Ginger Tea: అల్లం టీ తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు అల్లం టీ ఒక అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగు పరచడంలో అంతే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో.. అల్లం పాత్ర కీలకం. అయితే.. రుచిగా ఉంది కదా అని లేదా ఆరోగ్యంనికి మంచిదే కదా అని రోజులో ఎక్కువ సార్లు అల్లం టీ తాగుతున్నారా? అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే. అల్లం టీని అతిగా తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్, ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలి అనే విషయాలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం టీ అతిగా ప్రమాదమే..
అల్లం టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కానీ.. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 4 గ్రాముల కంటే ఎక్కువ అల్లం తీసుకోకూడదు. అంతకు మించి తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన నష్టాలు ఇవే..
1. జీర్ణకోశ సమస్యలు:
అల్లం జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ.. అది మోతాదు మించితే రివర్స్ అవుతుంది. అల్లం స్వభావరీత్యా వేడిని కలిగి ఉంటుంది. అతిగా తినడం వల్ల..
కడుపులో మంట : అల్లం టీ ఎక్కువగా తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి, గుండెల్లో మంట లేదా ఎసిడిటీకి దారితీస్తుంది.
విరోచనాలు: అధిక మొత్తంలో అల్లం తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ వేగవంతమై విరోచనాలు వచ్చే అవకాశం ఉంది.
గ్యాస్ ,ఉబ్బరం: కొంత మందిలో అల్లం టీ అతిగా తాగడం వల్ల కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు.
2. తక్కువ రక్తపోటు:
అల్లం రక్తపోటును తగ్గించడంలో సహాయ పడుతుంది. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిదే కానీ.. ఇప్పటికే సాధారణ లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు అతిగా అల్లం టీ తాగితే.. వారి బీపీ మరింత పడిపోయి కళ్ళు తిరగడం, నీరసం వంటి సమస్యలు రావచ్చు.
3. రక్తస్రావం అయ్యే ప్రమాదం:
అల్లం రక్తాన్ని పల్చగా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.
ఎవరైనా సర్జరీ చేయించుకోబోతున్నా లేదా సర్జరీ జరిగిన కొత్తలో ఉన్నా అల్లం టీకి దూరంగా ఉండాలి.
రక్తం గడ్డకట్టడానికి వాడే మందులు వాడే వారు అల్లం టీని అతిగా తీసుకుంటే అంతర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.
4. గర్భధారణ సమయంలో జాగ్రత్తలు:
గర్భిణీలు ఉదయపు వికారం తగ్గించుకోవడానికి అల్లం వాడుతుంటారు. కానీ.. రోజుకు 1 గ్రాము కంటే ఎక్కువ అల్లం తీసుకోవడం గర్భస్థ శిశువుపై ప్రభావం చూపవచ్చు. ఇది గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి గర్భిణీలు డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి.
5. నిద్రలేమి సమస్యలు:
చాలా మంది తలనొప్పి తగ్గడానికి రాత్రిపూట అల్లం టీ తాగుతారు. కానీ అల్లంలోని గాఢత మెదడును చురుగ్గా ఉంచి నిద్రను దూరం చేస్తుంది. దీని వల్ల రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
అల్లం టీని ఎంత తాగాలి?
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల అల్లం టీ సరి పోతుంది. టీ తయారు చేసేటప్పుడు అల్లం ముక్కను చిన్నగా వాడటం లేదా తక్కువ మోతాదులో అల్లం పొడిని వాడటం మంచిది.
అల్లం టీ ఒక అద్భుతమైన హెర్బల్ డ్రింక్. దీనివల్ల కలిగే ప్రయోజనాలను పొందాలంటే దానిని ఔషధంలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు లేదా దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుతున్నప్పుడు అల్లం టీని అలవాటు చేసుకునే ముందు డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం.