వయసు పెరిగే కొద్దీ చాలా మంది బరువు తగ్గడంపై లేదా బయటకు కనిపించే కండరాలను పెంచుకోవడంపై దృష్టి పెడతారు. అయితే నిజమైన ఆరోగ్యం కేవలం శరీర ఆకృతితో నిర్ణయించబడదు. మన శరీరంలో కనిపించకుండా ఉన్న కొన్ని ముఖ్యమైన కండరాలు ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి ఎంతో కీలకం. అమెరికాకు చెందిన ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ జెస్సికా స్వాన్సన్ ప్రకారం నాలుగు ముఖ్యమైన కండరాల బలం.. మన దీర్ఘాయుష్షు, చురుకుదనం, స్వతంత్ర జీవనానికి సంకేతాలుగా పనిచేస్తాయి. వీటిని ఇంట్లోనే కొన్ని సులభమైన పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు.
.
గ్రిప్ స్ట్రెంగ్త్ అంటే వస్తువులను ఎంత బలంగా పట్టుకోగలమన్నది. ఇది కేవలం చేతి బలం మాత్రమే కాదు, నరాల వ్యవస్థ, కండరాలు, గుండె ఆరోగ్యం మరియు మెదడు పనితీరుకు కూడా సూచికగా భావిస్తారు. పరిశోధనల ప్రకారం బలహీనమైన గ్రిప్ స్ట్రెంగ్త్ ఉన్నవారిలో ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు.
చేతి కండరాలను పరీక్షించేందుకు ఒక బలమైన రాడ్‌ను పట్టుకుని వేలాడవచ్చు. 50 ఏళ్ల లోపు పురుషులు కనీసం 30 సెకన్లు, మహిళలు కనీసం 20 సెకన్లు వేలాడగలిగితే మంచి గ్రిప్ స్ట్రెంగ్త్ ఉన్నట్లు భావించవచ్చు.
గ్లూట్ కండరాలు (పిరుదుల కండరాలు) నడవడం, మెట్లు ఎక్కడం, శరీర సమతుల్యతను నిలబెట్టడంలో ముఖ్యమైనవి. వయసు పెరిగేకొద్దీ ఈ కండరాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో పడిపోవడం, గాయాల ప్రమాదం పెరుగుతుంది.
ఈ కండరాల బలాన్ని తెలుసుకోవడానికి కళ్లను మూసుకుని ఒక కాలిపై నిలబడాలి. 50 ఏళ్ల లోపు వ్యక్తులు కనీసం 10 సెకన్ల పాటు తడబడకుండా నిలబడగలిగితే మంచి సమతుల్యత ఉందని చెప్పవచ్చు.
కాళ్ల వెనుక భాగంలో ఉండే కాఫ్ కండరాలు (కాలి పిక్క కండరాలు) నడవడం, నిలబడటం మరియు రోజువారీ కదలికలకు అవసరం. అనారోగ్యం లేదా గాయం తర్వాత శరీరం ఎంత త్వరగా కోలుకుంటుందో కూడా వీటి బలం ద్వారా అంచనా వేయవచ్చు. ఒక కాలిపై నిలబడి మడమను పైకి ఎత్తే వ్యాయామం చేయాలి. 40 ఏళ్ల లోపు వ్యక్తులు ప్రతి కాలిపై కనీసం 25 సార్లు ఈ వ్యాయామాన్ని ఆపకుండా చేయగలిగితే కాఫ్ కండరాలు బలంగా ఉన్నట్లు భావిస్తారు.
ఈ కండరం ఛాతీ భాగం, ఉదర భాగం మధ్య ఉంటుంది. సరిగా చెప్పాలంటే ఊపిరితిత్తుల కింద ఉంటుంది. ఇది గోపురం ఆకారంలో ఉంటుంది. డయాఫ్రామ్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన కండరాల్లో ఒకటి. ఇది శ్వాసక్రియను నియంత్రిస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. వయసు పెరిగేకొద్దీ దీని బలం తగ్గవచ్చు. దీంతో లోతుగా శ్వాస తీసుకోవడం, దగ్గు ద్వారా శ్వాసనాళాలను శుభ్రపరచడం కష్టమవుతుంది. దీన్ని పరీక్షించడానికి లోతుగా శ్వాస తీసుకుని సౌకర్యంగా ఊపిరిని ఆపి ఉంచాలి. 30 సెకన్ల పాటు సులభంగా ఊపిరి బిగపట్టగలిగితే డయాఫ్రామ్ పనితీరు బాగుందని చెప్పవచ్చు.
Also Read: ఈ చిన్న చిన్న అలవాట్లే మీ వ్యక్తిత్వాన్ని బలోపేతం చేస్తాయి.. మీ జీవితాన్ని మార్చే చాణక్య సూత్రాలు
గ్రిప్ స్ట్రెంగ్త్, పిరుదులు, కాలి పిక్క కాఫ్ కండరాలు, డయాఫ్రామ్ కలిసి శరీర కదలికలు, సమతుల్యత, శ్వాసక్రియ నియంత్రణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటి బలం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ కండరాలను బలంగా ఉంచుకోవచ్చు.
దీర్ఘాయుష్షు కేవలం బరువు లేదా శరీర ఆకృతిపై ఆధారపడదు. శరీరంలోని ముఖ్యమైన కండరాల బలం కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ నాలుగు కండరాల పనితీరును అప్పుడప్పుడు పరీక్షించుకోవడం ద్వారా ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకుని, భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే నివారించవచ్చు.