Liver Cancer: లివర్ క్యాన్సర్ అనేది నిశ్శబ్దంగా వ్యాపించే వ్యాధి. ప్రారంభ దశలో దీని లక్షణాలు చాలా స్వల్పంగా ఉండటం వల్ల చాలామంది వీటిని సాధారణ అనారోగ్యంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. అయితే.. శరీరం ఇచ్చే కొన్ని ముఖ్యమైన సంకేతాలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణక్రియలో మార్పులు, చర్మ రంగు మారడం వంటి 5 కీలక సంకేతాల పట్ల అవగాహన కలిగి ఉండటం ప్రాణరక్షణకు ఎంతో కీలకం. ఆ సూచనలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
లివర్ క్యాన్సర్ ముందు వచ్చే 5 ముఖ్యమైన సంకేతాలు:
1. చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం:
కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో ‘బిలిరుబిన్’ అనే పదార్థం పేరుకుపోతుంది. దీని వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ వ్యాధికి అత్యంత ప్రాథమిక, స్పష్టమైన హెచ్చరిక.
2. పొత్తికడుపులో వాపు, నొప్పి:
కడుపు పైభాగంలో.. ముఖ్యంగా కుడి వైపున నొప్పిగా అనిపించడం లేదా కడుపు అసాధారణంగా ఉబ్బినట్లు అనిపించడం లివర్ క్యాన్సర్ లక్షణం కావచ్చు. కాలేయం పరిమాణం పెరగడం వల్ల ఈ అసౌకర్యం కలుగుతుంది.
3. ఆకలి తగ్గడం, ఆకస్మిక బరువు తగ్గడం:
ఎలాంటి వ్యాయామం లేదా డైటింగ్ చేయకుండానే హఠాత్తుగా బరువు తగ్గిపోవడం ప్రమాదకరం. కాలేయం దెబ్బతిన్నప్పుడు జీర్ణక్రియ మందగించి, ఆకలి పూర్తిగా తగ్గిపోతుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలకు సంకేతం కావచ్చు.
4. వికారం, వాంతులు:
తరచుగా వికారంగా అనిపించడం, తిన్న ఆహారం అరగకపోవడం లేదా వాంతులు అవ్వడం వంటివి కాలేయ పనితీరు మందగించిందని చెప్పడానికి శరీరమిచ్చే సంకేతాలు. శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లలేకపోయినప్పుడు ఇలా జరుగుతుంది.
5. మూత్రం, మలం రంగులో మార్పులు:
మలం లేత బూడిద రంగులో రావడం లేదా మూత్రం ముదురు పసుపు/గోధుమ రంగులో రావడం గమనిస్తే వెంటనే.. డాక్టర్ సంప్రదించాలి. కాలేయం నుంచి విడుదలయ్యే.. బైల్ జ్యూస్ (పిత్రసం) ప్రవాహంలో అంతరాయం ఏర్పడినప్పుడు ఈ మార్పులు వస్తాయి.
పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినంత మాత్రాన అది.. క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం లేదు. కానీ, వీటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే లివర్ ఫంక్షన్ టెస్ట్ లేదా స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమం.