Home remedies for eyelash growth: మందపాటి, పొడవాటి కనురెప్పలు మీ కళ్లను మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి. చాలా మంది ఆర్టిఫిషియల్ ఐలాషెస్ లేదా రసాయనాలతో తయారు చేసిన సీరమ్స్ వాడుతుంటారు. కానీ అవి కళ్లకు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సహజ సిద్ధంగానే కనురెప్పలను పెంచుకోవడం అవసరం. సరైన పోషణ , కొన్ని హోం రెమెడీస్‌తో మీరు ఆకర్షణీయమైన కనురెప్పలను సొంతం చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. మీ కనురెప్పలను ఒత్తుగా, పొడవుగా మార్చుకునేందుకు సహాయపడే 5 అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ మెరిసే కళ్లు, ఒత్తైన కనురెప్పలను కోరుకుంటారు. కనురెప్పలు రాలిపోవడం లేదా పల్చగా ఉండటం అనేది పోషకాహార లోపం, ఒత్తిడి లేదా సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల జరగవచ్చు. ఇంట్లోనే దొరికే పదార్థాలతో వాటిని మెరుగుపరచుకోవచ్చు అదెలాగంటే..
1. ఆముదం మ్యాజిక్:
ఆముదంలో ఉండే విటమిన్ E, ఫ్యాటీ యాసిడ్స్ కనురెప్పల కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇవి కనురెప్పలు త్వరగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
ఎలా చేయాలి? రాత్రి పడుకునే ముందు ఒక కాటన్ బడ్ లేదా శుభ్రమైన మస్కారా బ్రష్ ఉపయోగించి కనురెప్పలకు ఆముదం రాయండి. మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోండి.
2. కొబ్బరి నూనెతో పోషణ:
కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కనురెప్పలను మాయిశ్చరైజ్ చేయడమే కాకుండా..అవి విరిగిపోకుండా రక్షణ కల్పిస్తాయి.
ఎలా చేయాలి? కొద్దిగా వర్జిన్ కోకోనట్ ఆయిల్‌ను వేళ్లపై తీసుకుని కనురెప్పలపై సున్నితంగా మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగు పరిచి జుట్టు పెరగడానికి సహాయ పడుతుంది.
3. గ్రీన్ టీ :
గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ కను రెప్పల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. ఇది కనురెప్పల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో అద్భుతంగా పని చేస్తుంది.
ఎలా చేయాలి? ఒక కప్పు గ్రీన్ టీని మరిగించి.. ఆ టీ నీటిని చల్లార్చండి. కాటన్ ప్యాడ్ సహాయంతో కనురెప్పలకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి.
4. విటమిన్ E ఆయిల్:
విటమిన్ E కనురెప్పలను మందంగా మార్చడానికి బాగా పని చేస్తుంది. ఇది వెంట్రుకల కుదుళ్లకు మంచి పోషణను అందిస్తుంది.
ఎలా చేయాలి? ఒక విటమిన్ E క్యాప్సూల్‌ను కట్ చేసి.. అందులోని నూనెను కనురెప్పలకు రాయండి. ఇది రెప్పలను మెరిసేలా చేస్తుంది.
5. సరైన ఆహారం, లైఫ్ స్టైల్:
పై చిట్కాలతో పాటు మనం తినే ఆహారం కూడా కనురెప్పల ఎదుగుదలకు కారణమవుతుంది.
ప్రోటీన్ , బయోటిన్: గుడ్లు, నట్స్, ఆకుకూరలు , పండ్లను మీ ఆహారంలో చేర్చుకోండి. బయోటిన్ అధికంగా ఉండే ఆహారం జుట్టు పెరుగుదలకు మంచిది.
మేకప్ తొలగించడం: రాత్రి నిద్రపోయే ముందు కంటి మీద ఉన్న మేకప్‌ను తప్పని సరిగా తొలగించండి. మేకప్‌తో నిద్రపోవడం వల్ల కనురెప్పలు బలహీనపడి రాలిపోతాయి.
Also Read: జీన్స్ ఉతకడం విషయంలో.. చాలా మంది చేసే తప్పులు ఇవే !
జాగ్రత్తలు:
ఏ నూనె రాసినా కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించండి.
కంటికి అలర్జీలు ఉంటే.. ఏదైనా రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.
కనురెప్పలను గట్టిగా రుద్దడం మానేయండి.
సహజ పద్ధతులు ఏవైనా ఫలితాన్ని ఇవ్వడానికి కొంత సమయం తీసుకుంటాయి. మీరు పైన పేర్కొన్న చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే.. కొద్ది వారాల్లోనే మీ కనురెప్పల ఒత్తుగా మారడంతో పాటు, పొడవులో స్పష్టమైన మార్పును కూడా మీరు గమనించవచ్చు. సహజమైన అందం ఎప్పుడూ సురక్షితం.