Unique Cannabis Tradition: గంజాయి సాగు, రవాణా, వినియోగం చట్ట వ్యతిరేకం. ఎక్కడ దొరికినా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారు కూడా. కానీ, ఈ రూల్స్ లన్నీ ఆ రాష్ట్రంలో పని చేయవు. అక్కడి ప్రజలు గంజాయి తీసుకోవడాన్ని ఓ సంప్రదాయంగా భావిస్తారు. రోజు వారీ అవసరాల కోసం గంజాయి మీద ఆధారపడుతారు. ఆ రాష్ట్రం ఏదో కాదు, ఉత్తరాఖండ్. అక్కడి కొండ ప్రాంతాల ప్రజలు గంజాయిని మత్తు పదార్థంగా చూడరు. తమ జీవన విధానంలో ఒక భాగంగా చూస్తారు. ఆహారం నుంచి వ్యవసాయం వరకు, తాళ్లు నుంచి గృహ అవసరాల వరకు గంజాయి మొక్కలను బోలెడు రకాలుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కుమావోన్, గర్హ్వాల్ ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని గ్రామాలు గంజాయి ఆధారిత సంప్రదాయాలను కొనసాగుతున్నాయి.
పర్వత ప్రాంతాల్లో సహజంగా పెరిగే ఈ మొక్కను అక్కడి ప్రజలు సహజ వనరుగా భావిస్తారు. పెద్దగా నీరు అవసరం లేకుండా, ఎక్కువ రక్షణ లేకపోయినా వేగంగా పెరుగుతుంది. అందుకే కొండ ప్రాంతాల్లో వివరివిగా లభించే ఈ మొక్కలను స్థానికులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. పాత తరం ప్రజలు ఒకప్పుడు గంజాయి పీచుతో బట్టలు, సంచులు, తాళ్లు తయారు చేసే వాళ్లు.
ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో గంజాయి పీచుతో చేతితో తాళ్లు తయారు చేసే సంప్రదాయం కొనసాగుతోంది. మొక్క బెరడును ఎండబెట్టి, దానితో బలమైన తాళ్లు తయారు చేస్తారు. ఈ తాళ్లను కట్టెలు మోయడానికి, గడ్డి కట్టలు కట్టడానికి, పశువులను కట్టడానికి ఉపయోగిస్తారు. కొండ ప్రాంతాల్లో దొరికే ఈ మొక్కల నుంచి నార తీసి ప్రజలు తాళ్లు తయారు చేస్తున్నారు. మార్కెట్ లో ప్లాస్టిక్ తాళ్లు వచ్చినప్పటికీ, కొన్ని గ్రామాల్లో సంప్రదాయ తాళ్ల వాడకం తగ్గలేదు.
ఉత్తరాఖండ్ లో భాంగ్ చట్నీ చాలా ప్రసిద్ధి చెందిన స్థానిక వంటకం. ఇది గంజాయి విత్తనాలతో తయారవుతుంది. వేయించిన విత్తనాలను పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పుతో కలిపి నూరి ఈ చట్నీ తయారు చేస్తారు. దీనిని అన్నం, పప్పు, మండువా రోటీతో తింటారు. స్థానికులు చెబుతున్నదాని ప్రకారం, ఈ విత్తనాలు మత్తు కలిగించవు. పైగా శక్తిని ఇస్తాయని నమ్ముతారు. ఉత్తరాఖండ్‌కు వెళ్లే పర్యాటకులు కూడా ఈ ప్రత్యేక రుచిని తప్పకుండా ప్రయత్నించాలని చూస్తుంటారు.
కొన్ని గ్రామాల్లో గంజాయి మొక్కను సాంప్రదాయ వైద్య పద్ధతుల్లో కూడా ఉపయోగించేవారని పెద్దలు చెబుతున్నారు. బాడీ పెయిన్స్, అలసట, నీరసం లాంటి సమస్యలకు హోం రెమిడీగా మొక్క భాగాలను వాడేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో గంజాయి విత్తనాలను పరిమితంగా ఉపయోగించే సంప్రదాయం కొనసాగుతోంది. సహజ మొక్కలను జాగ్రత్తగా వాడితే ఆరోగ్యానికి ఉపయోగపడతాయని అక్కడి ప్రజల నమ్మకం.
ప్రపంచంలోని చాలా దేశాల్లో గంజాయి అంటే మత్తు పదార్థం అనే అభిప్రాయం ఎక్కువగా ఉన్నా, ఉత్తరాఖండ్‌లోని కొన్ని గ్రామాలకు మాత్రం ఇది సంప్రదాయం, జీవనోపాధి, సహజ వనరు అన్న భావన ఉంది. తాళ్లు తయారీ నుంచి స్థానిక వంటకాల వరకు, వ్యవసాయం నుంచి జానపద వైద్యం వరకు ఈ మొక్క అక్కడి సంస్కృతిలో ఒక భాగంగా మారింది.
Read Also: లో బడ్జెట్ ఫ్యామిలీ ట్రిప్స్.. హైదరాబాద్ సమీపంలోని బ్యూటీఫుల్ హిల్ స్టేషన్లు ఇవే!