El Mencho: మెక్సికోలో ఇంత అలజడి రేగితే, ఇంతటి హింసాత్మక అల్లర్లు సాగుతుంటే.. జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లే లక్ష్యంగా ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ, కాల్పులకు తెగబడుతున్నారు. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లకే పరిమితమవగా, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. మెక్సికో వీధులన్నీ పగిలిన గాజు ముక్కలు, కాలిపోయిన వాహనాల శకలాలతో.. అల్లకల్లోల వాతావరణంలో కనిపిస్తున్నాయ్.
పోలీసులు ఏమైపోయారో తెలియదు.. ఆర్మీ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. మెక్సికో ప్రెసిడెంట్ కూడా ఏం చేయాలో తెలియక చేతులెత్తేసిన పరిస్థితులు నెలకొన్నాయ్. మొత్తానికి.. మెక్సికో మాత్రం మంటల్లో కాలుతోంది. డ్రగ్ డాన్ ఎల్ మెంచోని హతమార్చాడాన్ని జీర్ణించుకోలేని డ్రగ్ కార్టెల్స్ అంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రోడ్ల మీదకు వచ్చి బీభత్సం సృష్టిస్తున్నారు. కార్లను, భారీ ట్రక్కులను, బైకులను, ఇలా కనిపించిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు. ప్రధాన సెంటర్లలో టైర్లని తగలబెట్టి, దట్టమైన పొగతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మెక్సికోలో పరిస్థితులన్నీ పూర్తిగా దిగజారిపోయాయ్. ఈ హింస ఎక్కడితో ఆగుతుందో అర్థం కావట్లేదు. చివరికి.. ఎయిర్‍పోర్టులు కూడా మూసేయాల్సిని పరిస్థితి వచ్చింది. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మంచో.. మెక్సికో ఆర్మీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. దాంతో.. దేశంలో పెద్ద ఎత్తున ఆందోళను చెలరేగాయ్.
అమెరికా నిఘా వర్గాల సమాచారంతో.. ఎల్ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో సైన్యం ఆదివారం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. జాలిస్కో స్టేట్‌లోని తపాల్ప టౌన్‌లో ఎల్ మెంచో నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఈ క్రమంలో.. మెంచో అనుచరులు కాల్పులు జరపగా.. ఆర్మీ ఎదురుదాడి చేసింది. ఈ భీకర ఆపరేషన్‌లో.. ఎల్ మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతడని అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది. ఎల్ మెంచోతో పాటు అతని డ్రగ్ ముఠాకు చెందిన మరో ఆరుగురు ఈ ఆపరేషన్‌లో మరణించారు. ఈ ఘటనతో మెక్సికోలోని అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. డ్రగ్ మాఫియా డాన్ అనుచరులు, డ్రగ్ కార్టెల్స్.. చాలా ప్రాంతాల్లో రోడ్లని దిగ్బంధించారు. వాహనాలు, సూపర్ మార్కెట్లు, బ్యాంకులను తగలబెట్టారు.
మెక్సికో డ్రగ్ మాఫియా సామ్రాజ్యంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎల్ మంచో అంతంతో.. ఆ దేశం అగ్నిగుండంగా మారింది. శక్తిమంతమైన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేతని సైన్యం మట్టుబెట్టిందన్న వార్త డ్రగ్ కార్టెల్ సభ్యుల్లో కార్చిచ్చు రగిల్చింది. అందువల్లే.. మెక్సికో వీధులు యుద్ధ క్షేత్రాలని తలపిస్తున్నాయ్. దశాబ్దాలుగా డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏలుతూ, ప్రభుత్వానికే సవాల్ విసిరిన ఎల్ మంచోని సైన్యం హతమార్చడమే ఓ సంచలనమైతే, ఇప్పుడు మొదలైన హింస మొత్తం దేశాన్నే అతలాకుతలం చేస్తోంది. జాలిస్కో స్టేట్‌తో పాటు మెక్సికో అంతటా డ్రగ్ కార్టెల్ సభ్యులు రోడ్లపైకి వచ్చారు. అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఈ హింసాత్మక ఆందోళనలని చూస్తుంటే.. మెక్సికోలో డ్రగ్ మాఫియా ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. పోలీసులు, ఆర్మీని లెక్కచేయకుండా, ఎంతకైనా తెగిస్తుందనే విషయం స్పష్టమవుతోంది. తమ డ్రగ్ కార్టెల్ అధినేత మరణాన్ని ప్రతీకారంగా.. వందలాది బస్సులు, ట్రక్కులను రోడ్ల మధ్యలో తగలబెట్టేస్తున్నారు. పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఈ హింసతో.. సాధారణ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గాల్లో ఎక్కడ చూసినా తుపాకుల మోత, నల్లటి పొగ కనిపిస్తోంది.
ఎల్ మంచో అంతం.. కేవలం ప్రభుత్వం వర్సెస్ డ్రగ్ కార్టెల్ మధ్య వార్‌గానే మిగిలిపోలేదు. ఇప్పుడు అతని స్థానాన్ని ఆక్రమించేందుకు, ఇతర చిన్న చిన్న ముఠాలు, సినాలోవా లాంటి ప్రత్యర్థి కార్టెల్స్ కూడా రంగంలోకి దిగాయ్. దాంతో.. మెక్సికోలో గ్యాంగ్ వార్ తీవ్ర స్థాయికి చేరింది. జాలిస్కోని.. ఈ పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా గుర్తించి, కర్ఫ్యూ విధించారు. మెక్సికో సిటీ అంతటా హై-అలర్ట్ ప్రకటించారు. సరిహద్దుల్లోనూ సైన్యం భారీగా మోహరించింది. అమెరికా-మెక్సికో బోర్డర్ దగ్గర కూడా పరిస్థితులు సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అల్లర్లు, దాడులు, ఆందోళనలన్నీ.. ఎల్ మంచ్ డ్రగ్ కార్టెల్స్‌కి ఎంత ముఖ్యమైనవాడో చెబుతున్నాయ్. అతని పతనంతో.. డ్రగ్ మాఫియా ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయింది. ఎల్ మంచో అంతంతో డ్రగ్ మాఫియాపై విజయం సాధించామన్న విజయం కంటే, అక్కడి ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న అల్లర్లను ఆపడమే పెద్ద సవాల్‌గా మారింది.
మెక్సికోలో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయ్. ఒకప్పుడు.. ఎల్ చాపో పేరు వింటే ఎలా భయపడేవారో, ఆ తర్వాత ఎల్ మెంచో పేరు అంతకంటే ఎక్కువ ప్రకంపనలు సృష్టించింది. అతని అంతం తర్వాత ఏర్పడిన శూన్యం.. మెక్సికోని హింసలోకి నెట్టేసింది. డ్రగ్ మాఫియా కింగ్, కరడుగట్టిన నేరస్తుడు ఎల్ మెంచో మృతితో.. మెక్సికో అట్టుడికిపోతోంది.
ఎల్ మెంచో అసలు పేరు నెమెసియో ఒసెగుయెరా సెర్వాంటెస్. 1966లో మిచోకాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టాడు. ఆ ఏరియాలో.. అవకాడోతో పాటు గంజాయి, నల్లమందు లాంటి ఎక్కువగా సాగు చేస్తుంటారు. తన చిన్నతనంలో అవకాడో పొలాల్లో పనిచేసిన మెంచో.. ఆ తర్వాత 1980ల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో హెరాయిన్ సప్లై చేస్తూ యూఎస్ పోలీసులకు దొరికిపోయాడు. కొన్నేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన తర్వాత.. అమెరికా యంత్రాంగం అతడిని మెక్సికోకు అప్పగించింది. స్వదేశానికి వచ్చిన తర్వాత.. కొంతకాలం పాటు పోలీసుగా పనిచేశాడు.
అదే సమయంలో.. డ్రగ్ మాఫియా కాంటాక్టులు తెలుసుకొని మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో.. తొలుత మెక్సికోలో శక్తిమంతమైన సినావోలా డ్రగ్ కార్టెల్‌కు చెందిన ముఠాలో పనిచేశాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి బయటకువచ్చి.. 2009లో సొంతంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే డ్రగ్ ముఠాని ఏర్పాటు చేశాడు. డ్రగ్స్ దందాలో తన శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపడం, సోషల్ మీడియాలో ఆ వీడియోలని పోస్ట్ చేసి భయాందోళనలు సృష్టించడం వీడి స్టైల్. గడిచిన పదేళ్లలో.. మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన క్రిమినల్ సిండికేట్‌గా మారాడు. అమెరికాకు ప్రధాన డ్రగ్ సప్లయర్‌గా ఎదిగాడు.
ఎల్ మెంచోకు చెందిన CJNG ముఠా.. కొన్నేళ్లుగా అమెరికాకు ఫెంటానిల్ లాంటి ప్రమాదకరమైన డ్రగ్స్‌ని అక్రమంగా సప్లై చేస్తోంది. డ్రగ్స్ సరఫరా ఒక్కటే కాదు.. ఈ ముఠా దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యల వంటి అనేక నేరాలకు పాల్పడింది. 2015లో ఆరు వారాల వ్యవధిలోనే, అత్యంత దారుణంగా 20 మందికి పైగా పోలీసుల తలలు నరికి చంపేసింది. మొన్నటిదాకా.. అమెరికాకు సప్లై అయ్యే సింథటిక్ డ్రగ్స్, ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా వ్యాపారంలో ఎల్ మెంచోదే పైచేయి. చివరకు అమెరికా కూడా జాలిస్కో డ్రగ్ కార్టెల్‌ని ఉగ్ర సంస్థగా పరిగణించింది.
ఎల్ మెంచోపై.. 15 మిలియన్ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. మన కరెన్సీలో 136 కోట్లు. మెక్సికో డ్రగ్ కింగ్‌పిన్ ఎల్ చాపో తర్వాత.. ఆ దేశంలో అత్యంత పవర్‌ఫుల్ క్రిమినల్ బాస్‌గా ఎల్ మెంచో మారాడు. అజ్ఞాతంలో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తలదాచుకునేవాడు. గతంలో రెండుసార్లు అతడిని పట్టుకునేందుకు మెక్సికో దశాలు ప్రయత్నించగా.. తప్పించుకున్నాడు. సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ.. అధికారులు, శత్రువులను భయపెట్టేవాడు. ఎల్ మెంచో ఫ్యామిలీ కూడా అతని నేర ముఠాలో భాగమే. అతని భార్య రోజాలిండా వాలెన్సియా.. జాలిస్కో డ్రగ్ కార్టెల్ ఆర్థిక వ్యవహారాలు చూసేది. కొడుకు.. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఎల్ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో ఆర్మీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో అతడి ఆచూకీని గుర్తించి, చుట్టుముట్టి మట్టుబెట్టారు. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా డ్రగ్ డాన్ అంతంపై స్పందించారు. ఎల్ మెంచోని హతమార్చిన క్రెడిట్.. అమెరికా ఖాతాలో వేసేందుకు ప్రయత్నించారు. అన్ని విషయాల్లో తామే గెలుస్తున్నామని, ఇలా అన్నింటిలోనూ విజయం సాధించడం న్యాయం కాదని.. సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశారు. అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే.. డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచోని సైన్యం హతమార్చిందని వైట్ హౌజ్ కూడా ప్రకటించింది.
ఎల్ మెంతో లాంటి నార్కో టెర్రరిస్ట్‌లని అగ్రరాజ్యం ఎప్పటికీ సహించదన్నారు. అయితే.. వాషింగ్టన్‌లోని మెక్సికో ఎంబసీ మాత్రం.. ఈ విషయంలో అమెరికా క్లెయిమ్‌ని తోసిపుచ్చింది. ఎల్ మెంచోని బంధించడానికి మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ మాత్రమే ప్లాన్ చేశాయని తెలిపింది. ఈ విషయంలో అగ్రరాజ్యం ఇచ్చింది కొంత సమాచారం మాత్రమేనని తెలిపింది. ఇక.. మెక్సికోలో ఎల్ మెంచో డ్రగ్ కార్టెల్ సభ్యులు చేస్తున్న అల్లర్లతో.. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. హింసాత్మక పరిస్థితుల దృష్ట్యా ప్రజలంతా అప్పమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, స్థానిక అధికారులిచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు.
Story by: Anup, Big Tv