Iran Tensions: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభం కానుందా? ఈ వీకెండ్‌లోనే విధ్వంసం తప్పదా? ఇరాన్‌పై దాడికి అమెరికా ప్రిపరేషన్స్ పూర్తి చేసిందా?.. ఇలాంటి ప్రశ్నలన్నంటికి ఇప్పుడు అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా ఉన్నాయి అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులు. ఇలాంటి టైమ్‌లో అమెరికా వేస్తున్న అడుగులు చూస్తుంటే మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ గన్ గర్జనలు ఖాయమనే తెలుస్తోంది. 2003లో ఇరాక్‌పై యుద్ధం చేసింది అమెరికా. ఆ తర్వాత మళ్లీ అప్పటి స్థాయిలో ఎప్పుడూ మోహరింపులు చేయలేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఆ యుద్ధం కాలం నాటి పరిస్థితి మళ్లీ కనిపిస్తోంది.
F-35, F-22, F-15, F-16 ఫైటర్ జెట్స్, కమాండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల్లోకి చేరుకున్నాయి. లార్జ్ స్కేల్ ఎయిర్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కావాల్సిన సరంజామా మొత్తం సిద్ధం చేసింది అమెరికా. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను మోహరించింది అమెరికా. అంతేకాదు.. మిడిల్ ఈస్ట్ ఏరియాలోని సముద్ర ప్రాంతాల్లో అత్యంత ఆధునికమైన, శక్తివంతమైన 13 యుద్ధ నౌకలను మోహరించింది యూఎస్ ఆర్మీ. యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్, 9 డిస్ట్రాయర్లను మోహరించింది. ఒకవేళ ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగిస్తే.. అడ్డుకోవడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అదే సమయంలో యూఎస్ ఆపరేషన్స్‌కు సహాయంగా ఉంటాయి. అంతేకాదు.. యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, మరో నాలుగు డిస్ట్రాయర్లు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రీజియన్‌కు చేరుకున్నాయి.
గ్రీస్‌లో కమాండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, జోర్డాన్‌లో ఫైటర్, అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సౌదీ అరేబియాలో కమ్యూనికేషన్స్, మల్టీరోల్, ఎర్లీ వార్నింగ్, కమ్యూనికేషన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, బహ్రెయిన్‌లో కమాండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్‌లు.. యూఏఈలో.. హై అల్టీట్యూడ్, లాంగ్ రేంజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను మోహరించింది యూఎస్ ఆర్మీ. ఇక రెడ్ సీలో ఒక డిస్ట్రాయర్, పర్షియన్ గల్ఫ్‌లో రెండు కంబాట్ నేవీ షిప్స్.. అరేబియన్ సీలో ఏకంగా ఒక స్ట్రైక్ గ్రూప్‌ను మోహరించింది. స్ట్రైక్ గ్రూప్ అంటే ఒక అనేక ఫైటర్ జెట్స్‌తో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, ఐదు డిస్ట్రాయర్‌లు అని అర్థం. ఇక హర్మూజ్ జలసంధి వద్ద మరో మూడు డిస్ట్రాయర్లు. ఇవి కాకుండా.. మరో స్ట్రైక్ ఇప్పుడు ఇరాన్‌వైపు వెళుతుంది.
ఈ వీకెండ్‌లోనే ఇరాన్‌పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే దాడి చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం అమెరికా సుప్రీం కమాండర్ అయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఇప్పటికే అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లతో పలుసార్లు కీలక భేటీలు నిర్వహించారు ట్రంప్. ఈ సమయంలో ట్రంప్ ముందు అనేక మిలటరీ ఆప్షన్స్ ఉంచినట్టు తెలుస్తోంది. ట్రంప్ ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాడులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు ఇరాన్ మాత్రం చేతల సంగతి ఏమో కానీ.. మాటల్లో మాత్రం అస్సలు తగ్గడం లేదు. అమెరికా మోహరింపులను లైట్ తీసుకుంటుంది. అమెరికా ఎలాంటి దాడులు చేసినా ఎదుర్కోంటామని తేల్చి చెబుతోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో నేవీ డ్రిల్స్‌ను కూడా నిర్వహించింది. అయితే రష్యాతో కలిసి ఈ సైనిక విన్యాసాలను నిర్వహించింది ఇరాన్. ప్రస్తుతం దేనికైనా రెడీ అన్నట్టుగా ఉంది ఇరాన్ తీరు చూస్తుంటే. అయితే అమెరికాను తాము ఢీకొవాలని కోరుకోవడం లేదని.. చర్చలకు సిద్ధమని చెబుతూనే ఉంది ఇరాన్.
ఓ వైపు ఇలాంటి చర్యలు చేపడుతూనే ఇరాన్ మరో పని చేస్తోంది. తన అణుస్థావరాలను రక్షించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఒకవేళ యూఎస్ దాడులకు పాల్పడినా కానీ.. వాటిని తట్టుకుని నిలబడేలా అణుస్థావరాలపై గట్టి బంకర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. గత రెండు వారాల్లో ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్‌లోని న్యూ తలేఘాన్-2 కేంద్రంపై కాంక్రీటుతో ఓ లేయర్‌ను ఏర్పాటు చేసినట్టు శాటిలైట్ ఇమేజేస్‌తో గుర్తించారు. ఈ తలేఘాన్-2 టెహ్రాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. ఫిబ్రవరి 13 నాటి శాటిలైట్ చిత్రాల ప్రకారం.. అణుస్థావరం మొత్తాన్ని పూర్తిగా కాంక్రీట్‌తో కప్పేశారు. ఇప్పుడు దానిపై మట్టి పోస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తి బంకర్‌గా మారిపోతుందని, ఎయిర్‌స్ట్రైక్స్ నుంచి దీనికి రక్షణ లభించనుంది.
అంతేకాదు.. కోలాంగ్- గాజ్‌లా పర్వతం కింద సొరంగ మార్గాలను కూడా తవ్వింది ఇరాన్. ఈ ప్రాంతంలో కొన్ని వాహనాల కదలికలను గుర్తించారు. ఎస్ఫహాన్ అణుకేంద్రం వద్ద కూడా రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తేలింది. సో.. పరిస్థితి చూస్తుంటే యూఎస్ దాడి చేస్తుందనే నమ్ముతుంది ఇరాన్ కూడా. అందుకే తన జాగ్రత్తలో తాను ఉంది.
మరి నిజంగానే అమెరికా దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఇరాక్‌లాగానే ఇరాన్ పరిస్థితి కూడా మారుతుందా? లేక అమెరికాకే షాక్ తగులుతుందా? ఇంతకీ ఇరాన్ ప్లానేంటి? ఇరాన్‌పై దాడి చేస్తే రష్యాతో పాటు ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి?
నిజానికి ఇరాన్‌పై అమెరికా దాడి చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇరాన్‌పై పూర్తి స్థాయిలో దాడి చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకున్నది. గతంలో ఇరాక్, అఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసి హస్తగతం చేసుకున్న అంత ఈజీగా అయితే ఇప్పుడు జరగదు. అంతేకాదు గతం తాలుకూ మాయని మచ్చలు అనేకం ఉన్నాయి. ఇరాక్‌ను అమెరికా చేజిక్కించుకున్న తర్వాత.. ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రశాంతత లేకుండా పోయింది. అంతేకాదు ఇరాన్ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ వ్యవస్థ కూడా అమెరికాకు కొన్ని సవాళ్లు విసురుతుంది.
ప్రస్తుతం ఇరాన్ వద్ద అత్యాధుని ఆయుధ వ్యవస్థ ఉంది. ఇది పూర్తిగా అమెరికాను అడ్డుకోలేకపోయినా… కొన్ని సవాళ్లు విసరక మానదు. ఈ విషయం ఇప్పటికే ప్రూవ్ అయ్యింది. రీసెంట్‌గా ఇజ్రాయెల్‌పై చేసిన దాడులను.. అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థలు కూడా అడ్డుకోలేకపోయాయి. హైపర్‌సోనిక్ మిసైల్స్ ఇజ్రాయెల్‌కు భారీగానే నష్టం చేకూర్చాయి. అందుకే అమెరికా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ పూర్తిగా ఓడినా.. అమెరికా కాస్త దెబ్బతిన్నా రెండింటి ఇంపాక్ట్ ఒకటే.
దీనికి తోడు ఇరాన్ భౌగోళిక పరిస్థితులు కూడా అమెరికాకు అంత అనుకూలంగా ఉండవు. ఎందుకంటే చాలా భాగం కొండలు, పర్వతాలే ఉంటాయి. మాములుగా దక్షిణాన ఉండే జాగ్రోస్ రేంజ్, ఉత్తరాన అల్ర్బోజ్ పర్వతాలు ఇరాన్‌కు సహజ సిద్ధ రక్షణ కవచాలుగా ఉంటాయి. ఇది అమెరికా ఎయిర్, గ్రౌండ్ ఆపరేషన్స్‌కు మొదటి అడ్డంకి. ఇక్కడ దాడులు చేయాలంటే అమెరికన్ ఆర్మీకి లాజిస్టిక్ సమస్యలు తప్పవు. అంతేకాదు అమెరికన్ ఆర్మీ కాన్వాయ్‌లు ఇరాన్‌లోని ఇరుకు దారుల్లో ఈజీగా టార్గెట్ అయ్యే చాన్స్ ఉంటుంది. ఇరాన్ ఫోర్సెస్ గెరిలా వార్‌ఫేర్‌కు సిద్ధమైతే అమెరికా తన సైనికులను భారీగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
ఇరాన్ రక్షణ దళం అంటే కేవలం ఆ దేశ ఆర్మీ మాత్రమే కాదు. హెజ్బుల్లా, హౌతీలు, పాపులర్ మొబలైజేషన్ ఫోర్సెస్ కూడా ఇరాన్ కోసమే పనిచేస్తాయి. అంతేకాదు సిరియా, ఇరాక్‌లోని అమెరికన్ ఎయిర్ బేస్‌లపై ఇప్పటి వరకు 55 సార్లు దాడులు జరిగాయి. ఆ దాడులు జరిపింది ఈ గ్రూప్‌లకు చెందిన వారే. అంతేకాదు.. రెడ్‌సీపై పూర్తి పట్టును సాధించారు హౌతీలు. ఇరాన్‌పై దాడులు చేస్తే.. ముఖ్యంగా టార్గెట్ అయ్యేది రెడీ సీ నుంచి వెళ్లే అమెరికన్ ఆయిల్ ట్యాంకర్లు. అదే జరిగితే అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత తప్పదనే చెప్పాలి.
ఇదే కాకుండా.. ఇరాన్ అనేది ఒక దేశం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇరాన్‌ను గుర్తించాయి. అనేక దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది ఇరాన్. సో.. గతంలో ఓ ఫెయిల్డ్ స్టేట్‌తో డీల్ చేసినట్టు ఇరాన్‌తో డీల్ చేస్తామంటే కుదరదు. అంతేకాదు రష్యా, చైనాలకు ఇరాన్ చాలా కావాల్సిన దేశం. అఫ్ఘాన్, ఇరాక్ అమెరికా చేతికి చిక్కడానికి అంతర్గత కుమ్ములాటలు కూడా ఒక కారణం. ఇరాన్‌లో అలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి.
మరో విషయం ఏంటంటే.. అమెరికా ఇరాక్, అఫ్ఘాన్‌లో సైనిక జోక్యం చేసుకొని అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా జోక్యం చేసుకుంటే అదే జరుగుతుందనే చర్చ ఉంది. దీనికి తోడు అంతర్జాతీయంగా పరువు పోవడం అదనం. అయితే ఇక అమెరికా మైండ్ గేమ్ ఆడుతుందని క్లియర్ కట్‌గా అర్థమవుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు అంత ఆశాజనకంగా జరగడం లేదు. అందుకే ఇలాంటి మోహరింపులతో ఇరాన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే రేపో, మాపో దాడులు అన్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తున్నది. దీనికి తగ్గట్టుగానే వెస్ట్రన్ మీడియాలో కథనాలు పబ్లిష్ అవుతున్నాయి.
కానీ ఇరాన్ మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకవేళ చర్చలు విఫలమై అమెరికా దాడులు చేస్తే ఏం చేయాలనే దానిపై ఫోకస్ చేస్తోంది. కథలో కొత్త ట్విస్ట్ ఏంటంటే.. ఇరాన్‌కు మేమున్నామని రష్యా చెప్పకనే చెప్పడం. ఇరాన్‌తో కలిసి రష్యన్ నేవీ ఇప్పుడు సైనిక విన్యాసాలు చేపడుతోంది. సీ ఆఫ్ ఒమన్‌లో ఈ సైనిక విన్యాసాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఈ రీజియన్‌లో జరిగే ఏదైనా దాడిని ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని సిగ్నల్ ఇస్తుంది రష్యా. అమెరికా కనుక రష్యా నేవీ షిప్స్‌పై దాడులు చేస్తే.. కథ మొత్తం మారినట్టే.
Story by: Anup, Big Tv