతా వీచిన బిఆర్ఎస్ ప్రభంజన౦ లో హేమాహేమీలు గల్లంతు అయితే కెసిఆర్ చరిష్మాని తట్టుకొని మరీ జగిత్యాల నియోజక వర్గం నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం అప్పట్లో ఒక సంచలనం.ఇది ఒకరకంగా జీవన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న మాస్ ఇమేజ్ కారణంగానే ఈ గెలుపు దక్కింది అన్నది పొలిటికల్ పండిట్స్ మాట. అయితే తన చేతిలో ఓడిన డాక్టర్ సంజయ్ చేతిలోనే తిరిగి 2018 లో జరిగిన ఎన్నికలలో జీవన్ రెడ్డి ఓడిపోవడంతో జగిత్యాల జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయ్.అయితే అప్పటి TRS ప్రభుత్వమే అధికారంలో ఉండటం,జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో సంజయ్, జీవన్ ల మధ్య ఆధిపత్య పోరు ఉన్నా అది పెద్దగా కనిపించలేదు.
జిల్లా రాజకీయాల్లో ముసలం..
ఇక మళ్ళీ 2019 లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీ అవడం జీవన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ కి కాస్త మైలేజ్ ఇచ్చింది.తిరిగి 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ చేతిలో రెండోసారి ఓడిపోవడం, గెలిచిన సంజయ్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవడంతో జిల్లా రాజకీయాల్లో ముసలం పుట్టించింది.దానికి తోడు 2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ స్థానంలో బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోడం కూడా జీవన్ రెడ్డి కి మాయని మచ్చనిలా మిగిలిపోయింది. ఒకరకంగా కెరీర్ లో జిల్లాలో గట్టి పట్టున్న నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డి వరుసగా అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని చవిచూడటంతో పార్టీలో కొంత పలుచన అయిన మాట వాస్తవం.
జీవన్ రెడ్డి అసహనం పీక్స్
దీనికి తోడు తన సొంత నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరగడం, తనను పక్కన పెట్టి సంజయ్ కి పెద్దపీట వేయడంతో జీర్ణించుకోలేకపోయారు . దీనికి తోడు, తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య జరిగిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించకపోవడం, ప్రభుత్వం నుండి సరైన రియాక్షన్ రాకపోవడంతో జీవన్ రెడ్డి అసహనం పీక్స్ చేరిపోయింది.వీటికి తోడు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ తన వర్గీయులకే పెద్ద పీట వేయించుకోవడంతో ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఇమడలేమన్న నిర్ణయానికి వచ్చేశారు.దీంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేయబోతున్నాడన్న వార్తలు తెగ సర్కులేట్ అవడం తో ఆయన పార్టీ వీడకుండా ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ,మరోపక్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాయబారాలు నడిపినా జీవన్ రెడ్డి అలకపాన్పు దిగలేదు. అయితే ఇక్కడ రేవంత్ చొరవ తీసుకొని మాట్లాడి ఉంటె రిజల్ట్ వేరేలా ఉండేదేమో.
also read:Vaibhav Suryavanshi:హ్యాపీ బర్త్ డే వైభవ్ సూర్యవంశీ
పక్కపార్టీలోకి పొతే అది కాంగ్రెస్ కి దెబ్బ?
ఇక ఇపుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తాననేది బహిరంగంగా చెప్పకపోయినా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే సూచనలే ఎక్కువ. ఇక ఇన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్ జిల్లాలో కేరాఫ్ గా నిలిచిన జీవన్ రెడ్డి పక్కపార్టీలోకి పొతే అది కాంగ్రెస్ కి పెద్ద దెబ్బే అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి నాయకత్వంపై మొదటిసారిగా ఒక సీనియర్ నాయకుడు తిరుగుబాటు చేసినట్టు అవుతుంది.ఇప్పటికే నివురు గప్పిన నిప్పులా ఉన్న మరికొంతమంది నేతలకి జీవన్ రెడ్డి దారి చూపించిన వారవుతారు కూడా. అయితే వరుసగా వచ్చిన ఏ ఎన్నిక అయినా భుజాల మీద వేసుకొని గెలిపించి హైకమాండ్ వద్ద పరపతిని పదింతలు చేసుకున్న రేవంత్ కి వ్యతిరేఖంగా ఇంకా రెండేళ్ళ పదవి కాలం ఉండగా గళం విప్పుతారా అంటే అనుమానమే. కాని అసమ్మతి గళం వినిపిస్తున్న కోమటి రెడ్డి లాంటి వాళ్ళకి ఈ సందర్భం ఒక ఆయుధం అవుతుందనడం లో సందేహం లేదు .
BRS పార్టీలో ఎక్కువ రోజులు ఇమడగలడా?
అయితే జీవన్ రెడ్డి చేరాలనుకున్న BRS పార్టీలో ఆయన ఎక్కువ రోజులు ఇమడగలడా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే.ఎందుకంటే అక్కడ ఉండలేక బయటకొచ్చిన వాళ్ళు విజయ శాంతి నుండి ఈటెల దాకా బోలెడు.మరి ఆరుసార్లు ఎమ్మెల్యేగా , రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా , ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచి ఇండిపెండెంట్ గా వ్యవహరించే జీవన్ రెడ్డి ఎలా ఉంటారో చూడాలి .
also read:VV Vinayak: ఒకప్పుడు మాస్ డైరెక్టర్… ఇప్పుడు ఛాన్స్ కోసం వెయిట్?