Oracle Layoffs: కారణాలు ఏమైనా కావచ్చు.. ప్రపంచంలోని టెక్ కంపెనీలు ఏదో విధంగా ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతున్నాయనే ప్రచారం ఓ వైపు.. ఏఐ కోసం నిధులు సమకూర్చుకోవడానికి కొన్ని కంపెనీలు సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ జాబితాలోకి ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒరాకిల్ కూడా చేరిపోయింది.
టెక్ రంగంలో మరో కుదుపు.. ఈసారి ఒరాకిల్ వంతు
అంతర్జాతీయ పరిణామాలు.. ట్రంప్ పాలసీలను క్షుణ్నంగా గమనిస్తున్నాయి టెక్ కంపెనీలు. ఈ క్రమంలో సిబ్బందిని తగ్గించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఏఐ పేరిట చాలామంది ఉద్యోగాలకు దూరమయ్యారు. తాజాగా మలి విడత లేఆఫ్స్ పై దృష్టి సారించాయి టెక్ కంపెనీలు. ఒరాకిల్ కంపెనీ AI డేటా సెంటర్లకు నిధులు సమకూర్చడానికి 30 వేల మందిని తగ్గించుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు ఓ నివేదిక బయటకు వచ్చింది.
ఈ విషయం తెలియగానే ఆ కంపెనీ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ఎవరిపై వేటు పడుతుందోనన్న టెక్షన్ వారిని అనుక్షణం వెంటాడుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఈ కంపెనీ నుంచి లేఆఫ్స్ సంకేతాలు రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం 30 వేలమంది ఉద్యోగులపై వేటు వేయాలని కంపెనీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏఐ డేటా ఎఫెక్ట్, 30 వేల మంది తొలగింపు!
తద్వారా నిధులను ఆదా చేసి డేటా సెంటర్ల నిర్మాణానికి ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తోందట. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ పరిశోధనా నివేదికను ఉటంకిస్తూ సీఐఓ అనే సంస్థ ఈ విషయాలను బయట పెట్టింది. ఒరాకిల్ తన ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం సుమారు 156 బిలియన్ డాలర్లు అవసరమని అందులోని కీలకమైన పాయింట్.
భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు, బ్యాంకులు సందేహించడమే కారణంగా తెలుస్తోంది. కొన్నివారాలుగా అమెరికాలని పలు బ్యాంకులు ఒరాకిల్‌కు రుణాలు ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ కోసం డేటా సెంటర్లను నిర్మించే బాధ్యత ఒరాకిల్ తీసుకుంది, కానీ నిధుల సమస్య వల్ల ఆ ప్రాజెక్టులపై ప్రభావం చూపుతోందట.
ALSO READ: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం ఎంతంటే?
భారీ లేఆఫ్స్ ద్వారా ఒరాకిల్ దాదాపుగా 8 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఫ్రీ క్యాష్ ఫ్లో పొందవచ్చని ఓ అంచనా. ఈ నేపథ్యంలో ఒరాకిల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ లెక్కన 20 నుంచి 30 వేల మందిఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారంపై ఒరాకిల్ కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ నిజమైతే ఆ కంపెనీ చరిత్రలో ఇది అతిపెద్ద లేఆఫ్.
రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా గతేడాది చివరిలో 10 వేల మందిని తొలగించింది ఒరాకిల్. ఆ సంస్థకు చెందిన ఆఫీసులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్‌కతా వంటి నగరాల్లో ఉన్నాయి. వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏడాది ఆరంభంలో లేఆఫ్స్ వార్తలు రావడంతో టెక్కీల్లో టెన్షన్ మొదలైంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని సంస్థలు లేఆఫ్స్ ప్రకటిస్తాయోనని చర్చించుకుంటున్నారు.