Paytm Payment Bank Ban: పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాకిచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేసింది. ఈ పేమెంట్స్ బ్యాంకు తక్షణమే తన కార్యకలాపాలు నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. బ్యాంక్‌ను మూసివేసే ప్రక్రియను పూర్తి చేయడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వద్ద తగినంత నిధులు ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను మూసివేయడానికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాల్లో చివరిది లైసెన్స్ రద్దు. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్లు స్వీకరించడాన్ని ఆర్బీఐ ఇప్పటికే నిషేధించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏప్రిల్ 24, 2026 నాటి ఉత్తర్వుల మేరకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (BR యాక్ట్) లోని సెక్షన్ 22(4) కింద పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు జారీ చేసిన బ్యాంకింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949లోని సెక్షన్ 5(బి) ప్రకారం బ్యాంకింగ్ లావాదేవీలు గానీ లేదా సెక్షన్ 6 కింద పేర్కొన్న ఏదైనా అదనపు వ్యాపారాన్ని గానీ చేయకుండా నిషేధించింది. ఆర్‌బీఐ ఈ బ్యాంకును మూసివేయడానికి హైకోర్టులో దరఖాస్తు చేస్తుంది.
ఒకప్పుడు చైనాకు చెందిన యాంట్ గ్రూప్, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌లను పెట్టుబడిదారులుగా కలిగి ఉన్న వన్ 97 కమ్యూనికేషన్స్ మద్దతుతో.. పేటీఎం ఆగస్టు 2015లో పేమెంట్స్ బ్యాంకింగ్ లైసెన్సును పొందింది. ఈ లైసెన్సు ప్రకారం పేటీఎం చిన్న మొత్తంలో డిపాజిట్లు స్వీకరించడానికి కానీ లోన్లు ఇవ్వడానికి గానీ అనుమతి లేదు. కానీ జనవరి 2024లో కస్టమర్ డ్యూ డిలిజెన్స్, నిధుల వినియోగం, సాంకేతిక మౌలిక సదుపాయాలతో సహా పలు నిబంధనలను ఉల్లంఘించిన కారణంతో కొత్త డిపాజిట్లను స్వీకరించడంపై అప్పట్లోనే ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై 2022లో ఆర్బీఐ చర్యలు ప్రారంభించింది. ఆర్బీఐ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంతో 2024లో ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. పేమెంట్స్ బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు పలు కారణాలతో లైసెన్సును రద్దు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ సంస్థ యాజమాన్య తీరు డిపాజిటర్లకు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ బ్యాంకు కార్యకలాపాలు కొనసాగించడానికి అనుమతిస్తే ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సు షరతులను పాటించడంలో విఫలమైందని రిజర్వ్ బ్యాంకు స్పష్టం చేసింది.
Also Read: పేటీఎం కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే గోల్డ్ కాయిన్ మీదే, భలే అవకాశం