Health Investments: చాలా మంది ఖరీదైన కార్లు, బ్రాండెడ్ బట్టలు, గ్యాడ్జెట్లపై డబ్బును ఖర్చు చేస్తారు. కానీ.. ఆరోగ్యానికి సంబంధించిన విషయానికి వచ్చేసరికి పొదుపు మంత్రం పాటిస్తారు. నిజానికి, అనారోగ్యం పాలైన తర్వాత లక్షల రూపాయలు హాస్పిటల్ బిల్లులు కట్టడం కంటే, ముందే మన శరీరాన్ని, మనస్సును జాగ్రత్తగా చూసుకోవడం అత్యంత తెలివైన పని. సరైన ఆహారం, నాణ్యమైన నిద్ర, క్రమబద్ధమైన వ్యాయామంపై ఖర్చు చేయడం వల్ల మన జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మన ఆరోగ్యాన్ని కాపాడే ఆ 10 విలువైన పెట్టుబడులు ఏమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.
1. పోషకవిలువలున్న సేంద్రీయ ఆహారం:
మనం తినే ఆహారమే మన శరీరానికి ఇంధనం. పురుగు మందులు లేని సేంద్రీయ కూరగాయలు, పండ్లు, పాలిష్ చేయని తృణధాన్యాల కోసం కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం మంచిది. జంక్ ఫుడ్‌ను వదిలేసి.. పోషకాలు నిండిన ‘సూపర్ ఫుడ్స్’కు ప్రాధాన్యత ఇవ్వండి.
2. నాణ్యమైన తాగునీటి ఫిల్టర్ :
నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఎన్నో ఉన్నాయి. శరీరంలోని మలినాలను తొలగించడానికి స్వచ్ఛమైన నీరు అవసరం. కేవలం లీటర్ల కొద్దీ నీరు తాగడమే కాదు. అది బ్యాక్టీరియా లేనిది , మినరల్స్ కలిగినది అయి ఉండాలి. ఒక మంచి వాటర్ ప్యూరిఫైయర్ కొనుగోలు చేయడం అత్యంత ముఖ్యం.
3. సౌకర్యవంతమైన పరుపు , దిండు :
మనం మన జీవితంలో మూడో వంతు నిద్రలోనే గడుపుతాము. వెన్నునొప్పి, మెడ నొప్పులు రాకుండా ఉండాలంటే.. శరీరానికి సరైన సపోర్ట్ ఇచ్చే నాణ్యమైన పరుపుపై ఖర్చు చేయడం అవసరం. ఇది గాఢ నిద్రకు, ఉదయాన్నే ఉత్సాహంగా లేవడానికి దోహద పడుతుంది.
4. నాణ్యమైన చెప్పులు :
నడక లేదా పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, తక్కువ నాణ్యత గల పాదరక్షలు వాడితే మోకాళ్ల నొప్పులు, పాదాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ పాదాల ఆకృతికి తగ్గట్టుగా ఉండే బ్రాండెడ్ స్పోర్ట్స్ షూస్ కోసం ఖర్చు చేయడం ఉత్తమం.
5. ఫిట్‌నెస్ , యోగా సభ్యత్వం :
శరీరాన్ని కదిలించకపోతే తుప్పు పట్టిన యంత్రంలా మారిపోతుంది. ఒక మంచి జిమ్ లేదా యోగా క్లాస్‌లో చేరడం వల్ల క్రమ శిక్షణతో కూడిన వ్యాయామం అలవడుతుంది. లేదా కనీసం ఇంట్లో వాడుకునే చిన్న చిన్న పరికరాల (యోగా మ్యాట్, డంబెల్స్) పై పెట్టుబడి పెట్టండి.
6. హెల్త్ చెకప్:
వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే.. రాకుండా చూసుకోవడం మిన్న. ఏటా కనీసం ఒకసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం వల్ల లోపల ఏవైనా సమస్యలు ఉంటే ప్రారంభంలోనే గుర్తించవచ్చు. ఇది ప్రాణాలను రక్షించడమే కాక, హాస్పిటల్ ఖర్చులను నివారిస్తుంది.
7. ఎర్గోనామిక్ కుర్చీ:
నేటి కాలంలో చాలా మంది గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పని చేస్తున్నారు. తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల వెన్నుపాము దెబ్బతింటుంది. కాబట్టి.. ఆఫీసులో లేదా ఇంటి దగ్గర పని చేసే చోట మంచి ఎర్గోనామిక్ కుర్చీని కొనుగోలు చేయండి.
8. మానసిక ఆరోగ్యానికి థెరపీ:
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఉన్నప్పుడు నిపుణులైన థెరపిస్ట్‌ను సంప్రదించడానికి వెనుకాడకండి. అలాగే మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే పుస్తకాలు లేదా హాబీలపై ఖర్చు చేయడం అమూల్యమైనది.
9. ఎయిర్ ప్యూరిఫైయర్:
కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో శ్వాసకోశ సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు ఇంట్లో స్వచ్ఛమైన గాలి కోసం మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
10. ఆరోగ్య బీమా:
అనుకోని అనారోగ్యాలు లేదా ప్రమాదాలు సంభవించినప్పుడు ఆర్థికంగా కృంగిపోకుండా ఉండాలంటే ‘హెల్త్ ఇన్సూరెన్స్’ తప్పనిసరి. ఇది మీ సంపాదనను కాపాడటమే కాకుండా.. మీకు అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉండేలా భరోసా ఇస్తుంది.