సాయంత్రం సమయంలో పిల్లలకు ఆకలిగా అనిపిస్తుంది. ఏదైనా టిఫిన్స్, స్నాక్స్ తినాలనిపిస్తుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు వాళ్ల కోసం టిఫిన్స్ ఏమివ్వాలో ఆలోచిస్తుంటారు. ప్రతిరోజూ ఒకే రకమైన స్నాక్స్ తింటూ పిల్లలు కూడా బోర్ ఫీల్ అవుతారు. అలాంటి సమయంలో త్వరగా తయారయ్యే, రుచికరమైన మ్యాగీ స్ప్రింగ్ రోల్స్ మంచి ఆప్షన్. పిల్లలకు ఇష్టమైన మ్యాగీ నూడుల్స్, స్ప్రింగ్ రోల్స్ కలయిక ఈ రెసిపీని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ స్నాక్ పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు.
ఈ రెసిపీ కోసం ఒక ప్యాకెట్ మ్యాగీ నూడుల్స్, ఆరు నుంచి ఏడు స్ప్రింగ్ రోల్ షీట్లు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి అవసరం. అదనంగా టమాటో సాస్, చిల్లీ సాస్, మిరియాల పొడి, ఉప్పు, కొద్దిగా నూనె, మైదా పిండి పేస్ట్ మరియు వేయించడానికి సరిపడా నూనె సిద్ధంగా ఉంచుకోవాలి.
మొదట పాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత తురిమిన క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
ఇప్పుడు కొద్దిగా నీరు పోసి మ్యాగీ నూడుల్స్ వేసి ఉడికించాలి. మ్యాగీ మసాలా పొడి కూడా కలపాలి. తర్వాత టమాటో సాస్, చిల్లీ సాస్, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఫిల్లింగ్ ఎక్కువ తడిగా కాకుండా కొద్దిగా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.
ఒక చిన్న గిన్నెలో మైదా పిండి, నీటిని కలిపి పలుచటి పేస్ట్ తయారు చేయాలి. ఇప్పుడు ఒక స్ప్రింగ్ రోల్ షీట్ తీసుకుని మధ్యలో మ్యాగీ ఫిల్లింగ్ ఉంచాలి. షీట్ రెండు వైపులా మడిచి గట్టిగా రోల్ చేయాలి. చివరలో మైదా పేస్ట్ రాసి రోల్ తెరుచుకోకుండా సీల్ చేయాలి. ఇదే విధంగా మిగిలిన రోల్స్ కూడా తయారు చేసుకోండి.
Also Read: మెరిసేపోయే ముఖ చర్మం కోసం సింపుల్ చిట్కా.. కేవలం 2 నిమిషాలు ఈ స్పెషల్ క్యూబ్స్ రబ్ చేస్తే చాలు
లోతుగా ఉండే పాన్ లేదా కడాయిలో సరిపడా నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక రోల్స్‌ను మీడియం ఫ్లేమ్‌పై వేయించాలి. అవి గోల్డెన్ కలర్‌లోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి.
ఆరోగ్యం కోసం ఎక్కువ ఆలోచించేవారు.. కావాలనుకుంటే ఎయిర్ ఫ్రయర్ లేదా ఓవెన్‌లో కూడా తయారు చేసుకోవచ్చు. వేడివేడిగా టమాటో సాస్ లేదా మయోనైస్‌తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది.
ఒకేసారి ఎక్కువ రోల్స్ తయారు చేసి ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు నేరుగా ఫ్రీజర్ నుంచి తీసి వేయించుకోవచ్చు. దీంతో తక్కువ సమయంలో పిల్లలకు రుచికరమైన స్నాక్ సిద్ధమవుతుంది.