ఆయనను అభిమానులు కింగ్‌గా సంబోధిస్తారు. ఆయన ప్రవర్తన, ఆలోచనలు,నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. అనవసర విషయాల్లో తలదూర్చడు. అవసరమైతే తప్ప తను స్పందించడు. ఎవరేమనుకున్నా పట్టించుకోడు. బిగ్ బాస్‌పై ఎన్ని విమర్శలు చేసినా.. తన బిజినెస్మైండ్కే ట్యూన్ అవుతాడు.
ఎక్కడ తగ్గాలో .. ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు. అందుకే కింగ్‌గా నిలదిక్కుకున్నాడు. తాజాగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపుకు తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దగా వెంటనే స్పందించాడు. తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, కరువు పరిస్థితులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినీ రంగ ప్రముఖుల సహకారాన్ని సీఎం కోరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నెలకొన్న నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, కరువు తీవ్రతను ప్రజలకు వివరించడానికి, నీటి పొదుపుపై చైతన్యం తేవడానికి సెలబ్రిటీలు, సినీ పరిశ్రమ ముందుకు రావాలని సీఎం కోరారు.
దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సహాయం చేయడంలో తెలుగు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఎల్ నినో ముప్పు తగ్గేంత వరకు ప్రభుత్వానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించేందుకు ఇండస్ట్రీ సిద్ధంగా ఉందని, సీఎం పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని నాగార్జున భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ అప్పీలుకు సినీ పరిశ్రమ నుండి లభించిన ఈ సానుకూల స్పందన కరువు నివారణ, అవగాహన కార్యక్రమాలకు మరింత బలాన్ని చేకూర్చడమే కాదు.. మున్ముందు సీఎం రిలీఫ్ ఫండ్‌కు కూడా విరివిగా విరాళాలు అందించేందుకు కూడా సన్నద్దం అవుతుందనే సంకేతాలు వచ్చాయి. ఇది మంచి పరిణామమే.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే మొదట నష్టపోయింది నాగార్జునే. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయడంతో సినీ ఇండస్ట్రీతో సర్కార్ దూరం పెంచుకుంటున్నదనే ప్రచారం జరిగింది. ఆ తరువాత దీనిపై చట్టపరంగా కోర్టుకు పోయినా.. అప్పటికే కన్వెషన్ కుప్పకూలింది. ఆ తరువాత వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న నాగార్జున.. చెరువు శిఖం భూమిలో ఉన్న తన ఫంక్షన్ హాల్ జాగాను సర్కార్‌కు వదిలేసి పెద్దరికాన్ని చాటుకున్నాడు.
ఆ తరువాత మాజీ మంత్రి కొండా సురేఖ రూపంలో నాగార్జున తీవ్ర మానసిక ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. సమంత విషయంలో దిగజారి కామెంట్ చేాశారు సురేఖ. దీనిపై నాగ్ కోర్టుకు కూడా వెళ్లడం, పరువు నష్టం దావా వేసి.. సర్కార్‌నే బజారులోకి గుంజే ప్రయత్నం చేశాడు. కానీ ప్రభుత్వ పెద్దల బుజ్జగింపుతో రాజీకి వచ్చాడు. కేసును విత్ డ్రా చేసుకున్నాడు. ఇక్కడా మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు నాగ్.
ఆ తరువాత సినీ ఇండస్ట్రీ పెద్దలతో సీఎం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా నాగార్జున ముఖ్య అతిథిగా హాజరవ్వడమే కాదు.. సీఎంను సత్కరించి సినీ పరిశ్రమ నుంచి గౌరవ, మర్యాదలు చేసి తన సంస్కారాన్ని చాటుకున్నాడు. మనసులో ఎలాంటి బేధాలు పెట్టుకోకుండా సినీ ఇండస్ట్రీ ఎప్పుడూ సర్కార్ కు మద్దతుగా ఉంటుందనే సంకేతాలిచ్చాడు. ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ చేసిన అభ్యర్థనపై వెంటనే స్పందించాడు నాగ్.