Kalvakuntla Kavitha: కవితకు పార్టీ స్థాపన రాజకీయ అవసరమా..? లేకపోతే వ్యూహాత్మకమా? కవిత రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే పరిస్థితి ఉందా?తండ్రికి తగ్గ తనయలా కొత్త పవర్ సెంటర్‌గా మారాలని ఆమె ప్రయత్నిస్తున్నారా? కవిత మొదటి టార్గెట్ బీజేపీనే అవుతుందా? లేక బీజేపీకి బ్యాక్ అప్‌గా నిలుస్తారా? అసలుయకవిత పార్టీని స్థాపిస్తే.. బీజేపీ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన పేరు. ఇది కుటుంబ ఆస్తుల పంచాయితి కాదు, తనది ఆత్మ గౌరవ పంచాయితీ అంటూ శాసన మండలి సాక్షిగా భావోద్వేగానికి గురైన కవిత.. ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా ఎదిగి, ఇదే శాసన సభకు తిరిగి వస్తానని చేసి సవాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు కొత్త ఏర్పాటుకు సంబంధించి కవిత విస్తృత్తంగా చర్చలు జరుపుతుండటంతో దానిపై అనేక చర్చలు నడుస్తున్నాయి.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతోంది…కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని విపక్షాలు తెగ హడావుడి చేస్తున్నాయి … ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా నిలబడలేకపోతుందున్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఖాళీని భర్తీ చేయడానికే కవిత పార్టీ స్థాపించబోతున్నారా? లేక బీఆర్ఎస్‌కు బయట నుండి బ్యాక్ అప్ చేయడానికి పొలిటికల్ స్కెచ్ గీస్తున్నారా? లేక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని నిజం చేయాలని చూస్తున్నారు? అన్న సవాలక్ష సందేహాలు రాష్ట్ర పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ క్రమంలో బీజేపీకి, బీఆర్ఎస్‌లకు ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు చేయడానికే కవిత అస్త్రంలా పనిచేస్తున్నారన్న టాక్ సైతం అన్ని రాజాకీయ వర్గాల్లో నడుస్తోందట.
తెలంగాణలో ఉద్యమ నేఫథ్యం నుంచి ఉద్భవించిన పార్టీలు ఇప్పటికే అనేకం ఉన్నాయి. పెద్దగా యాక్టివిటీలో లేకపోయినా చౌరస్తాలో రెడ్, గ్రీన్, ఎల్లో సిగ్నల్స్ లెక్క అడపదడపా కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ కవిత పార్టీపై చర్చ మాత్రం భిన్నంగా నడుస్తోంది. అనేక ప్రశ్నలకు, అనేక సందేహాలకు దారి తీస్తుంది.. అయితే కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందడుగు వేస్తుందా..? లేక అధికార, ప్రతిపక్ష పార్టీల సమీకరణాలను తారు మారు చేసే పార్టీగా మారుతుందాఅన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయట.
ఇక కవిత పొలిటికల్ స్ట్రాటజీ అటుంచితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రతిపక్ష బోన్లో నిలబడింది. కవిత తిరుగుబాటు బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లెవల్లో తీరని నష్టం చేసే పరిస్థతి కనిపిస్తోందంటున్నారు. కవిత సృష్టించిన తిరుగుబాటు విధ్వంసంలోంచి ఇప్పట్లో బీఆర్ఎస్ బయటపడే అవకాశాలు కనిపించడం లేదన్న టాక్ సైతం వినిపిస్తోంది. ఇక బీజేపీ తనను తాను ప్రత్యామ్నాయ శక్తిగా చాటుకోవడానికి విఫల యత్నాలు చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత పార్టీతో బీజేపీకి రాజకీయంగా కొత్త టెన్షన్ మొదలయ్యిందంట.
కవిత ఎంట్రీ బీజేపీకి గట్టి దెబ్బేనా..? కవిత పార్టీ ప్రభావం మొదటగా బీజేపీపై పడుతుందా..? కవిత ముందుగా బీజేపీనే టార్గెట్ చేస్తారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయట. హిందుత్వం, మహిళలు, బీసీ వర్గాలు, అర్బన్, యువత వంటి అంశాలు ఇప్పటివరకు బీజేపీ ఆశలు పెట్టుకున్న ఓటు బ్యాంకు. అదే వర్గాలను కవిత తన రాజకీయ అజెండాలో కేంద్రంగా పెట్టుకుని.. ఆ ప్లేస్ ను ఆక్రమించుకుంటే… తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్లీ ఫోకస్‌లోకి తీసుకువస్తే, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్న బీజేపీ ఆశలు గల్లంతేనా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
లిక్కర్ స్కాం కేసులో తనను ఇరికించింది బీజేపీనేనన్న కసి కవితతో పాటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ ఉందన్న ప్రచారం బలంగా ఉందట. అందుకే కవిత నేతృత్వంలో కొత్త పార్టీకి బీజం పడితే మొదటి రాజకీయ దాడి బీజేపీపైనే ఉంటుందన్న చర్చ కూడా నడుస్తోందట. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలుప్రయత్నం చేశారు అన్న వాదనను తన పార్టీ ద్వారా కవితప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే అవకాశముందంటున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే వర్గ వివేధాలతో తలలు పట్టుకుంటున్న రాష్ట్ర బీజేపీ…కవిత ఎఫెక్ట్‌ను ఏవిధంగా ఎదురుకుంటుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే బీజేపీని టార్గెట్ చేసినంతగా బీఆర్ఎస్ విషయంలో కవిత దూకుడు ప్రదర్శించరన్న వాదన వినిపిస్తోంది. ఇంకా ఆస్తుల తగాదాలు కొలిక్కి రాని నేఫథ్యంలో బీఆర్ఎస్‌పై ఓపెన్ వార్ చేయకుండా సైలెంట్ డిస్టెన్స్ ఫార్ములాను పాటించే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని, విచారణ ఏజెన్సీలను కవిత సోలోగా ఎదుర్కొగలరా? లేక భవిష్యత్తు రాజకీయ వ్యూహాలను దృష్టిలో పెట్టుకొని కవిత పార్టీ ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం అవుతుందా? అన్న డౌట్లుకూడా వ్యక్తమవుతున్నాయి.కవిత పార్టీ భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో… మహిళలు, బీసీ వర్గాల అండ, తెలంగాణ సెంటిమెంట్‌తో స్వతంత్ర శక్తిగా ఎదగాలనుకుంటున్న కవిత లక్ష్యం ఫలిస్తుందో లేదో చూడాలి.
Story by: Apparao, Big Tv