బరువు తగ్గాలని ప్రయత్నించే చాలా మంది ఉదయం బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. మెటబాలిజం పెంచడం, కొవ్వు కరిగే ప్రక్రియ వేగవంతం చేయడం వంటి ప్రయోజనాల వల్ల బ్లాక్ కాఫీ డైట్‌లో ప్రత్యేకంగా చెప్పుకుంటరాు. అయితే బ్లాక్ కాఫీతో పాటు సరైన ఆహారం తీసుకోకపోతే త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలను కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ ప్రయాణం మరింత సులభమవుతుంది.
బ్లాక్ కాఫీ ఎందుకు తాగాలి?
బ్లాక్ కాఫీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే కెఫీన్ శరీరంలోని మెటబాలిజాన్ని పెంచుతుంది. ఇది శరీరం నిల్వ ఉంచుకున్న కొవ్వును శక్తిగా వినియోగించేలా చేస్తుంది. అందుకే వ్యాయామం ముందు లేదా ఉదయం బ్లాక్ కాఫీ తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఖాళీ కడుపుతో ఎక్కువసార్లు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే తేలికపాటి ఆరోగ్యకరమైన ఆహారంతో తీసుకోవడం ఉత్తమం.
ప్రోటీన్ ఉన్న ఆహారం
బ్లాక్ కాఫీతో పాటు ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ప్రయోజనకరం. ఉడకబెట్టిన గుడ్లు, గ్రీక్ యోగర్ట్, పప్పులు లేదా పీనట్ బట్టర్ వంటి ఆహారాలు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో మధ్యలో జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గుతుంది. ప్రోటీన్ శరీర కండరాలను కాపాడి, కొవ్వు తగ్గడంలో సహాయపడుతుంది.
డ్రైఫ్రూట్స్
బాదం, వాల్‌నట్, పిస్తా వంటి డ్రైఫ్రూట్స్ చిన్న పరిమాణంలో తీసుకున్నా మంచి శక్తి ఇస్తాయి. ఇవి హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్ అందిస్తాయి. బ్లాక్ కాఫీతో 4-5 బాదం లేదా రెండు వాల్‌నట్ తీసుకోవడం వల్ల శక్తి స్థాయి నిలకడగా ఉంటుంది. అలాగే ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది.
పండ్లు
యాపిల్, బెర్రీలు, అరటి వంటి పండ్లు బ్లాక్ కాఫీతో కలిపి తీసుకోవచ్చు. వీటిలో సహజ చక్కెర, ఫైబర్ ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పండ్లు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. దీంతో అధికంగా తినే అలవాటు తగ్గుతుంది.
Also read: Hair care: కరివేపాకులను ఇలా వాడారంటే జుట్టు పెరగడమే కాదు చుండ్రు కూడా పోతుంది
ఓట్స్, హై ఫైబర్ స్నాక్స్
ఓట్స్, మల్టిగ్రేన్ బిస్కెట్లు, చియా సీడ్స్ వంటి హై ఫైబర్ ఆహారాలు కూడా బ్లాక్ కాఫీతో తీసుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేసి ఎక్కువసేపు తృప్తి కలిగిస్తుంది. ఇది వెయిట్ లాస్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.
హెల్తీ ఫ్యాట్స్
అవకాడో, ఫ్లాక్స్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వంటి హెల్తీ ఫ్యాట్స్ కూడా బ్లాక్ కాఫీతో కలిపి తీసుకోవచ్చు. హెల్తీ ఫ్యాట్స్ శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా హార్మోన్ సమతౌల్యాన్ని కాపాడతాయి. దీంతో ఆకలి నియంత్రణ మెరుగవుతుంది.
వీటిని తినకండి
బ్లాక్ కాఫీ తాగేటప్పుడు అందులో చక్కెర, క్రీమ్, ఫ్లేవర్డ్ సిరప్స్ కలపకుండా తాగాలి. అలాగే బ్లాక్ కాఫీతో పాటు కేక్, పేస్ట్రీలు, ఫ్రైడ్ స్నాక్స్ తీసుకుంటే వెయిట్ లాస్ లక్ష్యం దెబ్బతింటుంది. అధిక కేలరీలు ఉన్న ఆహారం బ్లాక్ కాఫీ ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజుకు 1-2 కప్పుల బ్లాక్ కాఫీ సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తాగితే నిద్రలేమి, ఆందోళన, హార్ట్‌బీట్ పెరగడం వంటి సమస్యలు రావచ్చు. అలాగే బ్లాక్ కాఫీ మాత్రమే తాగి భోజనం మానేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. సమతుల్య ఆహారం, వ్యాయామం, సరైన నిద్రతో కలిపి తీసుకుంటేనే మంచి ఫలితాలు కనిపిస్తాయి.