చలికాలం వచ్చేసరికి శరీరానికి వేడిమి ఇచ్చే ఆహారాన్ని ప్రత్యేకంగా తినాలి. జీర్ణక్రియను మెరుగుపరచే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తినాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోంపు గింజలు వేసి మరిగించిన పాలు తాగడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లోనే సులభంగా తయారయ్యే ఈ పానీయం సహజ గుణాల కారణంగా శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇక సోంపులో ఉండే సహజ నూనెలు, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరానికి అదనపు లాభాలు అందిస్తాయి. ఇవి రెండూ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణక్రియ మెరుగుపడటం, పొట్ట సమస్యలు తగ్గడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం తర్వాత ఈ పానీయం తీసుకుంటే కడుపు భారంగా లేకుండా తేలికగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
సోంపు పొట్టను ఎలా కాపాడుతుంది?
సోంపు పాలు జీర్ణక్రియపై చూపే ప్రభావం గురించి వైద్యులు వివరిస్తున్నారు. సోంపులో ఉండే ‘అనీథోల్’ అనే సహజ పదార్థం పొట్ట, ప్రేగుల కండరాలను సడలించి జీర్ణశక్తిని పెంచుతుందని తెలియజేస్తున్నారు. అపాన వాయువు, గాలిబద్ధకం, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సాధారణ పొట్ట సమస్యలను తగ్గించడానికి ఈ పానీయం చాలా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. వేడి పాలు పొట్టకు హాయిని ఇస్తే, సోంపు తేమను ఇచ్చి, ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంద. రాత్రి భోజనం తర్వాత సోంపు పాలు తాగితే పొట్ట తేలికగా ఉండటమే కాకుండా మంచి నిద్ర కూడా వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను మెరుగుపరుస్తుందని వారు వివరిస్తున్నారు. నిద్ర సమస్యలు ఉన్నవారు ఈ సోంపు పాలను అప్పుడప్పుడు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మహిళలకు ముఖ్యం
ఈ సోంపు పాలు మహిళలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, ఒత్తిడి, అసహనం వంటి సమస్యలను తగ్గించడంలో సోంపులో ఉండే సహజ గుణాలు సహాయపడతాయని చెబుతున్నారు. సోంపులో ఉండే మృదువైన ఫైటోఈస్ట్రోజెన్‌ల వల్ల హార్మోన్ల సమతుల్యత మెరుగుపడే అవకాశం ఉందని చెబుతారు. అదనంగా చలి, దగ్గు, జలుబు సమయంలో వేడి పాలు గొంతుని కాపాడితే, సోంపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పి తగ్గించడంలో సహాయపడవచ్చు. ఈ పానీయం శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చి, శీతాకాలంలో కలిగే సాధారణ అనారోగ్యాల నుంచి రక్షణ ఇవ్వగలదని కూడా వైద్యులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో సోంపు, పాలు రెండూ కలిసి పనిచేస్తాయని నిపుణుల అభిప్రాయం.
వీరు తాగకూడదు
అయితే ఈ పానీయాన్ని అద్భుత ఔషధంగా భావించకూడదని చెబుతున్నారు వైద్యులు. ఇది ఒక సహజమైన, సురక్షితమైన పానీయం అయినప్పటికీ, దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. అధికంగా సోంపు తీసుకోవడం వల్ల హార్మోన్‌లపై ప్రభావం పడే అవకాశం ఉందని, ముఖ్యంగా హార్మోన్లకు సంబంధించిన చికిత్సలు తీసుకునే వారు, గర్భిణీలు, బాలింతలు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనతోనే ఈ పానీయం తీసుకోవాలని చెప్తున్నారు. రోజూ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదని, వారంలో రెండు మూడు సార్లు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.