పుట్టిన బిడ్డలకు తల్లి పాలే ప్రధాన ఆహారం. ముఖ్యంగా పుట్టినప్పటి నుండి ఆరు నెలల వయసు వరకు బిడ్డ ఆరోగ్యం పూర్తిగా తల్లి పాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమంది తల్లులకు పాలు సరిగా పడకపోవడం సాధారణ సమస్య. అలాంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజువారీ ఆహారంలో కొన్ని సహజమైన పదార్థాలు చేర్చితే పాల ఉత్పత్తిని పెంచుతుంది.
మునక్కాయలు
పాలు ఉత్పత్తి కాక ఇబ్బంది పడుతున్న బాలింతలు మునక్కాయను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మునక్కాయ కూరతో పాటు రసం చేస్తే ప్రభావం ఇంకా ఎక్కువ. మునక్కాయలను శుభ్రంగా కడిగి, పొట్టు తీసి, మిక్సీలో రుబ్బి, నీళ్లు కలిపి వడకట్టి అరకప్పు రసం తాగితే పాల ఉత్పత్తి మెరుగవుతుంది. రోజుకు ఒక్కసారి తాగితే చాలు. అలాగే సోంపు గింజల్లో సహజంగా పాల ఉత్పత్తిని పెంచే గుణాలు ఉంటాయి. ఒక స్పూను సోంపును నీటిలో మరిగించి వడకట్టి ఆ నీటిని రోజులో రెండు మూడు సార్లు తాగితే శరీరంలో పాలను పెంచే హార్మోన్లు బాగా పనిచేస్తాయి.
మెంతులు
మెంతులు కూడా పాల ఉత్పత్తి పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మెంతుల్లో ఫైటోఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పాలను ఉత్పత్తి చేసే గ్రంధుల పనితీరును పెంచుతుంది. ఒక టీ స్పూన్ మెంతులను నీటిలో మరిగించి, వడకట్టి, అర గ్లాసు నీటిలో తేనె కలిపి రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. దాల్చిన చెక్క కూడా బాలింతలకు చాలా ఉపయోగకరమైనది. దీనితో టీ తయారు చేసి తాగవచ్చు. లేదంటే వేడి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి తాగినా పాల ఉత్పత్తి మెరుగవుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
వెల్లుల్లి, బాదం, మటన్…
వెల్లుల్లిలో పాల ఉత్పత్తిని పెంచే గుణాలు సహజంగా ఉంటాయి. నేరుగా తినలేని వారు కూరల్లో వేసుకుని తీసుకోవచ్చు. రెగ్యులర్‌గా తీసుకుంటే పాలు బాగా పడతాయి. బాదం పప్పు కూడా బాలింతలకు మేలు చేస్తుంది. రోజూ గుప్పెడు బాదం తింటే ఒమెగా–3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి లభించి పాల ఉత్పత్తి మెరుగవుతుంది. బాదం పాలు తాగడం కూడా సహజంగా శక్తిని ఇస్తుంది. మటన్‌లో లాక్టోజెనిక్ గుణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా పాలను కూడా పెంచుతుందని చెబుతున్నారు.
బాలింతలు ఆవు లేదా గేదె పాలను రోజూ తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే పాల ఉత్పత్తి పెరుగుతుంది. అయితే ఖాళీ పొట్టగా ఉన్నప్పుడు పాలు తాగడం మాత్రం మంచిది కాదు. రెండు గంటలకు ఒకసారి ఏదో తేలికైన ఆహారం తీసుకోవడం, శరీరాన్ని అలసట రాకుండా చూసుకోవడం, తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం. పాలు తగ్గడం అనేది శరీరానికి విశ్రాంతి లేకపోవడం, నీళ్లు తక్కువ తాగడం, ఒత్తిడి, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువ మంది మహిళల్లో పాలు సహజంగానే పెరుగుతాయి.