కుటుంబ నియంత్రణలో భాగంగా గర్భనిరోధక మాత్రలు మహిళలు వాడుతున్నారు. ఇవి గర్భధారణను నివారించడంలో సులభమైన మార్గం అయినప్పటికీ, దీర్ఘకాలంగా వాడితే కొన్ని చెడు ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంది. అయితే వైద్యుల సలహా లేకుండా ఈ మాత్రలు తీసుకోవడం తప్పనిసరిగా మానుకోవాలి. గర్భనిరోధక మాత్రల్లో హార్మోన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ సమతుల్యతను మార్చేస్తాయి. అందువల్ల మొదట్లో తలనొప్పి, వాంతులు, మలబద్ధకం, తల తిరగడం వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు. కొంతమందిలో మానసిక ఆందోళన, చిరాకు, నిద్రలేమి వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
బర్త్ కంట్రోల్ పిల్స్ తో సమస్యలు
ఈ మాత్రలు ఎక్కువకాలం వాడితే పీరియడ్స్ లో మార్పులు వస్తాయి. కొన్నిసార్లు రక్తస్రావం ఎక్కువగా లేదా తక్కువగా అవుతుంది. ఇది శరీరంలో హార్మోన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల చర్మంపై మొటిమలు రావడం, బరువు పెరగడం, లేదా ముఖంపై రోమాలు పెరగడం వంటి మార్పులు సంభవించవచ్చు. గర్భనిరోధక మాత్రలు రక్తంలో గడ్డలు ఏర్పడే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా ధూమపానం చేసే మహిళల్లో ఇది ప్రమాదకరం. గుండె సంబంధిత సమస్యలు లేదా రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు తీసుకోవడం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ క్యాన్సర్లు రావచ్చు
కొంతమందికి ఈ మాత్రలు వలన కాలేయంపై కూడా ప్రభావం చూపుతాయి. దీర్ఘకాలంగా వాడితే కాలేయ పనితీరు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పరిశోధనలు చూపించినట్లుగా, దీర్ఘకాలంగా ఈ మాత్రలు వాడడం వల్ల రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ సమస్యలు రావచ్చని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సూచనలతో ఇతర గర్భనిరోధక మార్గాలు వాడడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. గర్భనిరోధక మాత్రలు తాత్కాలికంగా గర్భధారణను నివారించడంలో సహాయం చేస్తాయి. కానీ అవి శరీరంపై కలిగించే ప్రభావం తెలుసుకోకుండా వాడకూడదు. వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాటిని తీసుకోవాలి.
మహిళలకు గర్భనిరోధక మాత్రల కన్నా కాపర్ టీ వాడడం ఉత్తమం. వీటివల్ల దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి. ప్రతి మహిళ శరీర పరిస్థితి వేరుగా ఉంటుంది. ఏ పద్ధతి సరిపోతుందో వైద్యుడి సలహా తీసుకుని నిర్ణయించుకోవాలి. వైద్య సూచన లేకుండా మాత్రలు లేదా ఇతర పద్ధతులు వాడితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సురక్షితమైన పద్ధతిని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆమె పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం. అన్నింటినీ సమతుల్యం చేయడానికి శక్తి అవసరం. అందుకే మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవాలి. సమతుల ఆహారం, పండ్లు, కూరగాయలు, నీరు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులు కూడా మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే, ఆమెతో పాటు మొత్తం కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది.