మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కలవరపెడుతోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం సామాన్యులపై పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. దేశీయంగా వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఎల్‌పీజీ సరఫరాపై కీలక ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
గృహ వినియోగదారులకే తొలి ప్రాధాన్యత
ప్రస్తుత సంక్షోభ సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా వంట గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్యత క్రమంలో కేవలం గృహ వినియోగదారులకే సరఫరా చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) సంస్థలు ఈ మేరకు తమ సరఫరా విధానాన్ని మార్చుకోవాలని స్పష్టం చేసింది. గృహ అవసరాలకు డిమాండ్‌కు తగ్గట్టుగా స్టాక్ అందుబాటులో ఉంచాలని సూచించింది.
వాణిజ్య రంగాలపై తాత్కాలిక పరిమితులు..
గృహ వినియోగానికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసే క్రమంలో వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు సరఫరా అయ్యే గ్యాస్‌పై ప్రభుత్వం తాత్కాలికంగా కోత విధించింది. పెట్రో కెమికల్ యూనిట్లకు వెళ్లే ఎల్‌పీజీ సరఫరాను కూడా పరిమితం చేయాలని నిర్ణయించింది. భారీ పరిశ్రమల కంటే సామాన్య ప్రజల అవసరాలే ముఖ్యమని భావించిన కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింటే దేశంలో బ్లాక్ మార్కెటింగ్ పెరిగే అవకాశం ఉండటంతో ముందే అప్రమత్తమైంది.
ముందస్తు చర్యలతో ఊరట..
సాధారణంగా పండుగల సమయంలో లేదా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగినప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరత వేధిస్తుంటుంది. అయితే ఇప్పుడు మిడిల్ ఈ స్ట్ సంక్షోభం కారణంగా దిగుమతులకు ఆటంకం కలిగే ప్రమాదం పొంచి ఉంది. అటువంటి పరిస్థితుల్లో గృహ వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. ఆయిల్ కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలను జాగ్రత్తగా నిర్వహించాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వెళ్లాయి. ఈ పరిమితులు తాత్కాలికమే అయినప్పటికీ పరిస్థితులు చక్కబడే వరకు ఇవే నిబంధనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
ALSO READ: UPI Hide Number: యుపిఐ చెల్లింపుల సమయంలో మీ నెంబర్ కనిపిస్తోందా? బ్లాక్ చేయడానికి ఇలా చేయండి