New Year Celebrations: ఈ ఇయర్ వెళ్లిపోతోందన్న బాధలో కొందరు.. న్యూ ఇయర్ వస్తోందన్న సంతోషంలో ఇంకొందరు.. మొత్తంగా నయా సాల్ సెలబ్రేషన్స్‌తో.. ఓ ఊపు ఊపేయాలని డిసైడ్ అయిపోయారంతా! పార్టీ ఇరగదీసేయాలని ముందే నుంచే ఏవేవో ప్లాన్లు వేసేసుకున్నారు. పబ్‌లు, క్లబ్‌లు, ఫామ్ హౌజ్‌లు, రిసార్టులు, ఓపెన్ రెస్టారెంట్లు.. ఇలా అన్నీ డిసెంబర్ 31కి రెడీ అయిపోయాయ్. ఈ కల్చర్ ఊళ్లల్లో కొంత పద్ధతిగా ఉంటుందేమో గానీ.. హైదరాబాద్ లాంటి సిటీలో న్యూఇయర్ పార్టీలంటే వైబ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటాకే.. అసలైన సెలబ్రేషన్ మొదలవుతుంది. చాలామంది ఇళ్లలో కంటే.. రోడ్ల మీదే ఎక్కువగా కనిపిస్తారు. రకరకాల స్టంట్స్ చేస్తుంటారు. అలాంటోళ్లందరికీ.. సిటీ పోలీసులు స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు. రూల్స్ లెక్కచేయకుండా రోడ్డెక్కితే ఏమవుతుందో తెలుసా?
సెలబ్రేషన్.. వైబ్రేషన్ మామూలుగా ఉండదు!
గ్రేటర్ హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే.. సూపర్ వైబ్. సిటీలోని.. టెక్ హబ్స్ మొదలుకొని హిస్టారికల్ ప్లేస్‌ల దాకా.. ప్రతి వీధిలో సంబరాలు ఆకాశాన్ని తాకుతాయ్. 2026 న్యూ ఇయర్ వేడుకలకు.. హైదరాబాద్ రెడీ అయిపోయింది. ఈసారి సెలబ్రేషన్.. వైబ్రేషన్ మామూలుగా ఉండదంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. యూత్ కూడా ఫుల్ హంగామా చేయాలని డిసైడ్ అయిపోయారు.
డిసెంబర్ 31 సాయంత్రం 6 తర్వాత ఫుల్ పార్టీ మూడ్
హైదరాబాద్‌కు ఓ స్పెషాలిటీ ఉందబ్బా! ఇక్కడ.. సంస్కృతి, సంప్రదాయాలు ఎంతలా గౌరవించబడతాయో.. క్రిస్మస్, న్యూఇయర్ లాంటి కల్చర్‌ని కూడా అంతే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. డిసెంబర్ 31 సాయంత్రం 6 తర్వాత.. సిటీ మొత్తం ఫుల్ పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. నగరం మొత్తం న్యూఇయర్ జోష్ మొదలవుతుంది. యూత్ సందడి మామూలుగా ఉండదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియాలు, సిటీ శివార్లు.. న్యూఇయర్ వేడుకలకు కేరాఫ్‌గా మారిపోతాయ్. టాప్ నోచ్ పబ్‌ల్లో.. ఇంటర్నేషనల్ డీజేలతో మ్యూజిక్ నైట్స్ జరుగుతాయ్. ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్స్‌లో యూత్ దుమ్మురేపుతారు. హైటెక్స్, గచ్చిబౌలి స్టేడియం లాంటి చోట్ల వేల సంఖ్యలో యువతీ, యువకులు డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తారు. పబ్‌లకు వెళ్లేందుకు ఇష్టపడని వాళ్లంతా.. ఫ్రెండ్స్‌తో రిలాక్స్‌గా ఎంజాయ్ చేసేందుకు.. రూఫ్ టాప్ రెస్టారెంట్లని సెలక్ట్ చేసుకుంటారు.
నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ దగ్గర ఫుల్ హంగామా
సిటీలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే.. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ దగ్గర సందడి మామూలుగా ఉండదు. కేక్ కటింగ్‍లు, అరుపులు, విషెస్.. ఆ ఏరియా అంతా సందడి, సందడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ.. హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. డిసెంబర్ 31 రోజున.. వైన్స్‌లు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంచుతారు. పబ్‌లకు కూడా అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇచ్చారు. ఈ సమయంలో వేడుకల జోష్ ఎంతలా ఉంటుందో.. పోలీసులు కూడా అంతే అప్రమత్తంగా ఉంటారు. కొత్త సంవత్సరంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. రాత్రి సమయంలో దాదాపు అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తారు. ఇప్పటికే.. నగరం మొత్తం డ్రంక్ అండ్ ట్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. హద్దు మీరితే.. హ్యాపీ న్యూ ఇయర్ ఉండదని చెబుతున్నారు. కొత్త సంవత్సరం పేరిట రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే 10 వేల రూపాయల ఫైన్‌తో పాటు 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ముందే హెచ్చరించారు.
రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌లప కఠిన చర్యలు
న్యూఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో.. యూత్ రోడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు సీపీ సజ్జనార్. కొత్త సంవత్సరం స్వాగత వేడుకలు.. ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగలాలే గానీ.. చేదు అనుభవాలుగా మారకూడదన్నారు. అదేవిధంగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఇబ్బంది పడొద్దన్నారు. ఫ్యామిలీతో ఉంటారా? జైల్లో ఉంటారా? అనేది.. మీరే నిర్ణయం తీసుకోవాలన్నారు సీపీ సజ్జనార్.
100 ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లు
న్యూఇయర్ సెలబ్రేషన్స్ విషయంలో పోలీసులు ముందే హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం 100 ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్లని సెలక్ట్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేయనున్నారు. ఇందుకోసం.. 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించనున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే.. డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉందంటున్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే డెసిగ్నేటెడ్ డ్రైవర్ క్యాబ్‌లను ఆశ్రయించాలంటున్నారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి సంబంధించి.. వారం ముందు నుంచే నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు హైదరాబాద్ పోలీసులు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. పబ్‌లు, రెస్టారెంట్లు, స్పెషల్ ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో.. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఈసారి.. జీరో డ్రగ్స్ సెలబ్రేషన్స్ టార్గెట్‌గా అన్ని చోట్లా జల్లెడ పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే పబ్‌లు, హోటళ్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని చెబుతున్నారు. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ తీసుకున్నా, సప్లై చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గతంలో డ్రగ్స్ తీసుకున్నవారు, సప్లై చేస్తూ దొరికిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ ఫ్రీ సెలబ్రేషన్స్‌కి తమ సపోర్ట్ ఉంటుందని చెబుతున్నారు.
హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు
నూతన సంవత్సర వేడుకల పేరుతో.. రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి.. పబ్‌లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి ఒంటిగంట వరకే పర్మిషన్ ఉంది. సౌండ్ పొల్యూషన్ రూల్స్ కచ్చితంగా పాటించాలంటున్నారు. డెసిబెల్స్ పరిమితి దాటితే.. సౌండ్ సిస్టమ్స్‌ని సీజ్ చేస్తామన్నారు. ఇక.. న్యూ ఇయర్ ఈవెంట్లలో గంజాయి, డ్రగ్స్ వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా.. యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని ముందే తేల్చి చెప్పేశారు. వారి లైసెన్సులు రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో.. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, వివిధ జంక్షన్లలో.. మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా వేయనున్నాయి. ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా.. జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వైబ్ అంటేనే.. ఓ ఎనర్జీ. ఖతర్నాక్ సెలబ్రేషన్స్‌తో.. ఫ్రెండ్స్ కేరింతలతో.. డీజే హోరుతో.. హైదరాబాద్ మొత్తం షేక్ అయిపోతుంది. పబ్‌కు వెళ్లినా, ఇంట్లో ఫ్యామిలీతో గడిపినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం తగ్గదు. అయితే.. ఏదైనా సరే లిమిట్ క్రాస్ చేయనంత వరకే. అలాకాదని.. రోడ్లపై హంగామా చేస్తాం.. బైకులు లేపి.. స్టంట్‌లు వేస్తాం అంటే.. తాట తీసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా.. తెల్లారేసరికి సీన్ మారిపోతుంది. కళ్లు తెరిచే సమయానికి ఒళ్లు జైల్లో ఉంటుంది. సో.. మీరంతా డిసెంబర్ 31న ఏం చేయాలో తెలుసా?
ఆనందం చిరకాలం గుర్తుండాలంటే.. సేఫ్‌గా ఉండాలి!
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే.. ఓ రేంజ్‌లో జరుగుతాయ్. ధమ్ బిర్యానీ ఘుమఘుమలు, పబ్‌లు, ఓపెన్ కాన్సర్ట్‌ల నుంచి వచ్చే డీజే సౌండ్లు, విద్యుత్ కాంతులతో మెరిసిపోయే సిటీ.. ఇలా నగరం మొత్తం ఓ కొత్త ప్రపంచంలా మారిపోతుంది. ఈ ఆనందం చిరకాలం గుర్తుండిపోవాలంటే.. అంతా సేఫ్‌గా ఉండాలి. ఒంటిపై పోలీసుల లాఠీలు పడకుండా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి.. జైల్లో ఊచలు లెక్కపెట్టకుండా.. కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పాలి. డిసెంబర్ 31 వస్తే చాలు.. నవాబ్ సిటీలో హవా మామూలుగా ఉండదు. టైమ్ గడిచేకొద్దీ జోష్ డబుల్ అవుతుంది. అయితే.. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే.. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ.. ఎంత మూల్యానికి? అనేది గుర్తొస్తే.. లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉంటాం. ఎందుకంటే.. మనం చేసే ఓవరాక్షనే మనల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈసారి పోలీసులు చూసీచూడనట్లు వదిలేయడం కాదు.. దొరికితే తాట తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. కఠినంగా వ్యవహరించబోతున్నారు.
తాగిన తర్వాత స్టీరింగ్ పట్టుకుంటే సీన్ రివర్స్
న్యూ ఇయర్ పార్టీ అన్నాక.. డ్రింక్స్ కామనే. కానీ.. తాగిన తర్వాత స్టీరింగ్ పట్టుకుంటే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. బైక్ ఎక్కి.. ర్యాష్‌గా డ్రైవ్ చేస్తే సీన్ సితారైపోతుంది. ఎందుకంటే.. నగరం మొత్తం వందలాదిగా పోలీస్ చెక్ పాయింట్లు పెడుతున్నారు. ప్రతి చోటా.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నారు. దొరికితే.. భారీ జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసే చాన్స్ ఉంది. లోపలున్న మ్యాటర్.. మీటర్ పగిలేంతగా వచ్చేస్తే.. రిమాండ్‌కు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. అందువల్ల.. క్యాబ్ బుక్ చేసుకోవడం గానీ, డ్రింక్స్ అలవాటు లేని మీ స్నేహితులను గానీ డ్రైవ్ చేయమని కోరండి. సెలబ్రేషన్ జోష్‌లో.. బైక్‌తో స్టంట్స్ వేయడం, సైలెన్సర్లు సౌండ్ పెంచి రోడ్లపై హంగామా చేస్తే.. మీ బైక్ సీజ్ అవ్వడమే కాదు.. న్యూ ఇయర్ ఫస్ట్ డేని.. పోలీస్ స్టేషన్‌లో గడపాల్సి వస్తుంది. ఇక.. పార్టీల్లో డ్రగ్స్ వాడినా, సప్లై చేసినా.. కఠిన చట్టాల కింద కేసులు నమోదవుతాయ్. తర్వాత.. ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు.
తప్పతాగి రోడ్లమీదకు రాకపోతేనే మంచిది!
డిసెంబర్ 31న.. సొంత వాహనాల కంటే క్యాబ్స్ గానీ మెట్రో జర్నీ గానీ బెటర్. పార్టీ కోసం బయటకు వెళితే.. వీలైనంత తొందరగా ఇంటికెళ్లిపోయే ప్రయత్నం చేయండి. లేకపోతే.. ఉదయం దాకా ఈవెంట్ జరిగిన చోటే ఉండండి. అంతే తప్ప.. తప్పతాగి రోడ్లమీదకు రాకండి. ఫ్రెండ్స్ అంతా ఒకరికొకరు తోడుగా ఉండండి. అమ్మాయిల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. వీటన్నింటికి మించి.. ఎవరూ రోడ్ల మీదకు రాకుండా.. ఎవరి ఇంట్లో వాళ్లు న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బెటర్. కొత్త సంవత్సరం వేళ ఫ్యామిలీతో గడిపినట్లు ఉంటుంది. సేఫ్‌గానూ ఉంటారు.
Also Read: బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం.. వంతెన పైనుంచి పడిపోయిన 19 బోగీలు!
న్యూ ఇయర్ అంటేనే.. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో మొదలవ్వాల్సిన రోజు. అందువల్ల.. ఒక్క రాత్రి చేసే చిన్న పొరపాటు.. మీ కెరీర్‌ని, భవిష్యత్తుని ఇబ్బందుల్లో పడేయకూడదు. ఇంట్లో మీకోసం ఎదురుచూసే తల్లిదండ్రుల్ని, ఫ్యామిలీని గుర్తుంచుకోండి. పోలీసులు.. మీ రక్షణ కోసమే ఉన్నారనే విషయం గమనించి.. సహకరించండి. మద్యం తాగితే మత్తెక్కుతుందనేది ఎంత నిజమో.. మద్యం మత్తులో పోలీసులకు దొరికితే.. మీరు చిత్తయిపోతారనేది కూడా అంతే నిజం. సో.. లిమిట్‌లో ఉన్నంత వరకు నో ప్రాబ్లమ్. ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా.. తెల్లారేసరికి సీన్ మారిపోతుంది. కళ్లు తెరిచే సమయానికి ఒళ్లు జైల్లో ఉంటుంది. అందువల్ల.. హద్దులు దాటకుండా.. న్యూఇయర్‌ని ఎంజాయ్ చేయండి. అంతకుమించి ఏం చేయాలనుకున్నా.. పోలీసులు తాట తీయడం, ఆ ఘటన.. 365 రోజులు గుర్తుండిపోవడం ఖాయం.
Story By Anup, Bigtv