Tips For Teeth: పంటి ఆరోగ్యం కేవలం తెల్లని రంగులో లేదు. వాటిని రక్షించే ‘ఎనామిల్’ పొరలో ఉంది. ఎనామిల్ అనేది దంతాల పైన ఉండే రక్షణ కవచం. ఇది ఒక సారి దెబ్బతింటే మళ్ళీ సహజంగా పుట్టుకురాదు. మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటూనే, మనం తినే ఆహారం లేదా శుభ్రం చేసే పద్ధతులతో ఆ పొరను కరిగించేస్తుంటారు. ఫలితంగా.. సెన్సిటివిటీ, పళ్లు పుచ్చిపోవడం వంటి సమస్యలు వస్తాయి. పంటి ఎనామిల్‌ను బలహీనపరిచే 5 సాధారణ తప్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పంటి ఎనామిల్ అనేది మన దంతాలను వేడి, చలి, రసాయనాల నుంచి కాపాడే ఒక దృఢమైన కవచం. అయితే.. ఇది ఎముకల లాగా తిరిగి పెరగదు. కాబట్టి దీనిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం రోజూ చేసే ఈ 5 తప్పులు ఎనామిల్‌ను క్రమంగా కరిగించేస్తాయి.
1. అధికంగా ఆమ్ల గుణం ఉన్న ఆహారాలు, డ్రింక్స్:
మనం తాగే సోడాలు, ఎనర్జీ డ్రింక్స్ , నిమ్మరసం వంటి సిట్రస్ డ్రింక్స్ యాసిడ్ (ఆమ్లం) ఎక్కువగా ఉంటుంది. ఈ ఆమ్లాలు ఎనామిల్‌ను మెత్తబరుస్తాయి. చాలా మంది పండ్ల రసాలు తాగిన వెంటనే లేదా సోడా తాగినప్పుడు అది పళ్లకు తగలకుండా స్ట్రా వాడరు. దీని వల్ల ఆమ్లాలు నేరుగా ఎనామిల్‌పై దాడి చేసి దానిని కరిగించేస్తాయి.
2. బలంగా బ్రష్ చేయడం :
ఎక్కువ సేపు లేదా చాలా బలంగా బ్రష్ చేస్తే పళ్లు త్వరగా తెల్లబడతాయని చాలామంది నమ్ముతారు. కానీ ఇది ఒక పెద్ద తప్పు. గట్టి బ్రష్‌లను వాడటం లేదా పళ్లను తోముతున్నప్పుడు ఎక్కువ ఒత్తిడి కలిగించడం వల్ల ఎనామిల్ అరిగిపోతుంది. దీని వల్ల పంటి లోపల ఉండే ‘డెన్టిన్’ బయటపడి, పళ్లు పసుపు రంగులోకి మారడమే కాకుండా జివ్వుమని లాగడం మొదలవుతుంది. ఎల్లప్పుడూ ‘సాఫ్ట్’ బ్రష్‌ను వాడటం ఉత్తమం.
3. భోజనం చేసిన వెంటనే బ్రష్ చేయడం :
ముఖ్యంగా ఆమ్ల గుణం ఉన్న ఆహారం (సిట్రస్ పండ్లు, సోడా, స్వీట్లు) తిన్న వెంటనే బ్రష్ చేయకూడదు. ఎందుకంటే ఆమ్లం వల్ల ఎనామిల్ తాత్కాలికంగా మెత్తబడుతుంది. ఆ సమయంలో బ్రష్ చేస్తే ఎనామిల్ పొర సులభంగా ఊడిపోతుంది. తిన్న తర్వాత కనీసం 30 నుంచి 60 నిమిషాల వరకు వేచి ఉండాలి. ఈలోపు నోటిని మంచి నీటితో పుక్కిలించడం వల్ల లాలాజలం ఆమ్లాలను తటస్థీకరిస్తుంది.
4. దంతాలను పనిముట్లుగా వాడటం :
కూల్ డ్రింక్ బాటిల్ క్యాప్‌లను పళ్లతో తీయడం, ప్లాస్టిక్ కవర్లను కొరకడం, దారాలను తెంపడం లేదా గోళ్లను కొరకడం వంటివి ఎనామిల్‌కు తీవ్ర నష్టం కలిగిస్తాయి. పళ్లు కేవలం ఆహారాన్ని నమలడానికి మాత్రమే. ఇలాంటి పనులు చేయడం వల్ల ఎనామిల్‌పై చిన్న చిన్న పగుళ్లు ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో పన్ను విరిగిపోవడానికి దారితీస్తాయి.
Also Read: మీ బాడీ లాంగ్వేజ్ ఏం చెబుతోంది? కాలు ఆడించే వారి 10 లక్షణాలు ఇవే
5. పళ్లను నూరడం :
చాలామంది ఒత్తిడి వల్ల లేదా నిద్రలో తెలియకుండానే పళ్లను ఒకదానికొకటి గట్టిగా నూరుతుంటారు. దీనిని ‘బ్రక్సిజం’ అంటారు. ఇలా చేయడం వల్ల ఎనామిల్ పైపొరలు ఒకదానికొకటి రాపిడికి గురై పూర్తిగా అరిగిపోతాయి. పళ్లు మొద్దుబారిపోవడానికి, దవడ నొప్పులకు ఇది ప్రధాన కారణం. ఈ అలవాటు ఉన్నవారు డాక్టర్ సలహాతో ‘మౌత్ గార్డ్’ వాడటం మంచిది.
ఎనామిల్‌ను కాపాడుకోవడానికి చిట్కాలు:
ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడండి. ఇది ఎనామిల్‌ను తిరిగి గట్టిపరుస్తుంది.
షుగర్ లేని గమ్ నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి దంతాలను రక్షిస్తుంది.
రోజుకు తగినంత నీరు తాగడం వల్ల నోటిలో ఆమ్లాల ప్రభావం తగ్గుతుంది.