Child Financial Plan: తల్లిదండ్రులు అయ్యేందుకు డబ్బులు అవసరం లేదు కానీ.. ఆ బాధ్యతను నిలబెట్టుకోవాలంటే డబ్బులు కావాలి. తల్లిదండ్రులు కావడం అనేది జీవితంలో అద్భుతం. కానీ అప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్, ఆర్థిక ప్రణాళిక మారిపోతాయి. ఉద్యోగం చేస్తున్న మహిళలైతే కెరీర్ కు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంటి ఖర్చులు, డెలివరీ ఖర్చులు, పిల్లల ఆరోగ్యం, చదువులకు ఇలా ఖర్చులన్నీ భారీగా పెరుగుతాయి. అందుకే ఈ ఖర్చులను ఎదుర్కొనేందుకు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో పెట్టుబడికి ఎలాంటి రాజీపడకూడదు. 6-12 నెలలకు సరిపడా నెలవారీ ఇంటి ఖర్చులు ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు, మీ నెలవారీ ఖర్చులు రూ.50,000 అయితే రూ.3 – 6 లక్షల ఎమర్జెన్సీ కుషన్ సిద్ధం చేసుకోవాలి. రూ.75,000 అయితే రూ.4.5 – 9 లక్షలు, రూ.1,00,000 అయితే రూ.6 – 12 లక్షలు ఎమర్జెన్సీ కుషన్ ఫండ్ గా పెట్టుకోవాలి. ఈ సేవింగ్స్ కు అదనంగా డెలివరీ ఖర్చులు యాడ్ చేయండి. డెలివరీ, అనుకోని సమస్యలకు రూ.2-3 లక్షలు అంచనా వేసుకోండి. ఈ ఖర్చులకు సిద్ధం అవ్వాలంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్, హై ఈల్డ్ సేవింగ్ స్కీమ్స్, స్వీప్ FD లలో ఇన్వెస్ట్ చేయాలి.
పెట్టుబడి కన్నా ముందు ఇన్సూరెన్స్ చేసుకోవాలి. లైఫ్, హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఈ వార్షిక ఆదాయాన్ని 20 ఏళ్లకు లెక్కగట్టి అంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అలాగే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇందులో మెటర్నిటీ కవర్ అయ్యే ముందు నుంచీ ప్లాన్ చేసుకోండి.
పిల్లలు పుట్టక ముందు నుంచే వారి విద్య ఖర్చులకు SIP ప్లాన్ చేయండి. ఉదాహరణకు మీకు 18 సంవత్సరాలలో రూ.1 కోటి కార్పస్ కావాలనుకుందాం. 12% రాబడి అంచనా వేసుకుంటే నెలకు రూ.16 నుంచి 20 వేలు పెట్టుబడి పెట్టాలి. ఆలస్యంగా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభిస్తే నెలకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. అందుకే ముందుగానే నెలకు రూ.3 నుంచి 10 వేల మధ్య సిప్ స్టార్ చేసి, క్రమంగా SIP ను పెంచుకోవచ్చు.
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 15–20 ఏళ్లు అయితే ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, లార్జ్ + మిడ్‌క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ గోల్స్ (0-3 సంవత్సరాలు) అయితే లిక్విడ్ ఫండ్స్, సార్ట్ డ్యూరేషన్ డెబ్ట్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి.
కొన్ని ప్రభుత్వ పథకాలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఆడపిల్లలకు అయితే సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడి పెట్టొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో పెట్టుబడులకు పన్ను రహిత ప్రయోజనాలు, ఆకర్షణీయ రిటర్న్స్ ఉన్నాయి.
Also Read:ఎమర్జెన్సీ ఫండ్ కోసం.. 10-5-3 రూల్ తో ఇన్వెస్ట్మెంట్ ఇలా?
ఒకవేళ మీ దగ్గర ప్రస్తుతం రూ.10 -15 లక్షల ఫండ్స్ లేకపోతే ఏం చేయాలి?. అప్పుడు రూ.5 – 10 వేలతో ఎడ్యుకేషన్ SIP ప్రారంభించండి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ ను సిద్ధం చేసుకోండి. లగ్జరీ ఖర్చులు, లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోండి. పేరెంట్‌హుడ్ అంటే 20 ఏళ్ల కమిట్మెంట్. అందుకు తగిన విధంగా ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తు్న్నారు.