Donald Trump: జోహ్రాన్ మమ్దానీ.. ఈ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఆ పేరే కాదు.. అతను సాధించిన విజయం కూడా అమెరికా చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే.. ఆ ఒక్కడే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎత్తుల్ని చిత్తు చేశాడు. న్యూయార్క్‌ని గెలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతడే.. జోహ్రాన్ మమ్దానీ. 33 ఏళ్లకే.. న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధించాడు. ఈ పదవి దక్కించుకున్న తొలి భారత-అమెరికన్ ముస్లింగానూ చరిత్రకెక్కాడు. అసలు.. ట్రంప్ ఎందుకోసం జోహ్రాన్‌ని ఓడించాలనుకున్నారు? కోట్లు ఖర్చు చేసినా.. అతను ఎలా గెలిచాడు?
ట్రంప్ ఒకటి తలిస్తే.. న్యూయార్క్ మరొకటి తలిచింది!
అమెరికా మొత్తం ఒక్కటై చూసిన ఎన్నిక ఇది. ప్రెసిడెంట్ ట్రంప్‌తో సహా.. రిపబ్లికన్ పార్టీ నేతలంతా ఒక్కటై వేసిన ఎత్తులవి. ఎలాగైనా సరే.. అతన్ని ఆపాలనుకున్నారు. ఓడించి.. తామేంటో చూపించాలనుకున్నారు. కానీ.. ట్రంప్ ఒకటి తలిస్తే.. న్యూయార్క్ ప్రజలు మరొకటి తలిచారు. అందుకే.. మమ్దానీ గెలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తులను చిత్తు చేస్తూ.. న్యూయార్క్ సిటీ మేయర్‌గా గెలిచి.. జోహ్రాన్ మమ్దానీ సరికొత్త రిత్ర సృష్టించారు. ఈ పదవి దక్కించుకున్న తొలి ఇండో-అమెరికన్ ముస్లిం కూడా మమ్దానీనే. అంతేకాదు.. అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గానూ రికార్డు సృష్టించారు. భారతీయ మూలాలున్న మమ్దానీ మరెవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడే. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమో లాంటి శక్తిమంతమైన ప్రత్యర్థులను ఎదుర్కొని మరీ.. జోహ్రాన్ విజయం సాధించడం ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది.
సామాన్య ప్రజల విజయంగా ప్రకటించిన జోహ్రాన్
న్యూయార్క్ సిటీ మేయర్‌గా విజయం సాధించిన తర్వాత.. జోహ్రాన్ విక్టరీ స్పీచ్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయ్. తన విజయాన్ని.. సామాన్య ప్రజల ఉద్యమ విజయంగా ప్రకటించారు. తన స్పీచ్‌లో.. డొనాల్డ్ ట్రంప్‌ని నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. ట్రంప్ తనపై చేసిన విమర్శల్ని పట్టించుకోలేదని.. తన విజయం ట్రంప్ పాలిటిక్స్‌కి విరుద్ధమని స్పష్టం చేశారు. ముఖ్యంగా.. తన విజయం వలసదారుల బలానికి నిదర్శనం అని ప్రకటించారు జోహ్రాన్. వారి సమస్యలను పరిష్కరించేందుకే.. తాను ప్రాధాన్యత ఇస్తానన్నారు. వలసదారులు నిర్మించిన న్యూయార్క్ సిటీ.. ఇకపై కూడా వలసదారుల నగరంగానే ఉంటుందన్నారు మామ్‌దానీ. ఇక నుంచి.. వలసదారుడి నేతృత్వంలో ఉంటుందన్నారు.
న్యూయార్క్‌లో వలసదారుల సమూహానికి ఓ మైల్ స్టోన్
న్యూయార్క్ సిటీకి.. మమ్దానీ మొట్టమొదటి ముస్లిం మేయర్. అంతేకాదు.. అతను వలసదారుల నుంచి వచ్చిన నాయకుడు కావడంతో.. ఈ విజయం వలసదారుల సమూహానికి సంబంధించి.. ఓ మైల్ స్టోన్‌గా కనిపిస్తోంది. జోహ్రాన్‌ని ఓడించేందుకు.. ట్రంప్ టీమ్ ఎంతో కష్టపడింది. కనీసం 26 మంది బిలీయనీర్లు అతను న్యూయార్క్ మేయర్ అవకుండా.. వందల కోట్లు ఖర్చు చేశారు. కానీ.. ఇద్దరు బిలయనీర్లు మాత్రం.. జోహ్రాన్ వైపు నిలిచారు. వారి మద్దతుతో.. అతను న్యూయార్క్ సిటీ ప్రజల మనసుల్నే కాదు.. మేయర్ సీటుని కూడా గెలిచాడు. చిన్న చిన్న విరాళాలు, వేలాది మంది వాలంటీర్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్, సామాన్య ప్రజల మద్దతుతోనే జోహ్రాన్ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీలోని ధన బలం, సంప్రదాయ రాజకీయ శక్తులను.. మమ్దానీ అధిగమించారు. అమెరికా ప్రెసిడెంట్‌ని ఎదుర్కొని.. మేయర్‌గా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. ట్రంప్య పొలిటికల్ డివిజన్‌ను ఎదుర్కొనేందుకు.. మేయర్‌గా తనవంతు పాత్ర పోషిస్తానని.. జోహ్రాన్ ప్రతిజ్ఞ చేశారు. రాజకీయ అంధకారం నెలకొన్న ఈ పరిస్థితుల్లో.. న్యూయార్క్‌లో కొత్త వెలుగు పుడుతుందని ప్రకటించారు మామ్‌దానీ.
తనని తాను డెమొక్రటిక్ సోషలిస్ట్‌గా చెప్పుకున్న మామ్‌దానీ
మమ్దానీ విజయం వెనుక.. ప్రోగ్రెసివ్ ఎజెండా, సామాన్య ప్రజల మద్దతు ఉన్నాయి. జోహ్రాన్ తనని తాను.. డెమొక్రటిక్ సోషలిస్ట్‌గా చెప్పుకున్నారు. తన ప్రచారంలో న్యూయార్క్ సిటీలో కాస్ట్ ఆఫ్ లివింగ్‌ని తగ్గించడంపై దృష్టిసారించారు. ఇదే అంశం.. వేలాది మంది న్యూయార్క్ వాసుల్లో.. ముఖ్యంగా యువత, వలసదారుల్లో బలంగా వినిపించింది. న్యూయార్క్‌లో మరిన్ని ఇళ్లని నిర్మించడం, కనీస వేతనాన్ని గంటకు 30 డాలర్లకు పెంచడం, ఫ్రీ బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు న్యూయార్క్‌లో అత్యంత సంపన్నులైన ఒక శాతం మందిపై.. పన్నులను స్వల్పంగా పెంచుతానని హామీ ఇచ్చారు. జోహ్రాన్ మమ్దానీ ముఖ్యంగా యువతని, ఫస్ట్ టైమ్ ఓటర్లను.. ఒక తాటిమీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అదే.. 1969 తర్వాత.. అత్యధిక శాతం పోలింగ్ పెరిగేందుకు దారితీసింది. అంతేకాదు.. ఉర్దూ, బంగ్లా, అరబిక్, స్పానిక్ లాంటి భాషల్లో ప్రచారం చేసి.. వలసదారుల సమూహాన్ని ఆకట్టుకున్నారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యుమోపై ఉన్న లైంగిక వేధింపుల ఆరోపణలు, సంప్రదాయ రాజకీయ వ్యవస్థపై ఉన్న అసంతృప్తితో.. అంతగా రాజకీయ అనుభవం లేని, ఓ నూతన నాయకుడి కోసం, ప్రోగ్రెసివ్ నాయకత్వం కోసం.. న్యూయార్క్ ప్రజలు ఎదురుచూశారు. ట్రంప్ అండ్ టీమ్ ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా.. జోహ్రాన్ మామ్‌దానీ న్యూయార్క్ మేయర్‌గా గెలిచారు.
1991ల ఉగాండాలోని కంపాలాలో జన్మించిన మామ్‌దానీ
జోహ్రాన్ మమ్దానీ.. 1991లో ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. అతని తల్లిదండ్రులిద్దరూ.. భారత మూలాలున్న వ్యక్తులే. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ. తండ్రి మహ్మద్ మమ్దానీ గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహ్మద్ మమ్దానీ.. తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జోహ్రాన్ మామ్‌దానీకి ఐదేళ్ల వయసున్నప్పుడు.. ఆయన కుటుంబం సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు మారింది. ఆ తర్వాత రెండేళ్లకే.. న్యూయార్క్‌కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. జోహ్రాన్ రాజకీయ విజయాల వెనుక.. తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. సంప్రదాయవాద, మూస సిద్ధాంతాలను సవాల్ చేస్తూ.. ముందుకు సాగారు. తల్లి చెప్పిన పాఠాలే.. జోహ్రాన్ పొలిటికల్ జర్నీకి ఎంతో సాయం చేశాయ్. అణచివేతకు.. గళమెత్తాల్సిందే అనే నినాదంతో.. జోహ్రాన్ రాజకీయాల్లోకి వచ్చారు. 2020లో తొలిసారి న్యూయార్క్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు.. న్యూయార్క్ సిటీ మేయర్‌గా గెలిచి.. మరో చరిత్ర సృష్టించారు.
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో పబ్లిక్ ఇచ్చిన తీర్పు.. ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. మమ్దానీ కొట్టిన విక్టరీ.. ప్రెసిడెంట్ ట్రంప్ పాలనకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. జోహ్రాన్‌ని అడ్డుకునేందుకు, ఓడించేందుకు రిపబ్లికన్ పార్టీ నేతలు ఎంత ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. ఈ లెక్కన.. అమెరికా ప్రజలకు ట్రంప్ అంటే అస్సలు పడట్లేదా? న్యూయార్క్.. రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్‌ని ఎందుకు రిజెక్ట్ చేసింది?
మామ్‌దానీని అడ్డుకునేందుకు రిపబ్లికన్ నేతల ప్రయత్నాలు
జోహ్రాన్ మమ్దానీ విజయం.. ప్రెసిడెంట్ ట్రంప్ పాలనకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. న్యూయార్క్ ఎన్నికల్లో.. మమ్దానీని అడ్డుకునేందుకు రిపబ్లికన్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అది ఫలించలేదు. రిపబ్లికన్ల విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే జోహ్రాన్.. తన ప్రచారంలో పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. దీంతో.. ట్రంపే నేరుగా గ్రౌండ్‌లోకి దిగాల్సి వచ్చింది. ఒకానొక దశలో.. మమ్దానీ గనక గెలిస్తే న్యూయార్క్ సిటీకి ఫెడరల్ సాయం అందదని.. ట్రంప్ హెచ్చరించే దాకా వెళ్లారు. యూదు వ్యతిరేకి అంటూ రిపబ్లికన్లు.. మమ్దానీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వాటన్నింటికి ఎదురొడ్డి నిలిచిన జోహ్రాన్.. ఓటర్ల దృష్టిని ఆకర్షించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉచితాలు, నమ్మకమైన హామీలతో ప్రచారం చేశారు. ట్రంప్ వ్యతిరేకత ప్రచారాన్ని కూడా.. మమ్దానీ తెలివిగా ఉపయోగించుకున్నారు. ట్రంప్ కామెంట్లు.. మమ్దానీకి వ్యతిరేకంగా, న్యూట్రల్‌గా ఉన్న ఓటర్లలో.. అతని పట్ల సానుభూతిని పెంచాయ్. ట్రంప్‌ని వ్యతిరేకించే.. డెమొక్రటిక్ ఓటర్లను మరింత బలోపేతం చేశాయ్. తన ప్రోగ్రెసివ్ విధానాలతో, యువత, వలసదారుల మద్దతుతో పాటు ట్రంప్‌పై అమెరికన్లలో ఉన్న వ్యతిరేకతను.. తనకు అనుకూలంగా మలచుకొని.. న్యూయార్క్ సిటీ మేయర్‌గా విజయం సాధించారు.
ముందు నుంచే న్యూయార్క్ సిటీ డెమొక్రాట్లకు కంచుకోట
ముందు నుంచే న్యూయార్క్ సిటీ డెమొక్రటిక్ పార్టీకి కంచుకోట లాంటిది. దశాబ్దాలుగా.. ఇక్కడ డెమొక్రటిక్ అభ్యర్థులే మేయర్‌గా, ఇతర కీలక స్థానాల్లో గెలుపొందుతున్నారు. న్యూయార్క్‌లో నమోదైన ఓటర్లలో.. డెమొక్రాట్‌లు, రిపబ్లికన్ల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటారు. రిపబ్లికన్ అభ్యర్థులు గెలవాలంటే.. స్వతంత్ర ఓటర్లు, డెమొక్రాట్లలో ఓ విభాగం కూడా తమకు ఓటు వేయాల్సి ఉంటుంది. పైగా.. అమెరికాలోని నగరాల్లో.. న్యూయార్క్ చాలా భిన్నమైన సిటీ. ఇక్కడి జనాభా.. మమ్దానీ లాంటి ప్రగతి శీల భావజాలం గల నాయకుడికే మద్దతుగా నిలుస్తుంది. పైగా.. ప్రెసిడెంట్ ట్రంప్ వైఖరి, ఆయన విధానాలు బాగా తెలుసు. ట్రంప్ పాలనని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కాబట్టి.. చాలా తెలివిగా జోహ్రాన్ వైపు నిలిచారు. అంతేకాదు.. న్యూయార్క్ వాసులు గన్ కంట్రోల్, పర్యావరణ పరిరక్షణ, వలసదారుల హక్కులు, మెరుగైన సామాజిక భద్రతా పథకాలకు బలంగా మద్దతు ఇస్తారు. వీటన్నింటికి.. జోహ్రాన్ అనుకూలంగా ఉన్నట్లు కనిపించింది. పైగా.. న్యూయార్క్ ట్రంప్ సొంత సిటీ. అయినప్పటికీ.. నగరవాసుల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ట్రంప్ రాజకీయాలు, విధానాలు.. న్యూయార్క్ వాసుల భిన్నమైన, కార్మికుల అనుకూల విలువలకు అస్సలు సరిపోవు. ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతను.. మమ్దానీ తన ప్రచారానికి గట్టిగా వాడేశారు. అలా.. తన ప్రగతిశీల ఎజెండాకు మద్దతును కూడగట్టుకున్నారు.
Also Read: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..
న్యూయార్క్‌లో రిపబ్లికన్ల ఓటమి.. ఇప్పుడు అమెరికాలో రీసౌండ్‌లో వినిపిస్తోంది. ప్రెసిడెంట్ ట్రంప్.. సొంత సిటీలోనే రిపబ్లికన్లు గెలవకపోవడం.. హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా.. యూఎస్‌లో నగరాల్లో డెమొక్రాట్లు బలంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలు రిపబ్లికన్లకు మద్దతుగా నిలుస్తున్నాయనే చర్చ ఉంది. కానీ.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. అమెరికన్లందరిలోనూ వ్యతిరేకత పెరిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయ్. ట్రంప్ నాయకత్వంలో రిపబ్లికన్ పార్టీ అవలంబించిన విభజన రాజకీయాలు, వలస విధానాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలను.. న్యూయార్క్ సిటీ తిరస్కరించిందనేందుకు ఇదొక క్లియర్ ఇండికేషన్. ట్రంప్ వ్యక్తిగత జోక్యం, ప్రత్యక్ష బెదిరింపులు కూడా యాంటీ రిపబ్లికన్ ఓటింగ్‌కు దారితీశాయ్. జోహ్రాన్ మామ్‌దానీ విజయం.. న్యూయార్క్ నగరంలో ట్రంప్ పట్ల, సంప్రదాయ రిపబ్లికన్ విధానాల పట్ల బలమైన వ్యతిరేకతను స్పష్టం చేసింది.
Story By Anup, Bigtv