Instant glow face pack: ఖరీదైన బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా.. ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్ధాలతోనే ముఖాన్ని మెరిపించుకోవడం అందరికీ ఇష్టమే. హానికరమైన రసాయనాలు లేకుండా.. చర్మ స్వభావానికి తగినట్లుగా మనం తయారు చేసుకునే ఫేస్ ప్యాక్‌లు తక్షణ మెరుపును ఇస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు లేదా పార్టీలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సమయం తక్కువగా ఉంటే.. ఈ హోమ్‌మేడ్ ఫేస్ ప్యాక్‌లు అద్భుతంగా పని చేస్తాయి. ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఇవి ఒక సహజమైన పరిష్కారం.
ఇన్‌స్టంట్ గ్లో ఫేస్ ప్యాక్:
ప్రస్తుత కాలంలో కాలుష్యం, ఎండ, ఒత్తిడి కారణంగా ముఖం త్వరగా తన సహజమైన కాంతిని కోల్పోతుంది. చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి,తక్షణమే మెరుపును తెచ్చే కొన్ని బెస్ట్ హోం మేడ్ ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1.శనగపిండి,పెరుగు ఫేస్ ప్యాక్ :
శనగపిండి చర్మాన్ని శుభ్రపరిచే క్లెన్సర్‌గా పనిచేస్తే..పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది.
తయారీ:2 స్పూన్ల శనగపిండిలో,1 స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలపండి.
విధానం:ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి.ఇది జిడ్డు చర్మానికి చాలా మంచిది.
2.కాఫీ,తేనె ఫేస్ ప్యాక్ :
కాఫీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగు పరిచి ముఖాన్ని తాజాగా మారుస్తాయి.
తయారీ:1 స్పూన్ కాఫీ పొడిలో 1 స్పూన్ తేనె కలపండి.
విధానం: ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తూ అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖంపై ఉండే ట్యాన్ తొలగిపోయి ఇన్స్టంట్ గ్లో వస్తుంది.
3. పపాయ (బొప్పాయి),నిమ్మరసం :
బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ఎంజైమ్ చర్మ రంగును మెరుగు పరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
తయారీ:బాగా పండిన బొప్పాయి ముక్కను మెత్తగా చేసి, అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి.
విధానం: ఈ ప్యాక్‌ను ముఖానికి వేసుకుని ఆరిన తర్వాత కడిగేయండి.ఇది చర్మంపై ఉండే నల్లని మచ్చలను తగ్గిస్తుంది.
4. ముల్తానీ మిట్టి , రోజ్ వాటర్ :
జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది ఒక వరం.ఇది చర్మాన్ని బిగుతుగా మార్చి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
తయారీ:1 స్పూన్ ముల్తానీ మిట్టిలో తగినంత రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేయండి.
విధానం:ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి.
5. అరటిపండు, పాలు:
పొడి చర్మం ఉన్నవారు ఈ ప్యాక్‌ను ఎంచుకోవాలి.ఇది చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.
తయారీ:సగం అరటిపండును మెత్తగా చేసి అందులో 2 స్పూన్ల పాలు కలపండి.
విధానం:ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి కడగండి.
హోమ్‌మేడ్ ఫేస్ ప్యాక్స్ ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ప్యాచ్ టెస్ట్: ఏదైనా ప్యాక్ వేసుకునే ముందు చెవి వెనక భాగంలో కొద్దిగా రాసి పరీక్షించుకోండి.
క్లెన్సింగ్:ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
సమయం:ఫేస్ ప్యాక్‌లను 15-20 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.
సహజ సిద్ధం: వీలైనంత వరకు తాజాగా ఉండే పదార్ధాలనే వాడండి.
బ్యూటీ ప్రోడక్ట్స్‌పై వేల రూపాయలు ఖర్చు చేసే కంటే.. వంటింట్లో దొరికే ఈ సహజ పదార్థాలతో అందాన్ని పెంచుకోవడం ఆరోగ్యకరం. క్రమం తప్పకుండా వారానికి ఒకసారి మీ చర్మ స్వభావానికి తగిన ప్యాక్‌ను ఎంచుకుంటే.. వేసవిలో కూడా మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.