కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమానికి మద్దతివ్వడానికి సినీ తారలు కూడా దిగి వస్తున్నారు. తాజాగా ఓ ముంబై మోడల్, నటి రిహియా అహిర్ (Rhiya Ahir) ఉద్యమంలో చూపిన ధైర్యసాహసాలకు మొత్తం దేశం భేష్ అని కీర్తిస్తున్నది. ప్రస్తుతానికి ఆమె వైరల్ మోడల్‌గా మారింది. ఢిల్లీలో జరుగుతున్న జెన్-జీ ఆందోళనలకు మద్దతుగా ముంబైలోని దాదర్ వద్ద ఉన్న శివాజీ పార్క్ నుంచి ఉద్యమకారులను బలవంతంగా పోలీసులు వ్యాన్‌లో ఎక్కించి తరలిస్తున్నారు. ఉద్యమంలో పాల్గొనడానికి వచ్చిన రిహియా అహిర్ దీన్ని చూసి వెంటనే ఆ వ్యాన్‌కు అడ్డుగా వెళ్లి నిలబడ్డారు.
ఓ వైపు వాన కురుస్తున్నా లెక్కచేయకుండా తను వేసుకున్న జర్కిన్‌ను తలపై రక్షణగా కప్పుకుని .. వ్యాన్ డ్రైవర్‌ను చూస్తూ.. ఎలా ముందుకు తీసుకెళ్తావో తీసుకెళ్లు.. నాపై నుంచి పోనియ్యు.. !అంటూ వాదనకు దిగడంతో అతను అక్కడే రోడ్డుపై ఆ వ్యాన్ ఆపేశాడు. చుట్టూ ట్రాఫిక్ జామ్ అవుతున్నా ఆమె లెక్క చేయలేదు. దాదాపు 40 నిమిషాల పాటు ఆమె అలాగే వ్యాన్‌ను ఆపేసి ఉంచగలిగారు. అప్పటి వరకు ఆమె చర్యను ఆశ్చర్యంగా చూస్తున్న తోటి ఉద్యమకారులు, మీడియా మెల్లగా ఆమె వద్దకు చేరారు.
ఆమె చేసిన పనిని ప్రశంసిస్తూ పెద్ద పెట్టున నినాదాలిస్తూ ఆమెను మరింత ఉత్సాహ పరిచారు. ఒకరిద్దరు ఆమెతో కలిసి వ్యాన్‌ను అడ్డుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విస్తృతంగా లైక్‌లు కొట్టి… ఉద్యమానికి తమ సంఘీభావం తెలపడంతో పాటు అహిర్ చేసిన సాహసకృత్యానికి జేజేలు పలుకుతున్నారు.
అయితే దీన్ని కూడా బీజేపీకి చెందిన కొందరు సోషల్ మీడియా నెటిజన్ల ఎద్దేవా చేస్తూ పోస్టులు పెట్టారు. ఆమె కేవలం ఆగి ఉన్న పోలీస్ వ్యాన్ వద్దకు వెళ్లి ఫోటో దిగిందని, దీనికి ప్రతిఫలంగా ఆమెకు 100కే లైకులు దొరికాయని వెటకారంగా పోస్టులు పెట్టడంతో.. దీనిపై విరుచుకుపడ్డారు అంతా. దీని వల్ల కూడా ఆమె మరింత వైరల్ అయ్యారు.
బీజేపీ శ్రేణులే రిహియా ఫోటోను ఓ రకంగా ఎక్కువగా ట్రోల్‌చేసే క్రమంలో ఆమెను మరింతగా ఫేమ్ చేశారని చెప్పాలి. ఢిల్లీలో ఉద్యమాలు చేస్తున్న జెన్-జీని ఉద్దేశించి .. దేశద్రోహులతో చేతులు కలపారని, నిధులు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయనే కట్టు కథలు ప్రచారం చేసి.. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమైంది బీజేపీ సోషల్ మీడియా.
ఓ రకంగా చెప్పాలంటే.. ఈ దుష్ప్రచారాలే ఉద్యమానికి మరింత ఊతమిచ్చాయి. దేశవ్యాప్తంగా వారికి సంఘీభావం మరింతగా దొరికిందే తప్ప.. తగ్గలేదు. ఇప్పుడు ముంబై మోడల్, నటి రిహియా అహిర్ విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. తామొక్కటి తలిస్తే.. అన్నట్టుగా సీజేపీ ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రతిచర్యా.. తిరిగి వారినే దెబ్బతీస్తున్నది. వారికే రివర్స్ అవుతున్నది.
ఉద్యమకారులను మరింత ఫేమ్ చేస్తూ వారికి సానుభూతి, సంఘీభావం దొరికేలా చేస్తున్నది. ఇప్పుడు వైరల్ అయిన ఆ నటి గురించి నెటిజన్లు తెలుసుకునేందుకు విస్తృతంగా సర్చ్ చేస్తున్నారు.
27 ఏళ్ల అహిర్.. ముంబైకి చెందిన మోడల్, థియేటర్ ఆర్టిస్ట్. ఆమె దాదాపు 13 ఏళ్లుగా హిందీ థియేటర్,నటన రంగంలో పనిచేస్తున్నారు. స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు, వారి ఆర్థిక ఎదుగుదలకు రియాసత్ (Riyasat) అనే బ్రాండ్‌ను ప్రారంభించి, స్థానిక కళాకారుల ఉత్పత్తులను కొనుగోలుదారులతో అనుసంధానించే పనిని భుజానికెత్తుకున్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)లో ఆమె తండ్రి, కుటుంబంలో మరికొందరు కూడా సాయుధ దళాల్లో సేవలందించినట్లు ఆమె ఓ టీవీ ఇంటర్వ్యూలో తెలిపారు. యువత భవిష్యత్‌పై పరీక్షా పత్రాల నిర్వహణకు సంబంధించిన అవకతవకలు తీవ్ర ప్రభావం చూపడం తనను కలిచివేశాయని, అందుకే తాను స్వచ్చంధంగా ఆ ఉద్యమంలో పాల్గొన్నానని వివరించారామె.