ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు దేశ వ్యాప్త చర్చలో భాగమయ్యాయి. ఇక్కడి రాజకీయాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. తెలుగు రాజకీయాలంటే హాట్ హాట్ గా ఉంటాయనే భావన ఉంది. తెలంగాణలో మొన్నటిదాకా రాజకీయ వేడి రాజుకున్నది. అధికార, ప్రతిపక్షాల విమర్శలు, పరస్పర ఆరోపణలతో ఇక్కడి వాతావరణం వేడెక్కింది. ఇప్పుడు కరువు రాగం అందుకున్నది తాజాగా రేవంత్ సర్కార్.
పొదుపు చర్యలు చేపట్టాలంటున్నది. వచ్చే ఏడాది జూలై దాకా గడ్డు పరిస్థితులుంటాయని భయభ్రాంతులకు గురి చేసే పనిని నెత్తుకెత్తుకున్నది సర్కార్. వరి వేయొద్దంటు రైతాంగాన్ని అలర్ట్ చేస్తున్నది. తాగేందుకే గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి రావొచ్చని బాగానే ఊదరగొట్టి, బెదరగొడుతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలా పడ్డ చందంగానే మారింది తాజాగా సీఎం మాటలు విన్న తరువాత.
ఇదిలా ఉంటే.. ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలతో అట్టుడికిపోతోంది. ఫ్యాక్షన్ సినిమాల్లో సుమోలు గాలిలోకి లేచినట్టుగా.. కార్లను తగులబెట్టిన దృశ్యాలు దేశం మొత్తం చూసి నివ్వెరపోయింది. ఇది ఆంధ్రాలోనా? బీహార్‌లోనా? అనే రీతిలో ఉన్నాయా ఘటనలు. మున్సిపల్, లోకల్ బాడీ ఎన్నికలకే ఇంతలా కొట్టుకు చస్తే.. ఇక సాధారణ ఎన్నికల నాటికి ఏపీ రణరంగంగా మారనుందా? అనే అనుమానాలు వచ్చేలా తయారయ్యాయి పరిస్థితులు.
కూటమి నేతలు కయ్యానికి కాలుదువ్వే చర్యలు, తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా వైసీపీ నేతల పరస్పర దాడులతో ఏపీ రాజకీయాలు అట్టుడికిపోతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ఓ వైపు.. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మరో వైపు నిత్యం ప్రెస్‌మీట్లు పెట్టుకుంటూ ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారంటూ ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారు.
కూటమి సర్కార్ ఇజ్జతే పోయినట్టుగా తయారయ్యింది. అధికార పార్టీ దాష్టీకానికి ఇది నిదర్శనమని నిరూపించేందుకు వైఎస్‌ఆర్ సీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గుడ్డిగా వీరిని తిప్పికొట్టే వ్యూహాన్ని అమలు చేస్తూ పోతున్న టీడీపీ.. జగన్ వ్యూహంలో చిక్కుకుందనే చెప్పాలి. ఎట్లాగూ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ గెలిచేదీ లేదు.. గెలిచినా ఈ సీట్లన్నీ అధికార పక్షం వైపు పోకుండా ఆపడమూ తరం కాదు.
మరెందుకు ఇంత హంగామా? అంటే.. ఎంతైంతే అంత కూటమి సర్కార్‌ను బజారు గుంజాలనే వ్యూహం కావొచ్చు. దానిలో చిక్కుకుని విలవిలలాడుతోంది టీడీపీ. గతంలో చంద్రబాబు.. ఇంతలా తీవ్రమైన ప్రతిఘటనకు దిగేందుకు ఆలోచించేవాడు. ఇప్పుడు లోకేశ్ చేతికి పగ్గాలు రావడం కూడా హింసాత్మక ఘటనలకు ఆజ్యం పోసినట్టుగా తయారైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మాజీ మహిళా మంత్రిని తోసేసిన పోలీసులు.. లాఠీచార్జీలు, దాడులు, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడాలు.. కార్లు తగులబెట్టుకోవడాలు, తలలు పగుల గొట్టుకోవడాలు.. ఇవన్నీ కూటమి సర్కార్ శాంతిభద్రతల ఇష్యూను వేలెత్తి చూపేవే. ఓ వైపు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నానని చెప్పుకునే బాబుకు ఈ రాజకీయ పరిణామలు తలవంపులు తెచ్చిపెట్టేవిగానే ఉన్నాయని చెప్పాలి.
ఇక తెలంగాణలో రేవంత్ సర్కార్.. పొదుపు మంత్రం జపించే క్రమంలో ముందస్తు హెచ్చరికలు చేయడం.. సామాన్య జనాన్ని తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రే స్వయంగా ఇలాంటి మాటలు మాట్లాడటం మూలంగా బ్లాక్ మార్కెట్ దళారులు.. కృత్రిమ కొరత సృష్టించి నిత్యావసరాలను అమంతం పెంచేస్తారనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం సన్నబియ్యం ధరలు ఇలాగే ఆకాశానికంటాయి.
పొదుపు చర్యలు పాటించండి.. ఏం చేయలేం.. ఇంతకు మించి! అన్నట్టుగా చేతులెత్తేసేలా సర్కార్ కామెంట్స్ ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని కరువు భయం ప్రస్తుతం తెలంగాణను వెంటాడుతోంది.