E-Paper
Advertisement

Tejas Fighter Jet: తేజస్ డౌట్స్! తప్పిదమా? లోపమా?

Tejas Fighter Jet: తేజస్ డౌట్స్! తప్పిదమా? లోపమా?

Tejas Fighter Jet:  ఎస్.. మన తేజస్ కూలింది. అయితే.. ఇదేం మొదటిసారి కాదు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే.. తేజస్ ఫైటర్ జెట్ కూలడం ఇది రెండోసారి. దుబాయ్ ఎయిర్‌ షోలో కూలడంతోనే.. ఇంత చర్చ. అసలు.. తేజస్ ఎలా కూలింది? విన్యాసాలు చేస్తుండగానే.. ఉన్నట్టుండి ఎలా నేలని ఢీకొట్టింది? ఇది.. పైలట్ తప్పిదమా? ఫైటర్‌ జెట్‌లో ఉన్న లోపమా? ఈ తేజస్ క్రాష్‌ గురించి.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ టెన్షన్ పడాల్సినంత అవసరముందా?

దుబాయ్ ఎయిర్‌ షోలో కూలిన తేజస్ ఫైటర్ జెట్

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన.. స్వదేశీ యుద్ధ విమానం తేజస్ దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోవడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో తేజస్ కూలిపోవడం ఇది రెండోసారి. దాంతో.. ఈ లైట్ కాంబాట్ ఫైటర్ జెట్ సామర్థ్యం, భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. దుబాయ్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పైలట్‌, వింగ్ కమాండర్ నమాంశ్ సయాల్ కూడా మృతిచెందినట్లు.. భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి దారితీసిన కారణాలను పూర్తి స్థాయి విచారణ తర్వాతే తెలుస్తాయని స్పష్టంం చేసింది. ఇందుకోసం.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని నియమించింది.

విన్యాసాలు చేస్తుండగా నేలని ఎలా ఢీకొట్టింది?

తేజస్ ఫైటర్ జెట్ ఏరియల్ డిస్‌ప్లేలో భాగంగా విన్యాసాలు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఓ అసాధ్యమైన స్టంట్ చేయడం, క్షణం పాటు నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. యుద్ధ విమానం వేగంగా నేలపైకి దూసుకొచ్చి.. నేలని తాకిన మరుక్షణమే భారీ పేలుడు సంభవించింది. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. చాలామంది నిపుణుల ప్రకారం.. తేజస్ యుద్ధ విమానం నెగటివ్ జీ-ఫోర్స్ టర్న్ స్టంట్ పూర్తి చేసి.. తిరిగి సాధారణ స్థితికి మళ్లించే క్రమంలో నియంత్రణ కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ స్టంట్ చేసేటప్పుడు.. పైలట్ కొన్ని క్షణాల పాటు తలకిందులుగా ఉంటాడు. ఆ సమయంలో.. అధిక జీ-ఫోర్స్ కారణంగా తలవైపు రక్త ప్రసరణ పెరిగి.. పైలట్ గందరగోళానికి గురవడం గానీ, తాత్కాలికంగా గురుత్వాకర్షణ వల్ల స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్లిష్టమైన విన్యాసం నుంచి విమానాన్ని సాధారణ స్థితికి మళ్లించే క్రమంలో.. ఎత్తు తక్కువగా ఉండటం, వేగం సరిపోకపోవడం వల్ల.. పైలట్ ఆలస్యంగా రియాక్ట్ అవడం గానీ, కంట్రోల్ తప్పడం గాని జరిగి ఉండొచ్చంటున్నారు. వింగ్ కమాండర్ నమాంశ్‌ సయాల్ అనుభవం కలిగిన పైలట్ అయినప్పటికీ.. విన్యాసం చేస్తున్న సమయంలో జరిగిన చిన్న పొరపాటు వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రమాదం పైలట్ తప్పిదమా?

విమానం కూలిపోవడానికి ముందు.. తేజస్ ఇంజన్ ఒక్కసారిగా పవర్ లాస్ అవడం, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్‌లో ఏదైనా టెక్నికల్ లోపం తలెత్తి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు.. దుబాయ్ ఎయిర్‌ షోలో పాల్గొన్న తేజస్ విమానం నుంచి ఆయిల్ లీక్ అవుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. అది సాధారణ డ్రైనింగ్ ప్రక్రియలో భాగంగా వచ్చే నీరేనని, టెక్నికల్ లోపం కాదని.. ఐఏఎఫ్ ఖండించింది. ఇది జరిగిన మరుసటి రోజే.. ప్రమాదం జరగడం మరింత అనుమానాలను పెంచింది. కానీ.. ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి.. బ్లాక్ బాక్స్ విశ్లేషణ జరిగే దాకా.. కచ్చితమైన కారణం ఏమిటన్నది తెలిసే అవకాశం లేదు.

భారతీయ రక్షణ పరిశ్రమకు ప్రతిష్ఠాత్మక తేజస్ ఫైటర్ జెట్

ఏదేమైనా.. తేజస్ ఫైటర్ జెట్.. భారతీయ రక్షణ పరిశ్రమకు ప్రతిష్ఠాత్మకమైనది. మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో ఎంతో కీలకమైనది. అలాంటి విమానం కూలిపోవడం అనేది.. పెద్ద చర్చకే దారితీసింది. కానీ.. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తేజస్ ప్రాజెక్ట్ 2001లో తొలిసారి గాల్లోకి ఎగిరినప్పటి నుంచి.. భారత వాయుసేనలో చేరిన తర్వాత కూడా దీనికి.. మంచి సేఫ్టీ రికార్డే ఉంది. గడిచిన 24 ఏళ్లలో.. నమోదైన రెండో ప్రమాదం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ ఎయిర్‌ఫోర్స్‌లోనైనా, ట్రైనింగ్, ఏరియల్ డిస్‌ప్లేల సమయంలో.. ఆధునిక యుద్ధ విమానాలు కూలిపోవడం అనేది సాధారణ విషయమే. ఎందుకంటే.. మిగ్-21, సుఖోయ్ లాంటి ఓల్డ్ జనరేషన్ జెట్స్‌తో పోలిస్తే.. తేజస్ సేఫ్టీ రికార్డ్ ఎంతో మెరుగ్గా ఉంది. అయితే.. ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో, విదేశీ కొనుగోలుదారుల సమక్షంలో ప్రమాదం జరగడమనేది.. తేజస్ ఎగుమతి అవకాశాలపై తాత్కాలికంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రమాదానికి గల సరైన కారణాన్ని గుర్తించి.. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఫైటర్‌ జెట్‌లో లోపమా?

ఇప్పుడు మ్యాటర్ మన తేజస్ ఫైటర్ జెట్ కూలడం గురించి కాదు. అదసలు.. పెద్ద విషయమే కాదు. ఎందుకంటే.. ఫైటర్ జెట్స్ కూలడం ఇదేం కొత్త కాదు. రఫేల్ కూడా ఎన్నోసార్లు కూలింది. ఎఫ్-16లు ఇప్పటిదాకా ఎన్ని కూలాయో లెక్కే లేదు. వాటితో పోలిస్తే.. తేజస్ చిన్నదే. ఏదేమైనా.. బగ్ ఈజ్ బగ్! అందులో లోపం ఎలాంటిదైనా.. దాన్ని సరిచేయాలి. ఎందుకంటే.. మిగ్-21 యుద్ధ విమానాల స్థానాన్ని భర్తీ చేసేందుకు తెచ్చిన తేజస్.. మరోసారి ఫెయిలవకుండా చూడాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. తేజస్ మళ్లీ కూలొద్దంటే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తేజస్‌కి సూపర్ సేఫ్టీ రికార్డ్

2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. 2001లో టెస్ట్ చేసిన తర్వాత.. 23 ఏళ్లకు రాజస్థాన్‌లో తొలిసారి ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో.. పైలట్ సేఫ్‌గా బయటపడ్డాడు. మళ్లీ ఇప్పుడు.. దుబాయ్ ఎయిర్‌ షోలో తేజస్ క్రాష్ అయింది. 24 ఏళ్లలో.. కేవలం రెండుసార్లు మాత్రమే తేజస్ కుప్పకూలింది. దీనికి.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మంచి సేఫ్టీ రికార్డ్ ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ LCA తేజస్.. తమిళనాడులోని సూలూరు స్క్వాడ్రన్‌కు చెందినది. 2016 నుంచి సర్వీసులో ఉంది. ఇటీవల కాలంలో మిగ్-21 విమానాలను తొలగించిన తరువాత తేజస్‌ను.. ఎయిర్‌ఫోర్స్ తమ తదుపరి ప్రధాన యుద్ధ విమానంగా భావిస్తోంది. తేజస్ విమానాన్ని వేగంగా దిశను మార్చుకునేలా.. డిజైన్ చేశారు. అందువల్ల.. దాని రూపకల్పన స్వతహాగా అస్థిరంగా ఉంటుంది. దీని కారణంగానే.. తీవ్రమైన నెగెటివ్ G లాంటి విన్యాసాల సమయంలో నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్‌ చేయడానికి.. అత్యాధునిక ఫ్లై-బై-వైర్ వ్యవస్థను దీంట్లో అమర్చారు.

తేజస్ మళ్లీ కూలొద్దంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ఐఏఎఫ్ ప్రస్తుతం.. తేజస్-ఎంకే1 లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ని ఉపయోగిస్తోంది. భవిష్యత్తులో రాబోయే.. మరింత అడ్వాన్స్‌డ్ తేజస్-ఎంకే1ఏ వెర్షన్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ ప్రమాదం.. భవిష్యత్తులో రాబోయే జెట్‌ల తయారీలో భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా ఉండేలా దృష్టిసారించేందుకు వీలు కల్పిస్తుంది. వాయుసేన దర్యాప్తులో.. ప్రమాదానికి గల అసలు కారణాలేంటో తేలాక.. లోపాలను సరిదిద్ది.. ఈ మేడిన్ ఇండియా ఫైటర్ జెట్‌పై.. మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడం అనేది పెద్ద సమస్య కాకపోయినా, దాని విశ్వసనీయతను, భద్రతను మెరుగుపరచడం అత్యవసరం. మిగ్-21 స్థానాన్ని భర్తీ చేసిన స్వదేశీ యుద్ధ విమానం కావడంతో.. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రపంచంలో ఏ ఫైటర్ జెట్‌కైనా ప్రమాదాలు సహజమే అయినప్పటికీ.. భవిష్యత్తులో తేజస్ మరోసారి ఫెయిల్యూర్ కాకుండా ఉండాలంటే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఇందుకోసం.. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్, సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్ తక్షణమే చేపట్టాలి. ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందా? డిజైన్ లోపాల వల్ల జరిగిందా? మెటీరియల్ ఫెయిల్యూరా? టెక్నికల్ లోపమా? అనే అంశాలపై దృష్టి పెట్టాలి. విమానంలో తరచుగా కనిపిస్తున్న సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా? అనే దానిపై లోతుగా రీసెర్చ్ చేయాలి.

సాంకేతిక లోపాలతో పాటు, పైలట్ శిక్షణ , ఆపరేటింగ్‌లకు ప్రత్యేక శిక్షణ

సాంకేతిక లోపాలతో పాటు, పైలట్ శిక్షణ, ఆపరేటింగ్ విధానంలోనూ మెరుగుదల కావాలి. ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు.. పైలట్లకు అడ్వాన్స్‌డ్ ఫ్లైట్ సిమ్యులేటర్లలో.. అత్యంత కఠినమైన ట్రైనింగ్ ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల్లో జెట్‌ని ఎలా విడిచిపెట్టాలి అనే దానిపైనా ప్రత్యేక శిక్షణ ఉండాలి. కాక్‌పిట్ డిజైన్, డిస్‌ప్లేలు పైలట్‌కు ఒత్తిడి సమయంలోనూ స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా ఉన్నాయో లేదో రివ్యూ చేయాలి. భవిష్యత్‌లో రాబోయే తేజస్ మార్క్-1ఏ, మార్క్-2 వెర్షన్లలో ఈ లోపాలు రిపీట్ కాకుండా చూడాలి. విమానం బిల్డ్ క్వాలిటీ, ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే భాగాల్లో మరింత పటిష్టత ఉండేలా చూడాలి. మెరుగైన కాంపోజిట్ మెటీరియల్స్‌ను ఉపయోగించాలి. ఇంజిన్, ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్ లాంటి క్లిష్టమైన భాగాల్లో.. ఒక సిస్టమ్ ఫెయిలైతే.. రెండో సిస్టమ్ వెంటనే పనిచేసేలా ఉండేలా.. డిజైన్‌ని మెరుగుపర్చాలి. ఫెయిలయ్యే అవకాశం ఉన్న భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కంటే.. దేశీయంగా మెరుగైన నాణ్యతతో అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి.

భారతీదేశ సాంకేతిక శక్తికి ప్రతీకగా తేజస్

తేజస్ అనేది.. కేవలం ఓ ఫైటర్ జెట్ కాదు. ఇది భారతదేశ సాంకేతిక శక్తికి ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఎఫ్-16, రఫేల్ లాంటి జెట్‌లు కూడా తమ సర్వీస్ హిస్టరీలో.. అనేక ప్రమాదాలను ఎదుర్కొన్నాయి. అందువల్ల.. దుబాయ్ ఎయిర్‌షోలో జరిగిన తేజస్ క్రాష్‌ని.. ఓ గుణపాఠంగా భావించి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కలిసి పనిచేయాలి. ప్రతి బగ్‌ని పరిష్కరించి, నాణ్యత, భద్రతపై రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలి. అప్పుడే.. తేజస్ ఫైటర్ జెట్.. మిగ్-21 స్థానాన్ని భర్తీ చేస్తుంది. భవిష్యత్తుల్లో.. భారత వాయుసేనకు.. వెన్నెముకగా నిలబడుతుంది.

Story by Anup, Big Tv 

 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×