Gutti Vankaya curry recipe: తెలుగు రాష్ట్రాల రుచుల్లో ‘గుత్తి వంకాయ కూర’ అనగానే నోట్లో నీళ్లు ఊరాల్సిందే! పెళ్లి భోజనాలైనా, పండగ విందులైనా ఈ కూర లేనిదే భోజనం పూర్తి కాదు. సాధారణంగా గుత్తి వంకాయను మసాలా పొడులతో లేదా వేయించిన నూనె దినుసులతో చేస్తుంటారు. కానీ.. అప్పటికప్పుడు దంచిన పచ్చి కారంతో చేసే.. పచ్చికారం గుత్తి వంకాయ కూర టేస్ట్ మాత్రం వేరు లెవెల్ అని చెప్పాలి. పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్రతో.. కూడిన పచ్చి కారంతో వండే ఈ వంటకం వేడి వేడి అన్నంలోకి, సాంబార్ అన్నంలోకి లేదా చపాతీలోకి తింటే ఆ మజాయే వేరు. ఈ ట్రెండీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
గుత్తి వంకాయలు : పావు కిలో
పచ్చిమిర్చి: 10 నుంచి 12
అల్లం & వెల్లుల్లి రెబ్బలు: కొద్దిగా
ధనియాలు & జీలకర్ర: 1 స్పూన్ చొప్పున
ఉల్లిపాయలు & టమాటాలు: 2
నూనె, పసుపు, ఉప్పు: సరిపడినంత
తాళింపు గింజలు & కరివేపాకు: కొద్దిగా
1.ముందుగా గుత్తి వంకాయలను శుభ్రంగా కడిగి, తొడిమలు ఉంచి నాలుగు చీలికలుగా కోసుకోవాలి. వంకాయలు కరెక్ట్ గా.. ఉన్నాయా లేదో చూసుకోవాలి. కట్ చేసిన వంకాయలను కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో వేయాలి. దీని వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. తర్వాత ఒక రోలు లేదా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా (మరీ మెత్తగా కాకుండా) గ్రైండ్ చేసుకోవాలి. ఇదే ఈ కూరకి అసలైన రుచిని ఇస్తుంది.
2.ఉప్పు నీటిలో నుంచి వంకాయలను తీసి, మనం సిద్ధం చేసుకున్న పచ్చికారాన్ని ప్రతీ వంకాయ చీలిక లోపలికి బాగా పట్టించాలి (స్టఫ్ చేయాలి). మిగిలిన కారాన్ని కూర గ్రేవీ కోసం పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి తగినంత నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసి పోపు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోరు వెచ్చని రంగు వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను గిన్నెలో వేసి మీడియం ఫ్లేమ్‌పై నూనెలో మగ్గించాలి. వంకాయలు మెత్తబడే.. వరకు మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
3. వంకాయలు బాగా మగ్గిన తర్వాత.. మిగిలిన పచ్చి కారం, కొద్దిగా.. టమాటా గుజ్జు లేదా పసుపు వేసి బాగా కలపాలి. కూరలో.. గ్రేవీ కోసం కొద్దిగా నీరు పోసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా సన్నగా.. తరిగిన కొత్తి మీర చల్లుకొని దించేయాలి. అంతే..గుమగుమలాడే పచ్చికారం గుత్తి వంకాయ కూర రెడీ!
రోజూ తినే రొటీన్ కూరలతో బోర్ కొట్టిందా? అయితే ఈసారి ఈ ట్రెండీ పచ్చికారం గుత్తి వంకాయ కూరను ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కూరతో తింటే.. ఆ రుచి మరువలేరు. చపాతీలోకి కూడా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే మీ కిచెన్‌లో ఈ రెసిపీని ట్రై చేయండి.