Credit Card Usage: ప్రస్తుతం క్రెడిట్ కార్డులతో అనేక ప్రయోజనాలున్నాయి. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే రివార్డు పాయింట్లు, ఆఫర్లు ఇలా ఖర్చులో కూడా ఆదా చేసుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డును చాలా జాగ్రత్తగా వాడుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే అది మీ సిబిల్ స్కోరును ఎఫెక్ట్ చేస్తుంది. లోన్ అర్హతను బ్యాంకులు సిబిల్ స్కోర్ తోనే అంచనా వేస్తాయి. అసలు క్రెడిట్ కార్డు, క్రెడిట్ స్కోర్ కు మధ్య సంబంధం ఏంటో వివరంగా తెలుసుకుందాం.
క్రెడిట్ స్కోర్ క్రెడిట్ హిస్టరీకి ప్రతిబింబించే ఒక సంఖ్య. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మీ రుణ అర్హతను క్రెడిట్ స్కోర్ బట్టి అంచనా వేస్తాయి. ఇది మీ లోన్ రీపేమెంట్ విధానాన్ని సూచిస్తుంది. ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే.. తక్కువ వడ్డీ రేట్లు, మెరుగైన లోన్ నిబంధనలతో రుణాలు పొందవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లును గడువులోగా చెల్లిస్తుంటే.. మీ క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరును ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో ఇదొకటి. లేట్ పేమెంట్ లేదా డిఫాల్ట్‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీస్తాయి. ఇలాంటి మిస్టేక్స్ తో మీ క్రెడిట్ స్కోరు పడిపోయే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం కంటే తక్కువగా బిల్లు చెల్లిస్తుంటే, అది మీ సిబిల్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే.. కనీసం 6-8 నెలల పాటు రెగ్యులర్ గా కార్డు బిల్లులు, ఈఎంఐల చెల్లించాలి. దీంతో క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవచ్చు.
క్రెడిట్ కార్డు యుటిలైజేషన్ రేషియో(CUR)… క్రెడిట్ కార్డు వినియోగాన్ని తెలియజేస్తుంది. మీ సీయూఆర్ 30% కంటే తక్కువగా ఉండేటట్లుగా చూసుకోవాలి. క్రెడిట్ కార్డును తక్కువగా వాడకం.. మీ ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుంది. దీంతో క్రెడిట్ స్కోరుపై పాజిటివ్ ఎఫెక్ట్ ను చూపుతుంది. క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడితే అది మీ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డుపై గరిష్ఠ పరిమితిని అందిస్తుంటాయి. కాబట్టి, మ్యాగ్జిమమ్ లిమిట్ ను మించి క్రెడిట్ కార్డును ఉపయోగించడం క్రెడిట్ స్కోరు తగ్గడానికి ఒక కారణం. మీ క్రెడిట్ కార్డును గరిష్ఠ పరిమితికి మించి ఎప్పుడూ ఉపయోగించవద్దు. మీరు రెండు క్రెడిట్ కార్డులు కలిగి ఉంటే.. లిమిట్ ను పెంచుకుని.. క్రెడిట్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసిన ప్రతిసారి, మీ క్రెడిట్ రిపోర్టుపై హార్డ్ ఎంక్వైరీ చేస్తారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువగా సార్లు మీ క్రెడిట్ స్కోర్ ను యాక్సెస్ చేస్తే వాటిని బ్యాంకులు ప్రతికూలంగా భావిస్తాయి. అవి మీ క్రెడిట్ స్కోర్‌ను కొంతవరకు తగ్గిస్తాయి. తరచూ క్రెడిట్ స్కోర్ ను యాక్సెస్ చేస్తే.. బ్యాంకులు మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భావిస్తాయి. దీనివల్ల కూడా క్రెడిట్ స్కోరు ఎఫెక్ట్ అవుతుంది. తక్కువ సమయంలో అనేక సార్లు క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేయవద్దు. ఒకవేళ అప్లై చేస్తే మీ అవసరాలకు సరిపోయే కార్డును సెలెక్ట్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావాన్ని తగ్గించడానికి, క్రెడిట్ కార్డు దరఖాస్తుల మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి.