Jeffrey Epstein files: ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలతో.. అగ్రరాజ్యంలో మళ్లీ దద్దరిల్లుతోంది. బయటకొస్తున్న ఒక్కొక్కరి పేరు సంచలనం సృష్టిస్తోంది. పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్నవారి చీకటి బాగోతాలు వెలుగులోకి వస్తున్నకొద్దీ.. అమెరికా మైండ్ బ్లాంక్ అవుతోంది. లేటెస్ట్‌గా రిలీజైన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఏముంది? అందులో బయటపడిన విషయాలేంటి? అమెరికాని ఇంతలా కుదిపేయడానికి, ఈ స్థాయిలో కలకలం రేగడానికి కారణాలేంటి?
మరోసారి ఎప్‌స్టీన్స్ ఫైల్స్ ప్రకంపనలు
30 లక్షల పేజీలు, 2 వేల వీడియోలు, లక్షా 80 వేల ఫోటోలు.. ఎప్‌స్టీన్ ఫైల్స్ పార్ట్-2కి సంబంధించిన ఫిగర్స్ ఇవి. అమెరికాలో మరోసారి ఎప్‌స్టీన్స్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టించాయ్. అనేకమంది ప్రముఖుల పేర్లు, ఫోటోల ప్రస్తావనలు ఇందులో ఉన్నాయ్. ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ చట్టం కింద అమెరికా న్యాయశాఖ వెబ్‌సైట్‌లో.. ఈ కేసుకి సంబంధించిన ఫైల్స్, వీడియోలు, ఫోటోలు అందుబాటులో ఉంచారు. జైల్లోనే చనిపోయిన మిలియనీర్ ఫైనాన్షియర్ ఎప్‌స్టీన్ నడిపించిన.. సెక్స్ రాకెట్, మైనర్లపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలన్నీ వాటిలో ఉన్నాయి. ఈ వ్యవహారంలో జెఫ్రీ ఎప్‌స్టీన్.. ట్రంప్, బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూతో జరిపిన సంభాషణలున్నాయి.
ట్రంప్ పాలసీలు, పాలిటిక్స్ పై.. ఫ్రెండ్స్‌తో ఎప్‌స్టీన్ చర్చ
లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్ పేరు కొన్ని వేలసార్లు వచ్చింది. ఎప్‌స్టీన్, ఆయన ఫ్రెండ్స్.. ట్రంప్‌కి సంబంధించిన వార్తలను షేర్ చేసుకున్నారు. ఆయన పాలసీలు, పాలిటిక్స్‌పై వారు చర్చించుకున్నారు. అంతేకాదు.. ట్రంప్, అతని ఫ్యామిలీ గురించిన గాసిప్స్ కూడా వారి మధ్య చర్చకు వచ్చాయి. అయితే.. ఇదే సమయంలో.. ప్రెసిడెంట్ ట్రంప్‌ని కాపాడేలా కొన్ని ఫైళ్లని దాచారని వస్తున్న ఆరోపణలను అమెరికా న్యాయశాఖ ఖండించింది. గతంలో జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు స్నేహం ఉండేదని, తర్వాత ఆయనతో విడిపోయారని వివరించింది.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ పేరు
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో.. బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ.. అలియాస్ మౌంట్‌బాటెన్ విండ్సర్ పేర్లు కూడా కొన్ని వందలసార్లు వచ్చింది. న్యూస్ క్లిప్పింగ్స్, జెఫ్రీ ప్రైవేట్ ఈ-మెయిల్ సంభాషణల్లో, డిన్నర్ గెస్టుల లిస్టులో ఆండ్రూ పేరు ఉంది. అంతేకాదు.. మహిళతో ఆండ్రూ ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. గుర్తు తెలియని మహిళలు, లగ్జరీ అపార్టుమెంట్లు, హోటల్, విల్లాల్లో ఉన్న చిత్రాలు బయటకు వచ్చాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఎప్‌స్టీన్‌తో జరిపిన ఈ-మెయిల్ సంభాషణ కూడా బయటకు వచ్చింది. మస్క్ రెండు సార్లు.. ఎప్‌స్టీన్‌తో సంభాషించినట్లు.. ఫైల్స్‌లో ఉంది. అందులో.. మస్క్ కరీబియన్ దీవుల టూర్‌కు వెళ్లేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
కరీబియన్ దీవుల్లోనే లైంగిక దోపిడీ జరిగిందనే ఆరోపణలు
కరీబియన్ దీవుల్లోనే లైంగిక దోపిడీ జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. 2013లో మస్క్.. కరీబియన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నట్లు ఉంది. ఈసారి ఎప్‌స్టీన్ ఫైళ్లలో మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ పేరు ప్రస్తావనకు రావడం సెన్సేషన్‌గా మారింది. రష్యన్ మహిళలతో ఆయన లైంగిక సంబంధాలు నెరిపారని, అందువల్లే ఆయన సుఖవ్యాధుల బారిన పడ్డారని జెఫ్రీ ఎప్‌స్టీన్ ఆరోపించాడు. ఆ తర్వాత.. తనతో ఆరేళ్ల స్నేహాన్ని గేట్స్ తెంచుకున్నారని తెలిపాడు. అయితే.. ఈ ఆరోపణల్ని.. బిల్ గేట్స్ టీమ్ ఖండించింది.
జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంభాషించిన స్టీవ్ బానస్
ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్‌గా పనిచేసినప్పుడు.. వైట్ హౌజ్ వ్యూహకర్తగా ఉన్న స్టీవ్ బానన్ కూడా ఎప్‌స్టీన్‌తో సంభాషించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా జనరల్ కౌన్సెల్ క్యాతీ రూమ్లర్‌తోనూ జెఫ్రీ కొన్నిసార్లు సంభాషణలు జరిపారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్ మీరా నాయర్.. ఓ సినిమా కోసం లైంగిక ఆరోపణల కేసుల్లో దోషి అయిన మ్యాక్స్‌వెల్‌కు చెందిన టౌన్‌హౌజ్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యారని ఎప్‌స్టీన్ ఫైళ్లలో ఉంది. ఇప్పుడు బహిర్గతమైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో.. 150 నుంచి 200 మంది ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఇవన్నీ.. ఆరోపణలు మాత్రమే అయినప్పటికీ, ఆ పేర్లు వింటే.. ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే! ఎందుకంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బ్రిటన్ మాజీ ప్రిన్స్ ఆండ్రూ లాంటి వారి పేర్లు.. ఈ ఫైల్స్‌లో కనిపించడం సంచలనంగా మారింది. స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావి పేరు కూడా ఈ పత్రాల్లో ఉండటం.. ప్రపంచాన్ని విస్మయానికి గురేచేసింది. కొందరు మైనర్ అమ్మాయిలు, ఎప్‌స్టీన్ పార్టీలో దిగిన ఫోటోలు, అతనితో జరిపిన సంభాషణలు, జెఫ్రీతో వారికి ఉన్న సాన్నిహిత్యంపైనే.. ఇప్పుడు అనేకానేక ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.
జెఫ్రీ ఎప్‌స్టీన్.. ఒకప్పుడు అమెరికా ఉన్నత వర్గాల్లో వెలుగు వెలిగిన పేరు. కానీ.. ఇప్పుడు ఆ పేరు వింటేనే అగ్రరాజ్యం వణికిపోతోంది. ఏళ్లు గడుస్తున్నా, ఎప్‌స్టీన్ చనిపోయినా.. అతను వదిలి వెళ్లిన పాపపు చిట్టా.. ప్రపంచ కుబేరులకు, అగ్రరాజ్య రాజకీయ దిగ్గజాలకు నిద్ర లేకుండా చేస్తోంది. కోర్టు ఆదేశాలతో బయటకొచ్చిన లక్షల పేజీల డాక్యుమెంట్లు.. అమెరికా సొసైటీని, పొలిటికల్ సిస్టమ్‌ని షేక్ చేసేస్తున్నాయ్. ఇందులో.. భారత ప్రధాని మోడీ పేరు ప్రస్తావనకు రావడంతో మరింత కలకలం రేగింది. అసలు.. మోడీపై ఇలాంటి వదంతులు ఎందుకొచ్చాయ్?
గ్లోబ్ మొత్తం సంచలనంగా ఎప్‌స్టీన్ ఫైల్స్
ఎప్‌స్టీన్ ఫైల్స్ ద్వారా బయటకొస్తున్న విషయాలు.. గ్లోబ్ మొత్తం సంచలనం సృష్టిస్తున్నాయ్. అతను చనిపోయిన ఆరేళ్ల తర్వాత కూడా.. ఈ సెక్స్ కుంభకోణం అమెరికాని కుదిపేస్తోంది. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్‌లోనూ కలకలం రేపుతోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో.. మోడీ పేరు కనిపించడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎప్‌స్టీన్‌కి చెందిన ఓ మెయిల్‌లో.. మోడీ పేరును ప్రస్తావిస్తూ కొన్ని వాక్యాలున్నాయి. భారత ప్రధాని మోడీ తన సలహా తీసుకున్నారని.. ఇజ్రాయెల్‌లో అమెరికా అధ్యక్షుడి కోసం డ్యాన్స్ చేశారని, పాట పాడారని, వాళ్లు కొన్ని వారాల క్రితమే కలుసుకున్నారని.. ఇలా.. ఏదేదో తనకిష్టమొచ్చింది రాసేసుకున్నారు. దీనిపై.. భారత విదేశాంగశాఖ స్పందించింది. 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తప్ప.. ఆ మెయిల్‌లో ఉన్న ఇతర వివరాలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసింది. సెక్స్ కుంభకోణంలో దోషి అయిన వ్యక్తి చెప్పిన మాటలు అర్థంలేనివంది.
పలుకుబడి కోసం దేశాల అధినేతల పేర్లని వాడుకునే ఎప్‌స్టీన్
వాస్తవానికి.. జెఫ్రీ ఎప్‌స్టీన్ తన పలుకుబడి పెంచుకోవడానికి, ప్రపంచ దేశాల అధినేతల పేర్లను తరచుగా వాడుకునేవాడు. మోడీ ఇజ్రాయెల్ పర్యటన గురించి, ఇతర అంతర్జాతీయ అంశాల గురించి అతను తన ఈమెయిల్స్‌లో వ్యాఖ్యానించినట్లు కొన్ని డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అందువల్ల.. పీఎం మోడీ ఇజ్రాయెల్ టూర్‌పై.. ఎప్‌స్టీన్ చేసిన వ్యాఖ్యలను చెత్త వదంతులని భారత్ కొట్టిపారేసింది. ఓ శిక్ష పడ్డ ఖైదీ చేసిన ఆరోపణలకు విలువే లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. 2017లో మోడీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన విషయం తప్ప.. ఎప్‌స్టీన్ మెయిళ్లలో ఉన్నదంతా తప్పని స్పష్టం చేసింది. దీనిపై.. ప్రతిపక్ష పార్టీలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని.. బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
FBI, CIA ఏం చేస్తున్నాయ్?
ఎప్‌స్టీన్ ఫైల్స్ కేవలం లైంగిక వేధింపుల కేసు మాత్రమే అయితే ఇంతటి ప్రకంపనలు సృష్టించేది కాదు. దీని వెనుక కథలు, కారణాలు వేరే ఉన్నాయ్. ఇంత భారీ స్థాయిలో అరాచకం జరుగుతుంటే.. FBI, CIA లాంటి సంస్థలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నే అందరినీ తొలిచేస్తోంది.పైగా.. డబ్బు, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా? ఎంతటి ఘోరానికైనా పాల్పడొచ్చా? వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చా? మైనర్ల పట్ల.. ఇంత దారుణంగా వ్యవహరించొచ్చా? అనే చేదు నిజాలు బయటపడుతున్నాయ్ ఇప్పుడు. మరీ ముఖ్యంగా.. పెద్ద మనుషులని, వ్యాపార దిగ్గజాలని, నిపుణులని, శాస్త్రవేత్తలని.. సమాజం గౌరవించే వ్యక్తుల అసలు స్వరూపాలు బయటపడటంతో.. అమెరికన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Also Read: ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడి.. 15 మంది మృతి, మరో ఏడుగురికి గాయాలు
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధానంగా వర్జీనియా గిఫ్రే, జోహన్నా స్జోబర్గ్ లాంటి బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయ్. ఎప్‌స్టీన్ తన ప్రైవేట్ దీవికి.. బాలికలని ఎలా తరలించేవాడో, అక్కడి ప్రముఖులకు వారిని ఎలా ఎరగా వేసేవాడో వివరించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో జైలులో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, అతని బాధితులకు న్యాయం జరగలేదు. ఇప్పుడు బయటకొస్తున్న ఫైల్స్ మాత్రం.. అమెరికాని గట్టిగా కుదిపేస్తున్నాయ్. ఎప్‌స్టీన్ ఫైల్స్ బయటకు రావడమనేది కేవలం ఓ స్కాండల్ మాత్రమే కాదు. అది అమెరికా అగ్రనేతల ముసుగును తొలగించిన ఓ చేదు నిజం. ఇది.. అమెరికా చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోతుంది.
Story By Anup, Bigtv