అనకాపల్లిలో పట్టపగలే జరిగిన బ్యాంకు దోపిడీ యత్నం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒక మహిళా మేనేజర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల కోట్లాది రూపాయల నగదు సురక్షితంగా మిగిలింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అనకాపల్లి పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే రింగ్‌రోడ్ సమీపంలో గల కెనరా బ్యాంకు శాఖ లక్ష్యంగా దుండగులు ఈ దోపిడీకి పెద్ద ప్లానే చేశారు. మధ్యాహ్నం సమయంలో బ్యాంక్ కార్యకలాపాలు సాధారణంగా సాగుతుండగా.. రెండు వాహనాల్లో సుమారు ఏడుగురు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు బయట కాపలా ఉండగా, ఐదుగురు దుండగులు మారణాయుధాలతో బ్యాంకు లోపలికి ప్రవేశించారు.
మహిళా మేనేజర్ సాహసం
బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు నేరుగా మేనేజర్ క్యాబిన్‌లోకి వెళ్లారు. అక్కడ ఉన్న మహిళా మేనేజర్‌ను తుపాకీతో బెదిరించి.. నగదు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొన్నప్పటికీ.. మేనేజర్ ఏమాత్రం అధైర్యపడలేదు. ప్రాణాలకు తెగించి అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. దుండగుల కళ్ళు గప్పి ఆమె వెంటనే టేబుల్ కింద ఉన్న అత్యవసర సైరన్ నొక్కారు.
నివ్వెరపోయిన దొంగలు.. పోలీసుల రంగప్రవేశం
సైరన్ మోతతో బ్యాంకు పరిసరాలు ఒక్కసారిగా మారుమోగాయి. సైరన్ శబ్దానికి భయాందోళన చెందిన దుండగులు.. పట్టుబడతామనే భయంతో తాము తెచ్చిన వాహనాల్లో అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు ఎస్పీ మోహన్ రావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు సిబ్బంది నుంచి వివరాలు సేకరించి, దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు.
గాలింపు చర్యలు ముమ్మరం
పట్టపగలే జనసంచారం ఉన్న ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో ఖాతాదారులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ప్రస్తుతం బ్యాంకులోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని సేకరించి, నిందితుల ఆనవాళ్లను గుర్తించే పనిలో పడ్డారు. పట్టణంలోని అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేసి, దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మేనేజర్ సమయస్ఫూర్తిని పోలీసులు, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
ALSO READ: Top 20 News: కేటీఆర్‌పై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి ఫైర్, అల్లుడు సహాయంతో భర్తను చంపిన భార్య