New Year’s Resolutions: సాధారణంగా కొత్త సంవత్సరం రాబోతుందంటే.. చాలామందిలో ఉత్సాహం, ఆనందం క్రమంగా పెరిగిపోతుంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది రిజల్యూషన్స్ అంటూ.. ‘ ఈ ఏడాది తప్పకుండా బరువు తగ్గాలి, జిమ్‌కి రెగ్యులర్‌గా వెళ్లాలి, డబ్బు ఆదా చేయాలి, చెడు అలవాట్లను మానేయాలి, ఫోన్ వాడకాన్ని తగ్గించాలి’ అని అనేక లక్ష్యాలను పెట్టుకుంటారు. జనవరి ఒకటో తారీఖు నూతనోత్సాహంతో ఈ నిర్ణయాలను మొదలు పెడతారు.
కానీ, ఆ ఉత్సాహం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోతుంది. దీంతో ఆ ఏడాది పెట్టుకున్న రిజల్యూషన్స్ విఫలమవుతాయి. అయితే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎందుకు విఫలమవుతాయో, వాటి వెనుకున్న కారణాలు ఏమిటో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే, మన లక్ష్యాలను నిజంగా సాధించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
బరువు తగ్గాలని పెట్టుకున్న మీ లక్ష్యాన్ని ఒక్కసారిగా నెరవేర్చాలి అనుకోవడం కష్టమే. ఉదాహరణకు గంట నడవాలనుకుంటే, మొదట 10 నిమిషాలు నడవటం ప్రారంచండి.ఆ తరువాత క్రమంగా సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
కొత్త ఏడాది ఉత్సాహం ఎక్కువకాలం నిలవదు.. రిజల్యూషన్స్‌పై ఆసక్తి కూడా తగ్గుతుంది. దీని కోసం మీరు అనుకున్న పనిని.. మీ రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ఇలా కొన్ని రోజుల క్రమపద్ధతిలో చేసుకుంటూ పోతే.. మీరు కష్టం అనుకున్న పనులే మీ జీవనశైలిలో భాగమైపోతాయి.
కొత్త ఏడాది రిజల్యూషన్ ఏమిటో కాగితం మీద రాసి అలానే వదిలేయడం కంటే, వాటిని ఎలా సాధించాలో ముందే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు బరువు తగ్గాలంటే మొదట వాకింగ్ స్టార్ట్ చేయాలా, జిమ్‌లో జాయిన్ అవ్వాలా లేదా యోగా క్లాసులకు వెళ్లాలా.. ఇలా ముందుగానే ప్లానింగ్ ఉండాలి. ఒకవేళ డబ్బు పొదుపు చేయాలనుకుంటే ఆ ఏడాది ఖర్చు ఎంత, ఆదాయం ఎంత.. ఇలా ముందుగానే నిర్ణయించుకోవాలి.
వర్కౌట్స్, డైట్, సేవింగ్స్ ఏదైనా కావొచ్చు. కొత్త ఏడాదిలో ఎంతో ఇష్టంగా ప్రారంభించి, క్రమం తప్పకుండా కొనసాగిస్తారు. కానీ, ఒక్కసారి మిస్ అయితే.. ఇక అంతా వృధా అయిపోయిందని చేతులెత్తేస్తారు. ఒక్క రోజే కదా మిస్ అయింది. దాంట్లో బాధపడాల్సిన విషయం ఏముందని మళ్లీ ప్రారంభిస్తే సరి అనుకోండి.
మనుషులందరూ ఒకేలా ఉండరు. అలాగే సమయం, శక్తి, ఆర్థిక సామర్థ్యాలు, అవసరాలు కూడా ఒకేలా ఉండవనే విషయాన్ని గ్రహించాలి. ఎదుటివాళ్లు ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తుంటే.. ఆ రిజల్యూషన్‌ను మీరూ తీసుకొని ఇబ్బందులు పడొద్దు. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరీ సామర్థ్యాన్ని బట్టి వారు రిజల్యూషన్స్ తీసుకోవాలి.
కొత్త ఏడాది రిజల్యూషన్స్‌ను ఓ డైరీలో రాసుకొని, రోజూ వాటిని సాధించి టిక్ పెట్టుకోవాలి. లేదంటే.. ఫోన్‌లో రిమైండర్ పెట్టుకొని క్రమం తప్పకుండా చూసుకోవాలి. వాటి గురించి వారం రోజులకోసారి సమీక్ష చేసి సంతృప్తికరమైన ఫలితాలు వస్తే.. మీకు మీరే బహుమతి ఇచ్చుకోండి. అలాగే మీరు తీసుకున్న రిజల్యూషన్స్ ఏంటో కుటుంబసభ్యులు, స్నేహితులతో చెప్పండి. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వాళ్లే మీ లక్ష్యాలను గుర్తుచేస్తూ ప్రోత్సహిస్తారు.