ఆయన తమదే రాజ్యం అని కలలు కంటున్నాడు. ఇక సారే రావాలంటున్నారని జనాలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారని రోజు చెవి కోసిన మేక లెక్కనే అరుస్తున్నాడు.
రేవంత్‌ను ఎందుకు గెలిపించామా? అని ప్రజలు పశ్చాత్తాపడుతున్నారని తనే ప్రకటించేసుకున్నాడు. కేసీఆర్ పాలన బాగుండెనని యాది చేసకుంటున్నాడంటున్నాడు. ఇక తిరుగుబాటు కూడా తప్పదని జోస్యం చెబుతున్నాడు. మొత్తంగా రాష్ట్రంలో త్రిపుల్ ఆర్.. అంటే ఆర్ఆర్ఆర్.. ఉద్యమం వస్తుందంట. రీకాల్, రిగ్రెట్, రీవోల్ట్ ఉద్యమమట.. ఇంకా ఎన్నికలకు చాలా రోజులే సమయం ఉన్నా.. ఇప్పట్నుంచే కేటీఆర్ పగటి కలలు కంటున్నాడు.
ఆశావహ దృక్పథం మంచిదే. కానీ పదే పదే జనాల మాట కూడా తనే చెప్పేస్తానంటే.. వారేమనుంటున్నారో నాకు తెలుసు.. అనే విధంగా ఈయన ఇప్పట్నుంచే ప్రజా తీర్పు ఇచ్చేస్తా ఉంటే… ఇదే జరుగుతోంది ప్రస్తుంది. ఇక్కడ కేటీఆర్ ఇవన్నీ లెక్కలు వేసుకుంటూ.. అధికార పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ కూర్చున్నాడా..? అక్కడ ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లా నియోజకవర్గం ప్రజలు మాత్రం .. ఒక్కసారి కూడా ఇటువైపు ముఖం చూపని ఆ ఎమ్మెల్యే మాకొద్దంటున్నారు.
వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కవిత మొన్న అక్కడికి వెళ్లి.. ఆ గడ్డ మీదనుంచే పొట్టు పొట్టు తిట్టింది అన్నను. అదే కేటీఆర్‌ను. వీకెండ్ ఎమ్మెల్యే ఆయన అని ఘాటుగా విమర్శించిందామె. షాడో ఎమ్మెల్యేగా పదేండ్లు నడిపించుకున్నావ్.. పనులు ఎందుకు చేసి పెట్టలేదని కూడా నిలదీసింది.
అంటే సారే సీఎం సారే సీఎం.. అంటున్నాడంటే.. తండ్రి చాటు సీఎం క్యాండిడేట్ తనే అని కూడా చెప్పుకుంటున్నాడన్నమాట కేటీఆర్. కేసీఆర్ పేరు చెబితేనైనా కాసిన్ని ఓట్లు పడి గెలిచే చాన్సు ఉంది కాబట్టి.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్టు చేస్తున్నాడు.
ప్రజల మెదళ్లలోకి ఇలా ఈ నినాదం వదలుతూ ఓ మైండ్ గేమ్‌ను కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాడన్నమాట. కానీ అక్కడ తనే ఓడిపోయేటట్టున్నాడు. మొన్ననే చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన గెలిచి బతికిపోయాడు. ఇక ఇప్పుడు అది కూడా కష్టమే అయేటట్టున్నది.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా.. సీఎంగా కేసీఆర్.. కేసీయారే సీఎం.. ఇక తథ్యం.. జనాలు అదే కోరుకుంటున్నారు.. ఇదే జరగబోతుంది…!అని నిత్యం ఓ గ్రామఫోన్ రికార్డు వినిపిస్తున్న కేటీఆర్.. తన కిందనే నీళ్లు వచ్చినా తెలియడం లేదు.
కొంపదీసి.. తన యుద్దక్షేత్రం ఏమైనా మారుస్తాడా? ఏందీ.. ఇక సిరిసిల్లాలో ఇజ్జత్ పోయింది.. ఈజీగా గెలిచే ఓ కొత్త చోటును వెతుక్కుంటా…! అనే ఆలోచనలోనైతే లేడు కదా? అని కూడా అనుకుంటున్నారట గులాబీ పార్టీ శ్రేణులు..