పాలక్ ఊతప్పం అనేది ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి. ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీలు, గారెలు, ఉప్మాలే కాదు అప్పుడప్పుడు పాలకూర ఊతప్పం చేసుకున్నా మంచిదే. ఇది రుచికరంగా ఉండటమే కాక, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పాలకూరలో ఉండే ఐరన్, విటమిన్లు, ఫైబర్ శరీరానికి శక్తినివ్వడంలో, రక్తహీనతను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరికి ఇది పోషకాలను అందిస్తుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పాలకూర ఊతప్పం రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – 3 కప్పులు
మినప్పప్పు – 1 కప్పు
తాజా పాలకూర – 1 కప్పు
టమాటా – 1 లేదా 1/2 కప్పు పేస్ట్ చేసినది
ఉల్లిపాయ తరుగు – 1/2 కప్పు
క్యాప్సికం – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – అర స్పూన్
నూనె – సరిపడినంత
తురిమిన చీజ్ – రెండు స్పూన్లు
పాలకూర ఊతప్పం రెసిపీ
1. ముందుగా బియ్యం, మినప్పప్పును వేరుగా శుభ్రంగా కడిగి 6 నుంచి 8 గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టండి.
2. బియ్యం,మినప్పప్పు నానిన తర్వాత వాటిని కలిపి మిక్సీలో మెత్తగా పిండిగా మిక్స్ చేయండి. పిండిని చాలా పలుచగా కాకుండా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి.
3. ఈ పిండిలో ఉప్పు వేసి బాగా కలపాలి. పిండిని మూత పెట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పులియబెట్టాలి.
4. పాలకూరను శుభ్రంగా కడిగి, కొద్దిగా నీటిలో ఉడకబెట్టి మిక్సీలో పేస్ట్‌లా మార్చండి.
5. స్టవ్ మీద కళాయి పెట్టాలి. అందులో నూనె వేసి ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి.
6. తర్వాత టమాటా పేస్ట్, పాలక్ పేస్ట్ కలిపి 2–3 నిమిషాలు మెత్తగా వేయించాలి.
7. అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి.
8. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి కొద్దిగా నూనె వేయాలి.
పిండిని ఒక కప్పుతో తీసుకొని మధ్యలో వేసి గుండ్రంగా ఊతప్పంలా చేసుకోవాలి.
9. దీనిపై పాలకూర టమాటా మిశ్రమాన్ని వేయాలి. తురిమిన చీజ్ లేదా క్యాప్సికం ముక్కలను మిశ్రమంపై చల్లుకోవాలి.
10. తర్వాత మూత పెట్టి మరోవైపు కూడా కొన్ని నిమిషాలు ఉడికించండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు చిన్నమంట మీద కాల్చుకోవాలి. అంటే పాలకూర ఊతప్పం రెడీ అయినట్టే.
ఈ పాలకూర ఊతప్పాన్ని కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ లేదా సాంబార్‌తో తింటే రుచిగా ఉంటుంది. పాలకూరలో ఉండే ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రోటీన్ శరీర కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.