Thyroid: మన శరీరంలోని అతి చిన్న అవయవాలలో ఒకటైన థైరాయిడ్ గ్రంథి. మన మెటబాలిజంపై అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ గ్రంథి. మన కణాలకు ఎంత వేగంగా శక్తిని ఉత్పత్తి చేయాలో నిర్దేశించే హార్మోన్లను విడుదల చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే జీవక్రియ మందగించడం, అలసట, అసాధారణ బరువు పెరుగుదల వంటి సమస్యలు తలెత్తుతాయి. మెటబాలిజంలో థైరాయిడ్ పాత్ర, దానిని ఆరోగ్యంగా ఉంచుకునే 4 ముఖ్యమైన మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్, మెటబాలిజం..మధ్య సంబంధం ఏంటి ?
మన శరీరంలో జీవక్రియ అనేది ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. ఈ ప్రక్రియను నియంత్రించే ప్రధాన కేంద్రం థైరాయిడ్. థైరాయిడ్ గ్రంథి ప్రధానంగా T3, T4 అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.
మెటబాలిజంపై ప్రభావం:
ఈ హార్మోన్లు రక్తప్రవాహం ద్వారా ప్రతి కణానికి చేరుతాయి. ఇవి మీ గుండె ఎంత వేగంగా కొట్టుకోవాలి.. కణాలు ఎంత త్వరగా ఆక్సిజన్‌ను వినియోగించుకోవాలి.. అంతే కాకుండా మీరు తీసుకున్న ఆహారంలోని క్యాలరీలను ఎంత వేగంగా ఖర్చు చేయాలి అనే విషయాలను నిర్ణయిస్తాయి. ఒకవేళ థైరాయిడ్ తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే (హైపోథైరాయిడిజం), మెటబాలిజం నెమ్మదిస్తుంది. దీని వల్ల మీరు తక్కువ తిన్నా బరువు పెరుగుతారు. అంతే కాకుండా జుట్టు రాలుతుంది. నిస్సత్తువగా కూడా అనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి అయితే (హైపర్ థైరాయిడిజం), మెటబాలిజం చాలా వేగంగా మారుతుంది. దీని వల్ల బరువు విపరీతంగా తగ్గడం, గుండె వేగం పెరగడం వంటివి జరుగుతాయి.
థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 4 మార్గాలు:
1. సమతుల్య ఆహారం,పోషకాలు:
థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అయోడిన్ చాలా అవసరం. అయితే.. అది మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. అయోడిన్ కలిగిన ఉప్పు, చేపలు, ,గుడ్లు తీసుకోవాలి. అదేవిధంగా.. సెలీనియం అనే ఖనిజం థైరాయిడ్ హార్మోన్లను ఉత్తేజితం చేయడానికి సహాయ పడుతుంది. బ్రెజిల్ నట్స్, సన్ ఫ్లవర్ గింజలు, తృణధాన్యాలలో ఇది పుష్కలంగా ఉంటుంది. అలాగే జింక్ అధికంగా ఉండే ఆహారం కూడా థైరాయిడ్ పనితీరుకు మేలు చేస్తుంది.
2. ఒత్తిడిని తగ్గించుకోవడం:
నేటి కాలంలో థైరాయిడ్ సమస్యలకు ప్రధాన కారణం తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరం కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని అడ్డుకుంటుంది. కాబట్టి.. ప్రతిరోజూ ధ్యానం, యోగా లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవాలి.
Also Read: తగినంత నిద్రతో ఇమ్యూనిటీ డబుల్.. ‘స్లీపింగ్ ఎందుకంత ముఖ్యమో తెలుసా ?
3. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం:
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్ శరీరంలో మంటను పెంచుతాయి. ఇది థైరాయిడ్ గ్రంథిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్లూటెన్, అధికంగా సోయా ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కొందరిలో థైరాయిడ్ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సహజ సిద్ధమైన.. ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
4. క్రమం తప్పకుండా వ్యాయామం, నిద్ర:
వ్యాయామం నేరుగా థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించకపోయినా.. అది మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల తక్కువ ఉత్పత్తి వల్ల వచ్చే బరువు పెరుగుదలను అరికట్టడానికి సహాయపడుతుంది. అలాగే.. రాత్రిపూట కనీసం 7-8 గంటల గాఢ నిద్ర హార్మోన్ల సమతుల్యతకు అత్యవసరం. నిద్ర లేమి వల్ల హార్మోన్ల చక్రం దెబ్బతింటుంది.