Kakarakaya Karam Podi: కాకరకాయ అనగానే చాలా మంది మొహం తిప్పుకుంటారు. దానిలో ఉండే చేదు రుచే ఇందుకు ప్రధాన కారణం. ఆరోగ్యానికి .. ఎంతో మంచిదని తెలిసినా, ఆ భయంతో చాలా మంది కాకరకాయను పక్కన పెట్టేస్తుంటారు. అయితే… ఏమాత్రం చేదు లేకుండా, నోటికి ఎంతో కమ్మగా, రోజువారీ భోజనంలోకి అద్భుతంగా సరి పోయేలా కాకరకాయ కారం పొడి తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు సైతం ఇష్టంగా లాగించేసే.. ఈ ట్రెండీ అండ్ హెల్తీ కారం పొడిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!
కాకరకాయలు: 4-5
ధనియాలు: 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
పచ్చి శనగపప్పు & మినప్పప్పు: కలిపి 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి: 10-12
వెల్లుల్లి రెబ్బలు: 15-20
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు అంత
బెల్లం తురుము: 1 చిన్న స్పూన్
పసుపు: 1/2 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కాకరకాయ ముక్కలు వేయించడానికి తగినంత.
1. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి, మరీ మందంగా కాకుండా.. పల్చని చక్రాలుగా లేదా చిన్న ముక్కలుగా తరగాలి. ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి, తరిగిన కాకరకాయ ముక్కలను వేసి సన్నని మంటపై బాగా దోరగా, ఎర్రగా మారే వరకు వేయించాలి. ముక్కలు క్రిస్పీగా మారిన తర్వాత నూనె నుంచి వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా వేయించడం వల్ల కాకరకాయలోని చేదు చాలా వరకు తగ్గిపోతుంది.
2. ఇదే గిన్నెలో మరో స్పూన్ నూనె వేసి ధనియాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు , ఎండుమిర్చి వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన చల్లారబెట్టుకోవాలి.
3. ముందుగా మిక్సీ జార్‌లో వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, తగినంత ఉప్పు, పసుపు, చింతపండు, కొద్దిగా బెల్లం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. బెల్లం వేయడం వల్ల కాకరకాయలోని సహజమైన చేదును సమతుల్యం చేసి అద్భుతమైన రుచిని ఇస్తుంది.
4. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ముందుగా వేయించి పెట్టుకున్న క్రిస్పీ కాకరకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. మిక్సీని పల్స్ మోడ్ లో పెట్టి ఒకటి లేదా రెండు సార్లు తిప్పాలి. పొడిని మరీ మెత్తటి పౌడర్‌లా కాకుండా.. కొద్దిగా బరకగా ఉండేలా చూసుకోవాలి. అంతే.. గుమగుమలాడే కమ్మటి కాకరకాయ కారం పొడి రెడీ!
వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ కారం పొడి వేసుకుని, నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి కలుపుకుని తింటే అమృతంలా.. ఉంటుంది. అలాగే వేడి అన్నంతో పాటు సాంబారు లేదా రసంతో నంజుకోవడానికి కూడా ఇది అదిరిపోతుంది.