BJP Coverts: సేచ్ఛ బ్యూరో: తెలంగాణ బీజేపీలో కోవర్టుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం వ్యూహాలు రచిస్తుంటే, క్షేత్రస్థాయిలో కొందరు లీడర్ల తీరు పార్టీకి శాపంగా మారిందనే చర్చ నడుస్తోంది. పలువురు ముఖ్య నేతలు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్‌తో కూడా టచ్‌లో ఉన్నారనే లీక్‌లు కమలదళంలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్‌కు పూర్తి నివేదిక అందినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలతో రహస్యంగా టచ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీలోని అంతర్గత సమాచారాన్ని అవతలి పార్టీలకు చేరవేస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో హైకమాండ్ అలర్ట్ అయినట్లు సమాచారం.
ఈ వ్యవహారాన్ని ఢిల్లీ అధిష్టానం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. నిఘా వర్గాలు, క్షేత్రస్థాయి పరిశీలకుల ద్వారా రహస్య విచారణ జరిపించింది. ఏ నేత ఏ పార్టీ లీడర్‌తో టచ్‌లో ఉన్నారు? ఎప్పుడు, ఎక్కడ సమావేశమయ్యారు? అనే పూర్తి డేటా, లోతైన వివరాలతో కూడిన పక్కా నివేదిక ప్రస్తుతం హైకమాండ్ టేబుల్‌పై సిద్ధంగా ఉందని టాక్. ప్రస్తుత తెలంగాణలోని ఈ పరిస్థితిని ఒక కీలక నేతనే బహిర్గతం చేయడం గమనార్హం. అధిష్టానానికి దీనిపై పూర్తి నివేదిక అందజేసినట్లు సమాచారం. నివేదికలోని అంశాలను చూసి జాతీయ నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలోనే ఉంటూ, ప్రత్యర్థి పార్టీల ప్రయోజనాల కోసం పనిచేసే లీడర్లు ఉంటే.. తెలంగాణలో బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందని ఢిల్లీ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నమ్మకద్రోహ చర్యలను సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలోని కొందరు కీలక నాయకులు కేవలం మీడియా ముందు మాట్లాడటానికి, ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజల్లోకి వెళ్లకుండా, కేవలం టీవీల్లో కనిపించడమే రాజకీయంగా భావిస్తున్నారనే అసహనం అధిష్టానంలో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల సమయంలో కేంద్రం, జాతీయ నాయకత్వం భారీగా నిధులను సమకూర్చింది. ఎవరికి ఎంత ఇచ్చాం, ఎవరు ఎంత ఖర్చు చేశారనే దానిపై కేంద్ర నాయకత్వం ఇప్పటికే పక్కా ఆడిట్ లెక్కలు తీసింది. లీడర్లకు ఇచ్చిన ఫండ్స్‌ను వారు సరిగ్గా క్షేత్రస్థాయికి చేర్చలేదని, కిందిస్థాయి ప్రచారానికి వాడలేదని రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
Also read: Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండే స్పెషల్..
ఒకవైపు జాతీయ నాయకత్వం పంపిన నిధులను లీడర్లు జేబుల్లో వేసుకుంటుంటే.. మరోవైపు క్షేత్రస్థాయిలో సాధారణ కార్యకర్తలు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ జెండాలు మోస్తున్నారు. అంతగా కష్టపడుతున్న కార్యకర్తలకు లీడర్ల నుంచి ఎలాంటి మద్దతు, కనీస గుర్తింపు లభించడం లేదనే తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా నడుస్తోంది, జనం బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రజలు మార్పును కోరుకుంటూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నా.. ఇక్కడి లీడర్ల స్వార్థం, ఇతర పార్టీల వైపు చూసే ధోరణి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని అధిష్టానం భావిస్తోంది.
పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీ నుంచి తీవ్రమైన దాడులు, ప్రాణాపాయాలు ఉన్నా కార్యకర్తలు, లీడర్లు తెగించి పోరాడి పార్టీని నిలబెట్టారు. కానీ తెలంగాణలో జనం మద్దతు ఇస్తున్నా, లీడర్లు మాత్రం ఇతర పార్టీలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటూ సొంత లాభాలు వెతుక్కుంటున్నారని ఢిల్లీ పెద్దలు మండిపడుతున్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన అనంతరం ఈ లోపాలను సరిదిద్దేందుకు హైకమాండ్ సమాలోచనలు చేస్తోంది. రాబోయే ఒకట్రెండు నెలల్లో ఊహించని విధంగా భారీ ప్రక్షాళన జరగబోతోందని టాక్ వినిపిస్తోంది. కోవర్టులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంబాధ్యతారాహిత్యంగా ఉన్న లీడర్లను పక్కన పెట్టడంకష్టపడే కార్యకర్తలకు, నమ్మకమైన నేతలకు కీలక పదవులు అప్పగించడంతెలంగాణ బీజేపీలో అతి త్వరలోనే ఈ ఊహించని భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయని విశ్వసనీయ సమాచారం.
Also read: థియేటర్లను దడదడలాడిస్తున్న హారర్ థ్రిల్లర్… ఓటీటీ స్ట్రీమింగ్ పుకార్ల వెనకున్న నిజం ఇదే