Food Sequencing: ప్రస్తుతం ఆరోగ్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది ‘డైటింగ్’. ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేస్తూ.. సగం కడుపుతో అలమటించడమే ఆరోగ్యానికి మార్గమని చాలామంది నమ్ముతుంటారు. మనం తీసుకునే ఆహారాన్ని మార్చకుండా.. కేవలం అది కడుపులోకి వెళ్లే ‘వరుస క్రమాన్ని’ మార్చడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు . అంతే కాకుండా బరువు తగ్గొచ్చు. ఫుడ్ తగ్గించకుండానే ఆరోగ్యంగా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో మనం తినే ఆహారం గ్లూకోజ్‌గా మారుతుంది. మనం కార్బోహైడ్రేట్లు (అన్నం, రొట్టి, స్వీట్లు) తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీన్నే “గ్లూకోజ్ స్పైక్” అంటారు. ఈ స్పైక్స్ వల్ల ఇన్సులిన్ హార్మోన్ విపరీతంగా విడుదలవుతుంది. ఇది కొవ్వు నిల్వకు దారి తీస్తుంది. ఫలితంగా మనం తిండి తగ్గించినా బరువు తగ్గలేకపోతాము. అయితే.. తినే పద్ధతి మార్చడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చు.
1. ఫైబర్ (పీచు పదార్థం) మొదటి స్థానం:
భోజనం చేసేటప్పుడు మొదట సలాడ్స్ లేదా కూరగాయలు తినాలి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థలో ఒక రకమైన ‘జల్లెడ’ లాంటి పొరను ఏర్పరుస్తుంది. ఇది ఆ తర్వాత వచ్చే గ్లూకోజ్‌ను రక్తంలోకి నెమ్మదిగా పంపిస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు.
2. ప్రోటీన్, ఫ్యాట్స్-రెండో స్థానం:
కూరగాయల తర్వాత పప్పు, గుడ్లు, మాంసం లేదా పెరుగు వంటి ప్రోటీన్ ఉన్న పదార్థాలను తినాలి. ప్రోటీన్, కొవ్వు పదార్థాలు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఇది మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చేస్తుంది.
3. కార్బోహైడ్రేట్లు, షుగర్స్ :
అన్నం, చపాతీ లేదా తీపి పదార్థాలను భోజనం చివరలో తినాలి. అప్పటికే కడుపులో ఉన్న ఫైబర్ , ప్రోటీన్ వల్ల, ఈ కార్బోహైడ్రేట్లు నేరుగా రక్తంలోకి చేరవు. దీని వల్ల ‘గ్లూకోజ్ స్పైక్’ 70% వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
తినే పద్ధతి మారితే కలిగే లాభాలు:
క్రేవింగ్స్ తగ్గుతాయి: భోజనం తర్వాత మళ్లీ ఏదైనా తినాలనిపించే కోరిక మాయమవుతుంది.
స్థిరమైన శక్తి: రక్తంలో షుగర్ లెవల్స్ స్థిరంగా ఉండటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. నీరసం దరిచేరదు.
బరువు నియంత్రణ: ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉండటం వల్ల శరీరం కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది.
మెరుగైన హార్మోన్ల ఆరోగ్యం: ముఖ్యంగా మహిళల్లో PCOS/PCOD సమస్యలు ఉన్నప్పుడు.. ఈ పద్ధతి హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఆరోగ్యం అంటే.. ఆకలితో ఉండటం కాదు.. తెలివిగా తినడం. మీరు బిర్యానీ తిన్నా, భోజనం తిన్నా.. మొదట కొంచెం సలాడ్ తిని, ఆపై ముక్కలు (ప్రోటీన్) తిని.. చివరగా అన్నం తినండి. ఈ చిన్న మార్పు మీ లైఫ్ స్టైల్ , ఆరోగ్యాన్ని సమూలంగా మారుస్తుంది. తిండి తగ్గించకండి.. తినే పద్ధతిని మార్చండి.