నడుము రెండు వైపులా పేరుకుపోయే కొవ్వును సాధారణంగా లవ్ హ్యాండిల్స్ అని పిలుస్తారు. ఎక్కువసేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ కొవ్వు త్వరగా పెరుగుతుంది. ఒకసారి ఈ ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతే తగ్గించడం కాస్త కష్టమే. అయితే ప్రతిరోజూ కేవలం 15 నిమిషాలు కొన్ని ప్రత్యేక వ్యాయామాలు చేస్తే నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకోవచ్చు. సరైన ఆహారంతో పాటు ఈ వ్యాయామాలను పాటిస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది.
బైసికిల్ క్రంచెస్ పొట్ట పైభాగం, నడుము పక్కల కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడే వ్యాయామం. ఇది కోర్ కండరాలను కూడా బలపరుస్తుంది. ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. రెండు చేతులను తల వెనుక ఉంచాలి. కాళ్లను కొద్దిగా పైకి ఎత్తాలి. కుడి మోకాలిని ఛాతీ వైపు తీసుకొచ్చి ఎడమ మోచేతితో తాకేలా ప్రయత్నించాలి. తర్వాత అదే విధంగా మరోవైపు చేయాలి. నెమ్మదిగా, నియంత్రణతో చేయడం ముఖ్యం. ప్రతిరోజూ 3 సెట్లు చేయాలి. ప్రతి సెట్‌లో 15 నుంచి 20 సార్లు చేయడం మంచిది.
రష్యన్ ట్విస్ట్స్.. నడుము పక్క భాగాన్ని టోన్ చేయడంలో సహాయపడతాయి. ఇవి కోర్ బలాన్ని కూడా పెంచుతాయి. మ్యాట్‌పై కూర్చొని మోకాళ్లను కొద్దిగా వంచాలి. పాదాలను నేల నుంచి స్వల్పంగా పైకి ఎత్తాలి. శరీరాన్ని కొద్దిగా వెనక్కి వంచి బ్యాలెన్స్ చేయాలి. రెండు చేతులను కలిపి కుడి, ఎడమ వైపులకు శరీరాన్ని తిప్పాలి. అవసరమైతే చేతిలో వాటర్ బాటిల్ పట్టుకోవచ్చు.
మూడు సెట్లు చేయాలి. ప్రతి సెట్‌లో 20 సార్లు చేయాలి.
సైడ్ ప్లాంక్ నడుము, కోర్, దిగువ వెన్ను కండరాలను బలపరుస్తుంది. అలాగే శరీర సమతుల్యతను కూడా మెరుగుపరుస్తుంది.
ఒక వైపు పడుకుని మోచేతిని భుజం కింద ఉంచాలి. మోచేతి మరియు పాదాల సహాయంతో శరీరాన్ని పైకి ఎత్తాలి. తల నుంచి పాదాల వరకు శరీరం ఒకే లైన్‌లో ఉండాలి. ఈ స్థితిలో 20 నుంచి 30 సెకన్లు ఉండాలి. తర్వాత మరో వైపు కూడా ఇదే విధంగా చేయాలి.
ప్రతి వైపు రెండు సార్లు చేయడం మంచిది.
హీల్ టచెస్ నడుము పక్కల కండరాలపై నేరుగా పనిచేస్తాయి. ఈ వ్యాయామం ప్రారంభకులకు కూడా చాలా సులభం. వెల్లకిలా పడుకుని మోకాళ్లను వంచాలి. పాదాలను నేలపై ఉంచాలి. భుజాలను కొద్దిగా పైకి లేపాలి. కుడి చేతితో కుడి మడమను తాకాలి. తర్వాత ఎడమ చేతితో ఎడమ మడమను తాకాలి. మెడపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తపడాలి.
మూడు సెట్లు చేయాలి. ప్రతి సెట్‌లో 20 నుంచి 25 సార్లు చేయాలి.
ఈ వ్యాయామం శరీరంలోని క్యాలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది. అలాగే లవ్ హ్యాండిల్స్ తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. పుష్ అప్ స్థితిలో నిలవాలి. కుడి మోకాలిని ఎడమ మోచేతి వైపు తీసుకురావాలి. మళ్లీ మొదటి స్థితికి రావాలి. తర్వాత ఎడమ మోకాలిని కుడి మోచేతి వైపు తీసుకురావాలి. ఒకే వేగంతో ఈ కదలికను కొనసాగించాలి.
30 నుంచి 45 సెకన్ల పాటు చేయాలి. మొత్తం మూడు సెట్లు పూర్తి చేయాలి.
Also Read: ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి
వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా పాటించాలి. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, బర్గర్లు, పిజ్జాలు వంటి జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. సరిపడా నిద్రపోవాలి. ఇవన్నీ కలిసి నడుము చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
లవ్ హ్యాండిల్స్ ఒక్కరోజులో తగ్గవు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఈ 5 వ్యాయామాలు చేస్తే కొద్ది వారాల్లోనే నడుము ఆకృతిలో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది.