ప్రశ్న: నేను గత ఏడాదిగా నా ప్రియుడితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాము. ఇద్దరం ఒకే ఫ్లాట్లో కలిసి జీవిస్తున్నాము. నేనే మొదట ఆయనను ప్రేమించాను. అతనికి కొన్ని చెత్త అలవాట్లు ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడే అవే నన్ను విపరీతంగా బాధిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే అతను పరిశుభ్రంగా ఉండడు. ఇద్దరం కలిసి ఒకే ఫ్లాట్లో జీవిస్తూ ఉండడంతో నాకు అతని అపరిశుభ్రత చాలా భరించరానిదిగా మారింది. అతని గది అంతా గందరగోళంగా ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండదు. కనీసం ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా జాగ్రత్తగా దాచుకోడు. గంటల తరబడి అవసరమైనప్పుడు వెతుకుతూ ఉంటాడు. వంటగదిలో టీ చేయడానికి వెళ్లి కూడా అక్కడంతా చెత్త చెత్త చేసి వస్తాడు. అతనికి నేను ఎన్నోసార్లు చెప్పాను. వాదించాను. గొడవపడ్డాను. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ విషయాలను చాలా చిన్నవిగా చూస్తాడు. ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండాలంటేనే నాకు నరకంలా అనిపిస్తుంది. నాకు ఆ ఇంట్లో అడుగుపెట్టగానే అపరిశుభ్ర వాతావరణంలో కనీసం ఉండలేకపోతున్నాను. ఇప్పుడు అతనితో కలిసి ఉండాలా? విడిపోవాలా? అనేది అర్థం కావట్లేదు. దయచేసి మంచి పరిష్కారం చెప్పండి.
జవాబు: ప్రేమ సంబంధంలో ఉన్నప్పుడు ఇద్దరు మధ్య అర్థం చేసుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా అవసరం. అయితే ఇద్దరూ కలిసి ఉండే ఇల్లు కూడా అంతే అర్థవంతంగా ఉండాలి. ఒకరు పరిశుభ్రంగా ఉండే వ్యక్తి, మరొకరు అపరిశుభ్రంగా ఉండే వ్యక్తి అయితే వారిద్దరూ కలిసి జీవించడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ దుస్తులు పడేయడం, వాడిన వస్తువులు అలాగే వదిలేయడం, గది అల్లకల్లోలంగా ఉండడం… ఇవన్నీ మొదట ప్రేమలో ఉన్నప్పుడు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అది విపరీతమైన మెంటల్ స్ట్రెస్ కు కారణమవుతుంది. చిరాకు, అసంతృప్తికి దారి తీస్తుంది. చిందరవందరగా ఉండే వాతావరణం మనసుపై నేరుగా ప్రభావం చూపిస్తుందని మానసిక శాస్త్రం కూడా చెబుతోంది.
Also read: Pocket money: పదేళ్ల పిల్లాడికి ప్యాకెట్ మనీ ఇవ్వచ్చా? వాటి వల్ల లాభనష్టాలేంటి?
చుట్టూ అస్తవ్యస్తంగా ఉండే వాతావరణంలో మెదడు పూర్తిగా రిలాక్స్ కావడం కష్టం. ముఖ్యంగా అమ్మాయిలు శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇల్లే ఇలా ఉంచుకున్న వ్యక్తి .. జీవితం కూడా అలాగే ఉంచుతాడనే అవకాశం ఉంటుంది. బాధ్యతా, భావం అనేది చిన్న విషయాల నుంచే మొదలవుతుంది. పనులను వాయిదా వేసుకోవడం, ప్లాన్ లేకుండా జీవించడం, ఎలా పడితే అలా బతికేయడం వంటివి మంచి లక్షణాలున్న వ్యక్తికి ఉండవు. అలాంటప్పుడు అమ్మాయి మనసులో భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటాడనే సందేహం మొదలవుతుంది.
ఈ విషయంపై మీరు ఓపెన్ గా మాట్లాడటం చాలా అవసరం. కోపంగా అరవడం, నిందలు వేయడం వల్ల ఎలాంటి పరిష్కారాలు దక్కవు. మీ బాధను మీ బాయ్ ఫ్రెండ్ ను కూర్చోబెట్టి పూర్తిగా చెప్పండి. అతడిని కూడా సహనంగా వినమని చెప్పండి. ఒక్కరోజులో మార్పు రాకపోవచ్చు. ప్రతిరోజు ఎంతో కొంత మారడానికి ప్రయత్నించమనండి. అందుకు మీరు కూడా సహకరించండి. ఉదాహరణకు రోజులో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఇల్లు సర్దుకోవడానికి కేటాయించమని చెప్పండి. వారానికి ఒక్కసారి ఇద్దరూ కలిసి ఇల్లు క్లీన్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న లక్ష్యాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చెప్పినప్పటికీ ఆ వ్యక్తిలో మార్పు లేకపోతే మీ నిర్ణయం మీరు తీసుకోవడమే మంచిది. మీపై ప్రేమ, ఇష్టం ఉన్న వ్యక్తి మిమ్మల్ని వదులుకునే కన్నా.. ఇంటిని శుభ్రంగా ఉంచుకునేందుకు ఇష్టం చూపిస్తాడు. ఏదైనా మీరు పరస్పర గౌరవం, సహనంతో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇక తప్పదన్న పరిస్థితుల్లో మీ నిర్ణయం మీరు తీసుకునే స్వేచ్ఛ ఇప్పటికీ ఉంటుంది.