చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చేతిరాత గురించి ఆందోళన చెందుతుంటారు. అక్షరాలు స్పష్టంగా లేకపోవడం, రాత గజిబిజిగా ఉండటం వంటి సమస్యలు సాధారణంగా చిన్న వయసులో కనిపిస్తాయి. అయితే సరైన పద్ధతులు పాటిస్తే చేతిరాతను సులభంగా మెరుగుపరచవచ్చు. ముఖ్యంగా ఆటల రూపంలో నేర్పిస్తే పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు.
చిన్న పిల్లల చేతివేళ్ల కండరాలు పూర్తిగా బలంగా ఉండవు. దీంతో వారు పెన్సిల్‌ను సరిగా పట్టుకోలేరు. కొన్నిసార్లు తప్పుడు పద్ధతిలో పెన్సిల్ పట్టుకోవడం అలవాటుగా మారుతుంది. దీనివల్ల రాత స్పష్టంగా ఉండదు. అందుకే ముందుగా చేతివేళ్ల కండరాలను బలపరచడం అవసరం.
పిల్లలకు రంగురంగుల క్లే.. లేదా మట్టితో ఆడే అవకాశం ఇవ్వాలి. క్లే తో పూలు, జంతువులు లేదా ఇతర ఆకారాలు తయారు చేయవచ్చు. ఈ ప్రక్రియతో వేళ్ల బలాన్ని పెంచుతుంది.
అలాగే బట్టలు ఆరేసే క్లిప్‌లను పెట్టే ఆటలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. పెట్టెల అంచులకు క్లిప్‌లు అమర్చేలా చెప్పాలి. ఇది చేతి పట్టును మెరుగుపరుస్తుంది.
రంగు కాగితాలను చించి అతికించే యక్టివిటీస్ చేయిస్తే కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇవి చేతి కదలికలపై నియంత్రణ పెంచుతాయి.
పిల్లల వయసుకు సరిపోయే పెన్సిల్‌ను ఎంచుకోవాలి. పెన్సిల్‌ను మధ్య భాగంలో సరిగ్గా పట్టుకోవడం నేర్పాలి. చాలా పైభాగంలో లేదా కింది భాగంలో పట్టుకోకూడదని చెప్పాలి. సరైన పట్టు ఉంటే రాత మరింత అందంగా ఉంటుంది.
పిల్లలను ఇసుకలో అక్షరాలు రాయమని ప్రోత్సహించాలి. వేళ్లతో అక్షరాలు, పదాలు రాయడం ద్వారా వారు సులభంగా నేర్చుకుంటారు. ఈ విధానం అక్షరాల ఆకారాలను గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ఇది వారికి సరదాగా కూడా ఉంటుంది.
చుక్కలను కలిపి బొమ్మలు తయారు చేసే ఆటలు పిల్లలకు చాలా ఇష్టం. ఈ యాక్టివిటీ.. పెన్సిల్ కదలికలను నియంత్రించడం నేర్పుతుంది. పిల్లాడి చేయి సమన్వయం కూడా మెరుగుపడుతుంది.
పిల్లలకు షాపింగ్ లిస్ట్ రాయాలని చెప్పండి. ఇంట్లోని వస్తువులకు పేర్లు రాసి అంటించేలా ప్రోత్సహించవచ్చు. కుటుంబ సభ్యుల పేరుతో చిన్న నోట్లు రాయడం కూడా మంచి అలవాటు. ఇలా చేస్తే రాయడం వారికి ఆటలా అనిపిస్తుంది.
Also Read: ఎన్ని కష్టాలొచ్చినా ఎందుకు కొందరు భయపడరు.. చాణక్యుడు ఇందుకు చెప్పిన కారణాలు ఇవే
హ్యాండ్ రైటింగ్ మెరుగుపడాలంటే ప్రతిరోజూ కొద్దిసేపు ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. అలాగని ఎక్కువసేపు రాయమని బలవంతం చేయకూడదు. పిల్లలు సాధించే చిన్న చిన్న పురోగతిని కూడా ప్రశంసించాలి. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
చేతిరాత ఒక్కరోజులో మారదు. క్రమం తప్పకుండా సాధన చేస్తే క్రమంగా మెరుగుపడుతుంది. పిల్లల ప్రతి చిన్న విజయాన్ని అభినందించాలి. సరదా కార్యకలాపాలతో నేర్పితే వారు ఆనందంగా నేర్చుకుంటారు. ఈ విధంగా అందమైన చేతిరాతతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.