పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ఆశలతో స్వాగతించే సమయం ఇది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది కొన్ని ప్రత్యేక ఆహారాలను తింటారు. అవి అదృష్టం, సంపద, ఆరోగ్యం తీసుకువస్తాయని నమ్మకం ఎంతో మందిలో ఉంది. ఒక్కో ఆహారం ఒక్కో రూపంలో ఉంటుంది. కొన్ని గుండ్రంగా, కొన్ని పొడవుగా… వాటి ఆకారాల ఆధారంగా జీవితం సుఖసంతోషాలతో సాగుతుందనే నమ్మకం ఉంది. ఇప్పుడు అలాంటి అదృష్ట ఆహారాల గురించి ఇక్కడ ఇచ్చాము. ఒక్కో దేశంలో ఒక్కోలాంటి ఆహారాలను కొత్త ఏడాది మొదటి రోజు కచ్చితంగా తింటారు
12 ద్రాక్ష పండ్లు – స్పెయిన్
స్పెయిన్ దేశంలో న్యూ ఇయర్ అర్థరాత్రి 12 ద్రాక్ష పండ్లు తినే ఆచారం ఉంది. గడియారం మోగే ప్రతి గంట శబ్దానికి ఒక ద్రాక్ష తినాలి. మొత్తం 12 గంటల శబ్దాలు వస్తాయి. ప్రతి ద్రాక్ష కొత్త సంవత్సరంలోని ఒక్కో నెలను సూచిస్తుంది. 12 ద్రాక్షలు సమయానికి పూర్తిగా తినగలిగితే సంవత్సరం అంతా అదృష్టంగా ఉంటుందని నమ్మకం. ఈ సంప్రదాయం ఇప్పుడు అనేక లాటిన్ అమెరికా దేశాలలో కూడా పాటిస్తున్నారు.
బ్లాక్ ఐడ్ పీస్ – అమెరికా దక్షిణ ప్రాంతాలు
అమెరికా దక్షిణ ప్రాంతాలలో న్యూ ఇయర్ డే నాడు బ్లాక్ ఐడ్ పీస్ తినడం ఆనవాయితీ. ఇవి చిన్న బీన్స్ లాగా కనిపిస్తాయి. నాణేల ఆకారం ఉండటం వల్ల సంపద పెరుగుతుందని నమ్మకం. వీటిని బియ్యం, ఆకుకూరలతో కలిపి హాపిన్ జాన్ అనే వంటకం చేస్తారు. ఆకుకూరలు కరెన్సీ నోట్లను గుర్తు చేస్తాయి. కార్న్ బ్రెడ్ బంగారం రంగులో ఉంటుంది. ఈ వంటకం తింటే ఆర్థిక స్థితి మెరుగవుతుందని విశ్వాసం.
పప్పులు – ఇటలీ
ఇటలీలో న్యూ ఇయర్ సమయంలో పప్పు దినుసులతో చేసిన ఆహారం తినడం చాలా సాధారణం. ఇవి చిన్నగా గుండ్రంగా ఉంటాయి. వండినప్పుడు పరిమాణం పెరుగుతుంది. ఇది సంపద పెరుగుదలకు సంకేతంగా భావిస్తారు. న్యూ ఇయర్ అర్థరాత్రి తర్వాత లెంటిల్స్ తో పాటు పోర్క్ సాసేజ్ తింటారు. కొత్త సంవత్సరంలో డబ్బు కొరత లేకుండా ఉండాలని కోరుకుంటారు.
పోర్క్, సవర్ క్రౌట్ – జర్మనీ
జర్మనీ దేశంలో న్యూ ఇయర్ సమయంలో పోర్క్ వంటకాలు తినే సంప్రదాయం ఉంది. పంది ముందుకు తవ్వుకుంటూ వెళ్లే స్వభావం కలిగి ఉంటుంది. ఇది జీవితంలో పురోగతిని సూచిస్తుంది. సవర్ క్రౌట్ అనేది క్యాబేజీతో తయారు చేసే వంటకం. దీన్ని పొడవుగా కోసి ఉడికిస్తారు. దీర్ఘాయుష్షుకు ఇది సంకేతం. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ భోజనం చేస్తారు. కొత్త సంవత్సరం సంతోషంగా గడుస్తుందని నమ్మకం.
12 గుండ్రని పండ్లు – ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్ దేశంలో న్యూ ఇయర్ టేబుల్ పై 12 గుండ్రని పండ్లు పెట్టడం ఆనవాయితీ. నారింజ, ఆపిల్, ద్రాక్ష లాంటి పండ్లు ఎక్కువగా వాడతారు. గుండ్రని ఆకారం నాణేలను సూచిస్తుంది. 12 పండ్లు అంటే 12 నెలలు సంపదతో నిండుగా ఉండాలని అర్థం. ప్రతి నెలా అదృష్టంగా గడవాలనే కోరికతో ఇలా చేస్తారు.
పొడవైన నూడుల్స్ – జపాన్
జపాన్ దేశంలో న్యూ ఇయర్ ఈవ్ నాడు సోబా నూడుల్స్ తింటారు. ఇవి పొడవుగా ఉంటాయి. దీర్ఘాయుష్షు, ఆరోగ్యం సూచించే ఆహారం ఇది. తింటున్నప్పుడు నూడుల్స్ కత్తిరించకూడదనే నియమం ఉంది. నూడుల్స్ తెగిపోతే ఆయుష్షు తగ్గుతుందని భావిస్తారు. అందుకే జాగ్రత్తగా తింటారు.
దానిమ్మ పండు – గ్రీస్, టర్కీ
గ్రీస్, టర్కీ దేశాలలో దానిమ్మ పండుకు ప్రత్యేక స్థానం ఉంది. దానిమ్మలో గింజలు చాలా ఉంటాయి. ఎక్కువ గింజలు అంటే ఎక్కువ అదృష్టం అని నమ్మకం. కొందరు న్యూ ఇయర్ అర్థరాత్రి దానిమ్మ పండును నేలపై కొడతారు. ఎంత ఎక్కువ గింజలు చెల్లాచెదురుగా పడితే అంత ఎక్కువ శుభం కలుగుతుందని విశ్వాసం.