Giant Baby: సాధారణంగా పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లలు 2.5 నుంచి 3.5 కిలోల బరువు ఉంటారు. కానీ.. న్యూయార్క్‌లో ఒక వింత జరిగింది. అక్కడ ఒక బాబు పుట్టినప్పుడే ఏకంగా 5.9 కిలోల బరువుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంటే సుమారు 6 కిలోలు అన్నమాట. మూడు నెలల వయసున్న బాబు ఎంత బరువు ఉంటాడో.. ఈ పసికందు పుట్టినప్పుడే అంత బరువు ఉన్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షాన్ జూనియర్:
న్యూయార్క్‌లోని ఇతాకా ప్రాంతానికి చెందిన టెర్రికా, షాన్ దంపతులకు జనవరి 31న ‘కయుగా మెడికల్ సెంటర్’లో ఒక బాబు జన్మించాడు. బాబుకు షాన్ జూనియర్ అని పేరు పెట్టారు. అయితే.. ఆ బాబు బరువు చూసి డాక్టర్లు, పేరెంట్స్ నోరెళ్లబెట్టారు. ఆ పసికందు ఏకంగా 5.9 కిలోల బరువు ఉన్నాడు. సాధారణంగా మన దేశంలో లేదా విదేశాల్లోనైనా పుట్టిన పిల్లలు సుమారు 3 కిలోల వరకు ఉంటారు. కానీ ఈ బాబు దాదాపు రెట్టింపు బరువుతో పుట్టడం ఒక రికార్డుగా నిలిచింది. ఈ హాస్పిటల్ చరిత్రలోనే ఇంత బరువుతో పుట్టిన మొదటి బాబు షాన్ జూనియరే కావడం విశేషం.
తల్లి మాటల్లో.. “అప్పుడే 3 నెలల బట్టలు!”
ఇప్పటికే నలుగురు పిల్లలకు తల్లయిన టెర్రికా మాట్లాడుతూ.. తన బాబు కొంచెం లావుగా పుడతాడని ముందే తెలుసని, కానీ మరీ ఇంత భారీగా ఉంటాడని అస్సలు ఊహించలేదని చెప్పింది. “వాడు పుట్టినప్పుడే మూడు నెలల బాబులా ఉన్నాడు. మామూలు పసిపిల్లల బట్టలు వాడికి అస్సలు సరిపోలేదు. ఇప్పుడు వాడికి 6 నెలల పిల్లలు వేసుకునే బట్టలు, డైపర్లను వాడుతున్నాను” అని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చింది.
హాస్పిటల్‌లో ఒక వింత దృశ్యం:
షాన్ జూనియర్ పుట్టిన రోజే అదే హాస్పిటల్‌లో మార్గోట్ అనే చిన్నారి కూడా పుట్టింది. అయితే మార్గోట్ బరువు కేవలం 1.8 కిలోలు మాత్రమే. హాస్పిటల్ సిబ్బంది ఈ ఇద్దరు పిల్లలను పక్కపక్కన ఉంచి ఒక ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ఆ ఫోటో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒకరు చాలా చిన్నగా, మరొకరు చాలా భారీగా ఉండటం చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మార్గోట్ తల్లి క్లోయీ మాట్లాడుతూ.. “ఒకే రోజు ఇలాంటి ఇద్దరు పిల్లలు పుట్టడం చాలా స్వీట్ మెమరీ. పిల్లలు ఏ సైజులో పుట్టినా వారు మాకు దేవుడిచ్చిన వరాలే” అని ఆనందం వ్యక్తం చేసింది.
Also Read: సక్సెస్ ఫుల్ పీపుల్ ఉదయాన్నే చేసే.. ఆ 4 పనులు ఇవే!
డాక్టర్లు ఏమంటున్నారు?
సెంట్రలస్ హెల్త్ డైరెక్టర్ రాబిన్ టోర్గల్స్కీ మాట్లాడుతూ.. ప్రతి పుట్టుక ఒక ప్రత్యేకమైన కథ అని చెప్పారు. బాబు 4 పౌండ్లు ఉన్నా, 13 పౌండ్లు ఉన్నా తమ మెడికల్ టీమ్ ఆ తల్లికి, బిడ్డకు మెరుగైన చికిత్స అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. బాబు ఆరోగ్యంగా ఉన్నాడని.. భారీ బరువుతో పుట్టినా ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్ధారించారు.
ప్రపంచ రికార్డులు ఏం చెబుతున్నాయి?
షాన్ జూనియర్ 5.9 కిలోలతో హాస్పిటల్ రికార్డు సృష్టించినప్పటికీ.. ప్రపంచ రికార్డుకు ఇంకా దూరంగానే ఉన్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యధిక బరువుతో పుట్టిన శిశువు రికార్డు ఇటలీకి చెందిన ఒక బాబు పేరు మీద ఉంది. 1955లో పుట్టిన ఆ బాబు బరువు ఏకంగా 9.97 కిలోలు. అంటే దాదాపు 10 కిలోల బరువు అన్నమాట.